క్షేత్రస్ధాయిలో జరుగుతున్న వ్యవహారాలు చూస్తుంటే అందరిలోను ఇవే అనుమానాలు పెరిగిపోతున్నాయ్. మొన్నటి ఎన్నికల్లో ఎదురైనా ఘోరమైన ఓటమి దెబ్బకు చంద్రబాబు పరిస్ధితి కత్తిమీద సాములాగ తయారైంది. గెలిచిందే 23 మంది ఎంఎల్ఏలు. ఇందులో కూడా ఎప్పుడెంత మంది బయటకు వెళ్ళి పోతారో తెలీదు. ఆల్రెడీ ముగ్గురు ఎంఎల్ఏలు వల్లభనేని వంశీ, కరణం బలరామ్, మద్దాలి గిరి పార్టీకి దూరమైపోయిన విషయం అందరికీ తెలిసందే. ఉన్న 20 మందిలో కూడా ఈరోజో రేపో మరికొందరు బయటకు వెళ్ళిపోయేందుకు రెడీ అవుతున్నారనే ప్రచారం ఊపందుకుంది.

 

జరుగుతున్న ప్రచారం గనుక వాస్తవమైతే చంద్రబాబు పనిగోవిందానే. అసలు ఈ పరిస్ధితి ఎందుకు వచ్చింది. ఎందుకంటే చంద్రబాబు స్వయంకృతమనే చెప్పాలి. వైసిపి  అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి అయినదానికి కానిదానికి చంద్రబాబు కావాలనే జగన్ పై బురద చల్లేస్తున్నాడు. తనకు మద్దతుగా నిలబడే ఎల్లోమీడియా ఉద్దేశ్యపూర్వకంగానే బురద చల్లిస్తున్నాడు. ఎక్కడో జరిగిన చిన్న విషయాన్ని కూడా జగన్ కు ముడిపెట్టేసి కావాలనే నెగిటివ్ వార్తలు, కథనాలు రాయిస్తున్నాడు.

 

సరే రాజకీయంగా ఏదో చేస్తున్నాడులే అనుకుంటే విధానపరమైన నిర్ణయాల్లో కూడా కావాలనే గబ్బు పట్టిస్తున్నాడు. ఇంగ్లీషుమీడియా స్కూళ్ళను అడ్డుకోవటం నుండి తాజాగా తిరుమల తిరుపతి దేవస్ధానంకు చెందిన 50 ఆస్తులను అమ్మాలనే నిర్ణయం వరకూ ప్రతి విషయంలోను నానా యాగీ చేస్తున్నాడు. నిజానికి ఆస్తులను అమ్మాలనే నిర్ణయం టిడిపి హయాంలోనే జరిగింది. కాకపోతే వివిధ కారణాల వల్ల అమ్మకానికి గుర్తించిన ఆస్తులను అప్పట్లో అమ్మలేకపోయారు. అవే ఆస్తులను ఇపుడు వైవి సుబ్బారెడ్డి అధ్యక్షతన పనిచేస్తున్న బోర్డు అమ్మాలని డిసైడ్ అయ్యింది.

 

అసలు ఈ విషయంలో గోల చేయటానికి ఏమీ లేదు. కానీ చంద్రబాబు మాత్రం కావాలనే తాను గోల చేయటమే కాకుండా బిజెపి, వామపక్షాలు, జనసేన నేతలతో కూడా యాగీ చేయించాడు. అంటే తాను అధికారంలో ఉన్నపుడు ఏ నిర్ణయం తీసుకున్నా ప్రతిపక్షాలు పట్టించుకోకూడదు. అదే తాను ప్రతిపక్షంలో ఉంటే అధికారపార్టీ ఏ నిర్ణయమూ తీసుకోకూడదు అన్నట్లుగానే ఉంది చంద్రబాబు వ్యవహారం. చంద్రబాబు వ్యవహారాలతో జగన్ బాగా విసిగిపోయినట్లున్నాడు.

 

నిజానికి టిడిపి ఎంఎల్ఏలను వైసిపిలో చేర్చుకోవాల్సిన అవసరం జగన్ కు లేదు. అందుకనే ఇంతకాలం టిడిపి ఎంఎల్ఏల విషయాన్ని పట్టించుకోలేదు.  జగన్ ఊ అంటే టిడిపిలో నుండి వచ్చేయటానికి చాలామంది ఎంఎల్ఏలు రెడీగా ఉన్నట్లు ప్రచారంలో ఉంది. అయినా జగన్ గేట్లు తెరవలేదు. ఇపుడు లాభం లేదన్న ఉద్దేశ్యంతో చంద్రబాబును ఎంత వీలుంటే అంత దెబ్బ తీయాలని జగన్ డిసైడ్ అయినట్లున్నాడు.  అందుకనే టిడిపి ఎంఎల్ఏలను లాగేయాలనే స్కెచ్ రెడీ చేసినట్లు ప్రచారం జోరుగా జరుగుతోంది. అంటే కావాలనే చంద్రబాబు జగన్ ను కెలకటం వల్లే పరిస్ధితి ఇంత దాకా వచ్చిందని అర్ధమైపోతోంది. చూద్దాం ఏం జరుగుతుందో.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: