గోదావరి జలాల వినియోగం విషయంలో కేసీయార్ కు జగన్మోహన్ రెడ్డి భలే ఫిట్టింగ్ పెట్టాడు. ఇంతకాలం ఎలాంటి  అనుమతులు లేకుండానే తెలంగాణాలో  నిర్మాణమవుతున్న   ప్రాజెక్టుల డొంకంతా  కదులుతోంది. పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు సామర్ధ్యం పెంచాలని జగన్మోహన్ రెడ్డి సర్కార్ నిర్ణయాన్ని కేసీయార్ ఎంత తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాడో అందరికీ తెలిసిందే. నిజానికి ప్రాజెక్టు సామర్ధ్యం పెంచటం అంటే కేవలం సముద్రంలో వృధాగా కలుస్తున్న వరదజలాలను వాడుకోవటం కోసమే అని ప్రభుత్వం స్పష్టంగా చెప్పింది. కానీ ఏదో కొంపలు ముణిగిపోతాయన్నట్లుగా కేసీయార్ కేంద్రానికి అభ్యంతరం చెబుతు లేఖ రాశాడు. పైగా కోర్టులో కేసు వేస్తానని బెదిరించాడు. దాంతో మొత్తం తెలంగాణా ప్రాజెక్టుల భాగోతమే బయటపడుతోంది.

 

ప్రాజెక్టు సామర్ధ్యం పెంచాలన్నా సరే గోదావరి నీటి యాజమాన్య బోర్డు అనుమతి, అపెక్స్ బోర్డు అనుమతి తీసుకోవాల్సిందేనంటూ కేసీయార్ పట్టుబట్టాడు. దాంతో కేంద్రం కూడా వెంటనే స్పందించి ఏపి ప్రభుత్వానికి నోటీసులిచ్చింది. సరే ఈ విషయం ఇలాగుండగానే ఏపి ప్రభుత్వం కూడా తెలంగాణాలో కడుతున్న ప్రాజెక్టులపై ఎదురుదాడి మొదలుపెట్టింది. ఏపితో చర్చించకుండానే, గోదావరి బోర్డు నుండి ఎటువంటి అనుమతులు లేకుండానే నిర్మిస్తున్న ప్రాజెక్టుల వివరాలను కేంద్రానికి అందించింది.

 

ఇదే విషయమై గోదావరి బోర్డు కూడా స్పందించి వెంటనే తెలంగాణా ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. అనుమతులు తీసుకోకుండానే ప్రాజెక్టులు నిర్మితమవుతున్న విషయాన్ని బోర్డు ధృవీకరించింది. అందుకనే కడుతున్న ఏడు ప్రాజెక్టుల డీటైల్డ్ ప్రాజెక్టు రిపోర్టు(డిపిఆర్)లు ఇవ్వాలంటూ ఆదేశించింది. పైగా 2019, ఆగస్టులోనే డిపిఆర్ లను సబ్మిట్ చేయమని ఆదేశించినా తెలంగాణా ప్రభుత్వం పట్టించుకోలేదంటూ ఆక్షేపించటం గమనార్హం. అంటే గోదావరి బోర్డు అధికారాలను కూడా తెలంగాణా ప్రభుత్వం పట్టించుకోవటం లేదన్న విషయం అర్ధమైపోయింది.

 

డిపిఆర్ లు లేకుండానే తెలంగాణా ప్రభుత్వం నిర్మిస్తున్న ప్రాజెక్టలు కాళేశ్వరం, గోదావరి ఎత్తిపోతల పథకం-3, సీతారామా ఎత్తిపోతల పథకం, తుపాకులగూడెం, తెలంగాణా తాగునీటి సరఫరా పథకం, లోయర్ పెన్ గంగపై ప్రాజెక్టులు, రామప్పచెరువు నుండి పాకాల చెరువు వరకూ నీటి మళ్ళింపు లాంటి పథకాలున్నాయి. ఇన్ని ప్రాజెక్టులకు తెలంగాణా ప్రభుత్వం ఎటువంటి అనుమతులు లేకుండా, ఏపి ప్రభుత్వంతో చర్చలు జరపకుండానే ఎలా నిర్మిస్తోంది ? ఎలాగంటే చంద్రబాబునాయుడు చేతకాని తనం వల్లే అని తెలిసిపోతోంది.

 

2014లో అధికారంలోకి వచ్చిన కొత్తల్లోనే ’ఓటుకునోటు’ కేసులో కేసీయార్ దగ్గర చంద్రబాబు తగులుకున్నాడు. దాంతో వ్యతిరేకంగా మాట్లాడితే ఎక్కడ అరెస్టు చేస్తాడో అన్న భయంతో కేసీయార్ గురించి మాట్లాడటమే చంద్రబాబు మానుకున్నాడు. దాన్ని అడ్వాంటేజ్ గా తీసుకున్న కేసీయార్ యధేచ్చగా విభజన చట్టాన్ని ఉల్లంఘించాడు. కేసీయార్ ఏమి చేసినా అడిగే ధైర్యం చంద్రబాబుకు లేకపోయింది. కేసీయార్ ఉల్లంఘనల్లో గోదావరి జిల్లాల వినియోగంపై ప్రాజెక్టుల నిర్మాణం చాలా కీలకమైంది.

 

నిజానికి పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు సామర్ధ్యం విషయాన్ని కేసీయార్ పట్టించుకోకుండా ఉండుంటే జగన్ కూడా ఏడు ప్రాజెక్టుల విషయాన్ని పట్టించుకునే వాడు కాదేమో. కానీ అనవసరంగా కేసీయార్ ఏపి ప్రభుత్వ నిర్ణయంపై చాలా సీరియస్ అయ్యేటప్పటికి ఏపి ప్రభుత్వం కూడా తెలంగాణా ప్రాజెక్టులపై అభ్యంతరాలు వ్యక్తం చేసింది. దాంతో మొత్తం తీగంతా కదలిస్తే డొంకంతా బయటపడుతోంది. ఏపి ప్రభుత్వం లేవనెత్తిన అభ్యంతరాలు, గోదావరి బోర్డు అపెక్స్ కౌన్సిల్ ఆదేశాలతో అక్రమంగా నిర్మిస్తున్న ప్రాజెక్టులను ఎలా సమర్ధించుకుంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: