లాక్ డౌన్ సడలింపుల్లో భాగంగా రైల్వేశాఖ దేశవ్యాప్తంగా కొన్ని రైళ్ళు తిరగటానికి ప్రత్యేకంగా  అనుమతించింది.   దేశవ్యాప్తంగా గుర్తించిన, ఎంపిక చేసిన రూట్లలో మాత్రమే కేంద్రం ప్రత్యేక రైళ్ళను నడపాలని డిసైడ్ చేయటం శుభపరిణామమే. ఎంపిక చేసిన 15 రూట్లలో మాత్రమే రానుపోను 30 సర్వీసులు నడిపేందుకు రైల్వే శాఖ కూడా ఏర్పాట్లు చేసింది.

 

ఇంత వరకూ బాగానే ఉంది కానీ రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నడిచేందుకు ఒక్క రూటును కూడా ఎంపిక చేయకపోవటమే ఆశ్చర్యంగా ఉంది.  ఇపుడు అనుమతించిన ప్రత్యేక రైళ్ళల్లో కొన్ని తెలుగు రాష్ట్రాల్లోని కొన్ని రైల్వే స్టేషన్లను టచ్ చేస్తాయంతే.  ఉదాహరణకు బెంగుళూరు-న్యూఢిల్లీ మధ్య తిరిగే రైలు శ్రీ సత్యసాయి ప్రశాంతి నిలయం, ధర్మవరం, అనంతపురం, గుంతకల్ జంక్షన్, సికింద్రాపేట, కాజీపేట ను టచ్ చేస్తుంది.

 

అలాగే న్యూఢిల్లీ-చెన్నై సెంట్రల్ మధ్య తిరిగే రైలు విజయవాడ, వరంగల్ స్టేషన్లను టచ్ చేస్తుంది. ఇక న్యూఢిల్లీ-సికింద్రాబాద్ మధ్య తిరిగే రైలు కాజీపేట జంక్షన్ ను టచ్ చేస్తుంది. ఇంత వరకు బాగానే ఉంది కానీ రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఎన్నో రైళ్ళు తిరుగుతుంటాయి. వాటిలో ఒక్కదాన్ని కూడా ఎందుకు వేయలేదో అర్ధం కావటం లేదు.

 

ఉదాహరణకు హైదరాబాద్-తిరుపతి, తిరుపతి-వైజాగ్, హైదరాబాద్-విజయవాడ, విజయవాడ-వైజాగ్, సికింద్రాబాద్-విజయవాడ మధ్య రోజుకి ఎన్ని రైళ్ళు తిరిగినా ఇంకా ప్రయాణీకులు మిగిలిపోతునే ఉంటారు. అంటే పై రూట్లలో అంత హెవీ ట్రాఫిక్ ఉంటుందన్నమాట. మరి ఇంతటి హెవీ ట్రాఫిక్ ఉండే రూట్లలో కనీసం  ఓ రెండు రూట్లలో ప్రత్యేక రైళ్ళను నడిపితే జనాలు ఎంతో హ్యాపీగా ఫీలవుతారు.

 

పైగా రైల్వేశాఖకు బాగా ఆదాయాన్ని తెచ్చిపెట్టే జోన్లనో సౌత్ సెంట్రల్ రైల్వే జోన్ ముందు వరసలో ఉంటుంది.  ఇలాంటిది రద్దీగా ఉండే  రూట్లను రైల్వేశాఖ ఎందుకు  ఎంపిక చేయలేదో అర్ధం కావటం లేదు. ఇదే విషయమై బిజెపి నేతల్లో చర్చ కూడా జరుగుతోంది. బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఇదే విషయమై కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డికి పార్టీ తరపున లేఖ కూడా రాశారు. మరి రెండో విడతలో అనుమతించే రైళ్ళల్లో అయినా తెలంగాణా-ఏపి మధ్య నడిచే రైళ్ళకు అనుమతి లభిస్తుందేమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: