ఇదే విషయం ఇపుడు ఎవరికీ అర్ధం కావటం లేదు. ఓ పనికిమాలిన వ్యవహారాన్ని చంద్రబాబు, లోకేష్ భుజానేసుకుని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా వ్యవహరించటమేంటో అర్ధం కావటం లేదు. ఇదంతా సస్పెండ్ అయినా డాక్టర్ సుధాకర్ వ్యవహారం గురించే లేండి.  నోటికొచ్చినట్లు ప్రభుత్వంపై బహిరంగంగా మాట్లాడినందుకే డాక్టర్ సుధాకర్ ను ప్రభుత్వం దాదాపు నెల క్రితమే సస్పెండ్ చేసింది. ఇపుడా సుధాకరే మళ్ళీ పిచ్చిగా రోడ్లపై వ్యవహరిస్తుంటే అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. అదే విషయమై చంద్రబాబు, చినబాబుతో పాటు నేతలంతా ప్రభుత్వంపై విరుచుకుపడిపోతున్నారు.

 

డాక్టర్ శనివారం సాయంత్రం విశాఖనగరంలో రోడ్డుపై వీరంగం వేస్తున్నట్లు పోలీసులకు ఫిర్యాదులొచ్చాయి. దాంతో పోలీసులు వెళ్ళి డాక్టర్ ను అదుపులోకి తీసుకుని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడి వైద్యులు సుధాకర్ ను పరీక్షించి ఈయన మానసిక సమస్యలతో బాధపడుతున్నట్లు నిర్ధారించారు. మరి అటువంటి సుధాకర్ కు యావత్ చంద్రబాబు బృందమంతా ఎందుకు మద్దతుగా నిలబడుతోందో ఎవరికీ అర్ధం కావటం లేదు.

 

డాక్టర్ ను అదుపులోకి తీసుకోవటాన్ని బహిరంగంగా తాళ్ళతో కట్టేయటాన్ని చంద్రబాబు అండ్ కో తీవ్రంగా ఆక్షేపిస్తోంది. పైగా దళితుడని, డాక్టర్ అంటూ సామాజికవర్గాలు కూడా రెచ్చ గొడుతున్నారు. ఇక్కడ పోలీసులు సుధాకర్ ను అదుపులోకి తీసుకున్నది రోడ్లపై న్యూసెన్స్ చేస్తున్నాడన్న కారణంతో. మరి ఓ డాక్టర్ తాగేసి రోడ్డుపై వెళుతున్న జనాలను ఇబ్బంది పెట్టచ్చా ? చొక్కా చింపేసుకుని అర్ధనగ్నంగా వచ్చే పోయే వారిని అడ్డుకుని భయపెట్టవచ్చా ?

 

రోడ్లపై గొడవలు చేసేవాడికి సామాజికవర్గంతో పనేంటి ? ఆ డాక్టర్ కు టిడిపి వత్తాసు పలకటం ఏమిటి ? జరుగుతున్నది చూస్తుంటే ఈ ఘటన వెనకాల టిడిపి కుట్ర ఏమన్నా దాగుందా అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. డాక్టర్ కు మందుతాగించి రోడ్లపైకి వెళ్ళి గోల చేయమని టిడిపి నేతలు పురమాయించారా ? అనే సందేహాలు కూడా పెరిగిపోతున్నాయి. అప్పుడు డాక్టర్ ను పోలీసులు అరెస్టు చేస్తారని టిడిపి నేతలు ముందే ఊహిస్తే తర్వాత గొడవలు చేయొచ్చని ప్లాన్ వేసినట్లున్నారు. అసలు డాక్టర్ సస్పెండ్ అయ్యింది కూడా టిడిపి ఇటువంటి ప్లాన్ చేయబట్టే.

 

వాళ్ళ ప్లాన్ ప్రకారమే డాక్టర్ గొడవ చేయటం, పోలీసులు అరెస్టు చేయటంతో చంద్రబాబు, చినబాబు యాగీ మొదలుపెట్టారు. ఇదంతా చూస్తుంటే దళితులను లేదా డాక్టర్లను జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేయాలనే కుట్ర ఏదో దాగున్నట్లే అందరు అనుమానిస్తున్నారు. ఇదే అనుమానాన్ని వైసిపి ఎంఎల్ఏలు మేరుగ నాగార్జున, టిజెఎస్ సుధాకర్ బాబు కూడా  వ్యక్తం చేశారు. మొత్తానికి ఓ చిన్న పనికిమాలిన వ్యవహారాన్ని తండ్రి, కొడుకులు పెంచి పెద్దది చేస్తున్నారంటేనే ఏదో కుట్ర దాగున్నట్లే అనుమానాలు పెరిగిపోతున్నాయి.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: