కొద్ది రోజుల క్రితం హైదరాబాద్ జూబ్లీహిల్స్ టీవీ 5 ప్రధాన కార్యాలయం సెక్యూరిటీ రూమ్ అద్దాలను గుర్తుతెలియని వ్యక్తులు పగలగొట్టడం, దీనిపై సదరు టీవీ యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేయడం, ఆ తర్వాత సదరు చానల్ లో దీనిపై నిరంతరం కథనాలు వేస్తూ, ఉద్దేశపూర్వకంగానే తమ చానల్ కార్యాలయంపై రాళ్ల దాడి చేశారని, దీని వెనుక రాజకీయ కారణాలు ఉన్నాయని, ముఖ్యంగా ఏపీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తాము వ్యతిరేకంగా కథనాలు ప్రచారం చేస్తున్నాము అనే ఉద్దేశంతో ఆ పార్టీ నాయకులు ఈ దాడికి పాల్పడ్డారంటూ, అదేపనిగా కథనాలు వస్తూనే ఉన్నాయి. ఇక దీని పై ఏపీలోనూ పెద్ద ఎత్తున రాజకీయ దుమారం చెలరేగింది. ముఖ్యంగా టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్ ఈ వ్యవహారాన్ని మరింత పెద్దదిగా చేస్తూ వైసీపీ ని ఉద్దేశించి విమర్శలు చేశారు. అలాగే జనసేన పార్టీ అధినేత పవన్ సైతం ఈ దాడిని ఖండించారు.

 
 ఇక జర్నలిస్టు సంఘాలు సైతం రంగంలోకి దిగి ఈ ఘటనను ఖండించాయి. దీనిని మీడియా పై దాడి గా భావిస్తూ అందరూ సదరు ఛానల్ కు సంఘీభావం తెలపడం, ఆ చానల్ లో వైసీపీకి వ్యతిరేకంగా తమ పని చేస్తున్నాం కాబట్టి మీడియా పై దాడి చేశారంటూ అదే పనిగా కథనాలు ప్రచారం చేస్తూ హడావుడి చేయడం జరుగుతోంది. ఒక అద్దం పగిలింది అందుకే ఇంత హడావుడిగా అంటూ సదరు ఛానల్ ను కొంతమంది తిట్టుకోగా,  మరికొంతమంది మాత్రం అయ్యో పాపం అంటూ జాలి చూపించారు. ఈ వ్యవహారంలో మొత్తం వెళ్లు అన్నీ, వైసీపీ వైపు వెళ్ళాయి. దీనిపై వైసీపీ కూడా అదే రేంజ్ లో రియాక్ట్ అయ్యింది. 
 
 
 
మీ ఛానల్లో సిబ్బంది కి జీతాలు సక్రమంగా ఇవ్వడం లేదు కాబట్టే ఎవరో కడుపు మండి రాయి వేసి ఉంటారు అంటూ వారు సర్ధి చెప్పే ప్రయత్నం చేశారు. సరే ఇది ఇలా ఉంటే, దీనిపై జూబ్లీహిల్స్ పోలీసులు పూర్తిస్థాయిలో దృష్టి పెట్టి ఎట్టకేలకు నిజమేంటో తేల్చిపారేశారు. టీవీ 5 సెక్యూరిటీ కార్యాలయం అద్దాలు పగులగొట్టిన వ్యక్తిని అరెస్టు చేశారు. అతడి పేరు చిరంజీవి. ఊరు శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం. అక్కడ సరైన ఉపాధి లేక హైదరాబాద్ కు వలస వచ్చిన వాడు. ఇతడు సినిమా సెట్టింగ్ లో దగ్గర వెల్డింగ్ చేసుకుంటూ జీవనోపాధి పొందుతున్నాడు. 
 
 
కొద్దికాలంగా కరోనా కారణంగా ఉన్న ఉపాధి కూడా పోవడంతో తీవ్ర అసహనంతో రగిలిపోతున్నాడు. దీంతో అతిగా మద్యం సేవించి రోడ్డుపై నడుస్తూ మత్తులో రాయి తీసుకుని ఓ బిల్డింగ్ మీద విసిరాడు. ఇంతకీ అది టీవీ 5 కార్యాలయం అన్న సంగతి అతడికి కూడా తెలియదు. విషయం ఇది అయితే... టీవీ5 మాత్రం అందరిపైనా అనుమానాలు వ్యక్తం చేస్తూ అనవసర రాద్ధాంతం చేస్తూ ఇన్ని రోజులు హడావుడి చేసింది. ఈ విషయం తెలిసిన తర్వాత సదరు ఛానల్ పూర్తిగా  సైలెంట్ అయిపోయింది. 
 
 
 
 
 

మరింత సమాచారం తెలుసుకోండి: