ఈ విషయమే ఎవరికీ అర్ధం కావటం లేదు. మొన్నటి ఎన్నికల్లో ఘోర ఓటమి తర్వాత ఎల్లోమీడియా తప్ప చంద్రబాబునాయుడును బయట పబ్లిక్ ఎవరు పట్టించుకోవటం లేదు. ఎప్పుడైతే  ఫలితాలు వచ్చాయో అప్పటి నుండే చాలామంది సీనియర్ నేతలు పార్టీలో నుండి ఎలా బయటపడాలా అని ఆలోచిస్తున్నారు. అవకాశం ఉన్న వాళ్ళు అప్పట్లోనే పార్టీ నుండి బయటకు వచ్చేశారు. ఇంకొందరు వైసిపిలో చేరటానికి ప్రయత్నాలు చేసుకుంటున్నారు. మరికొందరు సైలెంటుగా ఉండిపోయారు.

 

అదే సమయంలో అఖండ మెజారిటితో అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి కూడా సంక్షేమ పథకాల అమలుతో జనాల్లోకి దూసుకుపోతున్నాడు. సరే రాజకీయ వైరుధ్యాలంటారా అవి ఎప్పటికీ ఉంటాయి కాబట్టి ప్రతిపక్షాల నేతలు ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు. దానికి ధీటుగా అధికారపార్టీ వైపు నుండి కూడా ఎదురుదాడులు జరుగుతునే ఉన్నాయి. ఈ మొత్తం మీద గమనించాల్సిన విషయం ఏమిటంటే ప్రభుత్వం తరపున కన్నా పార్టీ తరపునుండే రాజ్యసభ ఎంపి విజయసాయిరెడ్డి మంచి దూకుడు మీదున్నాడు.

 

ప్రతిపక్షంలో ఉన్నపుడు కూడా సాయిరెడ్డి చంద్రబాబు, లోకేష్ అండ్ కో మీద ప్రతిరోజు ట్విట్టర్లో విరుచుకుపడేవాడన్న విషయం అందరికీ గుర్తుండే ఉంటుంది. అలాంటిది అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు, లోకేష్ మీద సాయిరెడ్డి తన దూకుడును ఏమాత్రం తగ్గించలేదు. పైగా బాగా పెంచటంతోనే సమస్య మొదలైంది. అయినదానికి కానిదానికి సాయిరెడ్డి టిడిపి అధినేతతో పాటు చినబాబు మీద వ్యంగ్యాస్త్రాలు ఎందుకు ఎక్కు పెడుతున్నాడు ? అన్నదే అర్ధం కావటం లేదు. ఒకవైపేమో చంద్రబాబును టిడిపిని జనాలు పట్టించుకోవటం మానేశారని ఎంపినే చెబుతుంటాడు. మరలాంటపుడు తాను మాత్రం ఎందుకు ప్రతిరోజు ట్విట్టర్లో వాళ్ళ వెంట పడుతున్నట్లు ?

ఏదేనా అవసరం వచ్చినపుడు స్పందించటం వేరు అదేపనిగా వాళ్ళ వెంటపడటం వేరన్న విషయాన్ని ఎంపి మరచిపోయినట్లున్నాడు. ఇక్కడ సాయిరెడ్డి మరచిపోయిందేమంటే అనవసరంగా చంద్రబాబు, చినబాబుకు ఎంపినే ప్రచారం కల్పిస్తున్నాడు. సాయిరెడ్డి ట్విట్టర్లో ఏదో ఓ కామెంట్ పెట్టడం దాన్ని సోషల్ మీడియాలో వైసిపి వాళ్ళు వైరల్ చేయటం. ప్రతిరోజు ఇదే తంతు నడుస్తోంది. పనిలో పనిగా సోషల్ మీడియాలో న్యూట్రల్స్ గా ఉన్న వాళ్ళకు కూడా సాయిరెడ్డి కామెంట్లు చేరుతున్నాయి. దాని వల్ల  ప్రతిరోజు చంద్రబాబు న్యూట్రల్స్ కు గుర్తుకువస్తున్నాడు.

 

అంటే సాయిరెడ్డే న్యూట్రల్స్ చంద్రబాబును మరచిపోకుండా చేస్తున్నాడన్నమాట. ఇంత అవసరం ఎంపికి ఏమొచ్చింది ? టిడిపి అన్నది ఇపుడు దాదాపుగా చచ్చినపాముతో సమానం. అలాంటి దానికి సాయిరెడ్డే స్వయంగా ప్రాణం పోస్తున్నాడా ? అన్న అనుమానాలు పెరిగిపోతున్నాయి. ఇదే సమయంలో ఎప్పుడో ఒకపుడు చంద్రబాబు మీద సాయిరెడ్డి కామెంట్ చేశాడంటే అర్ధముంది. అదే పనిగా పనిగట్టుకుని మరీ ప్రతిరోజు వెంటపడుతుంటే చివరకు ఎంపి చేసే కామెంట్లు కూడా చీపయిపోవటం ఖాయం. మరి సాయిరెడ్డి ఈ విషయాన్ని ఎంత తొందరగా గ్రహిస్తే అంత మంచిది.

మరింత సమాచారం తెలుసుకోండి: