ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తి చేసుకుంటున్న తరుణంలో వరుస పెట్టి ప్రభుత్వానికి హైకోర్టులో ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. తాజాగా ఎస్ఈసీ నిబంధనలు మారుస్తూ ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్ ను ఏపీ హైకోర్టు శుక్రవారం నాడు కొట్టివేసింది. 213 అధికరణ ప్రకారం ఆర్డినెన్స్ తెచ్చే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని తెలిపింది. వెంటనే నిమ్మగడ్డ రమేష్ ను విధుల్లోకి తీసుకోవాలని తీర్పును వెలువరించింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 243కే ప్రకారం ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్సును, ఉత్తర్వులను రద్దు చేస్తున్నట్టు, అలాగే  కొత్త కమిషనర్ నియామకం చెల్లదని తెలిపింది. 

 

కాగా మార్చి నెలలో ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు రమేష్ కుమార్ నోటిఫికేషన్ ఇచ్చారు. కరోనా నేపథ్యంలో వాటిని వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు. ప్రభుత్వాన్ని సంప్రధించకుండా ఎలా వాయిదా వేస్తారంటూ సీఎం జగన్ ఈసీ తీరుపై ఫైర్ అయ్యారు. దీంతో ఈసీ బాధ్యతలను మూడేళ్లకు తగ్గిస్తూ.. ఆర్డినెన్స్ తీసుకువచ్చారు.  దానికి అనుగుణంగా ఆయన్ను తొలగించి.. కొత్తగా మాజీ జస్టిస్ కనగరాజ్‌ను నియిమించారు. ప్రభుత్వ చర్యను తప్పుబడుతూ.. బీజేపీ సీనియర్ నేత కామినేని శ్రీనివాస్ హైకోర్టులో పిల్ వేశారు. దీనిపై విచారణ చేపట్టిన ధర్మాసం ఈ తీర్పునిచ్చింది. 

 

అయితే ఇప్పటికే పంచాయితీ భవనాలకు పార్టీ రంగులు తొలగించాలని, డాక్టర్ సుధాకర్ కేసు సీబీఐ విచారణకు ఆదేశించడం, ఎల్ జీ పాలిమర్ సంస్థని సీజ్ చెయ్యాలి అని ఆదేశించింది, సీనియర్ పోలీస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్ రద్దు చేయడం, ఒక ఎంపి ఒక మాజీ ఎమ్మెల్యే తో సహా 49 మంది వైకాపా కార్యకర్తలకు కోర్టు అభిశంసన పై నోటీసులు ఇవ్వటం ఇవన్నీ చూస్తుంటే ఏపీ రాజకీయాలు రాష్ట్ర ప్రభుత్వం వర్సెస్ హై కోర్టు అన్నట్టు అనిపిస్తుంది. 

 

ఈ ఏడాది పాలనలో సీఎం జగన్ తీసుకున్న ఎన్నో నిర్ణయాలను హై కోర్టు తప్పుపట్టింది. నిజానికి చెప్పాలంటే ఒక రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలను ఇంతలా కోర్టు తప్పుపట్టడం చరిత్రలో ఇదే తొలిసారి. దీనికి మూలకారణం సీఎం సలహాదారులు...వీరిచ్చే సలహాలతోనే ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటుంది. అలాంటి ఉన్నత పదవుల్లో ఉన్న వీరు ప్రభుత్వానికి కలిసొచ్చే, ప్రజలకు ఉపయోగపడే సలహాలు ఇవ్వడం ఉత్తమం. కానీ, ఎందుకో ఏమో..? ప్రస్తుత ప్రభుత్వంలో ఉన్న సలహాదారులు మాత్రం దీనికి భిన్నంగా పనిచేస్తున్నట్టు తెలుస్తుంది. వీరు ఇచ్చే సలహాల వల్ల రాష్ట్ర ప్రభుత్వం నవ్వులపాలవుతుంది, అలాగే ప్రజల్లో పట్టు కోల్పోయే పరిస్థితి ఉంది. కాబట్టి ఇకనైనా ఆలోచించి సలహాలు ఇవ్వడం మంచిది.. లేదంటే రాష్ట్ర ప్రభుత్వం ఆ పదవుల్లో ఉన్నవారిని తొలగించడం శ్రేయష్కరం. 

 

అలాగే రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే ఏడాది పాలనలో జగన్ సాధించిన విజయాలకన్నా..ఆయనపై ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడు పైచేయి సాధించిన అంశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. వీటిని క్షుణ్ణంగా పరిశీలిస్తే ప్రభుత్వ సలహదారుల్లో చంద్రబాబు మనుషులు ఎవరైనా ఉన్నరేమో అనే సందేహం కలుగక మానదు. ఆయన డైరెక్షన్ లోనే కావాలనే ఎవరో ప్రభుత్వానికి తప్పుడు సలహాలు ఇచ్చి ప్రభుత్వాన్ని తప్పుదోవ పట్టిస్తున్నట్టు అనిపిస్తుంది. ఇకనైనా రాష్ట్ర ప్రభుత్వం మేల్కొని సలహదారుల విషయంలో కొంచెం జాగ్రత్త వహించడం మంచిది.

మరింత సమాచారం తెలుసుకోండి: