ఏపీ మాజీ సీఎం చంద్రబాబు లాక్ డౌన్ వల్ల ఇటీవల దాదాపు 70 రోజుల వరకూ హైదరాబాద్ లోనే చిక్కుకుపోయారు. ఆ సమయంలో ఆయన జూమ్ యాప్ ద్వారా రోజువిడిచి రోజు ప్రెస్ మీట్లు పెట్టేవారు. ఆ సమయంలో ఆయన చెప్పిన కొన్ని మాటలు ఇప్పుడు గుర్తొస్తున్నాయి. రాష్ట్రం చాలా కష్టాల్లో ఉంది.. ఇలాంటి కష్ట సమయంలో మీకు అండగా ఉండాలని మనసు తహతహలాడుతోంది. నా మనసు అంతా మీమీదే ఉంది. కానీ ఏం చేయను లాక్ డౌన్ కారణంగా చిక్కుకుపోయాను.. అంటూ మాట్లాడేవారు.

 

 

ఆ తర్వాత విశాఖలో ఎల్జీ పాలిమర్స్ ప్రమాదం సమయంలోనూ చంద్రబాబు ఇలాగే మాట్లాడేవారు. బాధితుల పరామర్శ కోసం ఏకంగా కేంద్రానికే దరఖాస్తు చేసుకున్నారు. అయితే ఈ మాటలన్నీ విన్న తర్వాత పాపం.. చంద్రబాబు ఏపీపై ఎంత ప్రేమో అనుకున్నారు చాలా మంది. అలాంటిది దాదాపు రెండు నెలల తర్వాత ఏపీలో అడుగు పెట్టే అవకాశం లభించింది. ఆయన దరఖాస్తులను అటు తెలంగాణ, ఇటు ఆంధ్రా రెండు ప్రభుత్వాలు ఓకే చెప్పేశాయి.

 

 

అలా చంద్రబాబు ఏపీలో అడుగు పెట్టారు. ఆ వెంటనే మహానాడు నిర్వహణలో మునిగిపోయారు. మొత్తం మీద రెండు రోజలు మహానాడులో గడిచిపోయాయి. ఇక చంద్రబాబు ఏపీకి వచ్చేశారని ఏపీ ప్రజలు ధీమాగా ఫీలయ్యే ఉంటారు. అటు విశాఖ ఎల్జీ పాలిమర్స్ బాధితులు కూడా చంద్రబాబు పరామర్శ కోసం ఎదురు చూసే ఉంటారు. అసలు మహానాడుకు ముందే విశాఖ పర్యటన అంటూ తెలుగు దేశం హడావిడి చేసింది.

 

 

అయితే ఇన్ని ప్రోగ్రాములు ఏపీలో పెండింగులో ఉంటే.. చంద్రబాబు మాత్రం ఎంచక్కా మహానాడు పూర్తయిన మరుసటి రోజే హైదరాబాద్ ప్రయాణం అయ్యారు. పాపం.. ఈ వార్త విన్న ఆంధ్రా ప్రజలు అవాక్కయ్యారు. రాక రాక రెండు నెలలకు వచ్చిన నాయకుడు రెండు రోజులు కూడా పూర్తిగా గడపకుండానే మళ్లీ హైదరాబాద్ వెళ్లిపోయాడేంటా అని చర్చించుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: