ఆ... కరోనా అయితే ఏంటి ? ఏచీల్లో సుకుమారంగా పెరిగినోళ్లకు వత్తంది గాని, మా బోటొళ్ళకి ఎందుకు వత్తుంది ? ఎండనక వాననక పని చేసేవాల్లకి అటుమంటి జబ్బులు రావు. ఇరుకు ఇరుకు గదుల్లో ఉండే పట్టనమొల్లే భయపడాలి కానీ, మాకెందుకు భయం ? స్వచ్ఛమైన గాలి, ఎలుతురు, కల్తీ లేని పాలు, సొంతంగా పండించుకు తినే తిండి,పొలం గట్ల మీద పండే కూరగాయలు తింటూ ఉండే మేము ఎందుకు భయపడాలి ? ఏదైనా భయపడాలి అంటే పట్నం వాళ్ళే భయపడాలి. అంటూ కరోనా ను చాలా సింపుల్ గానే తీసుకుంటున్నారు పల్లె జనాలు. " హెరాల్డ్ '' గోదావరి జిల్లాలోని ఓ మారుమూల పల్లెటూరి లో జనాల అభిప్రాయం సేకరించగా చెప్పిన అభిప్రాయాలు.


మూతికి మాస్క్, సానిటైజర్, సామాజిక దూరం అంటూ ప్రపంచమంతా కొత్త , సరికొత్త నిబంధనలు పెట్టుకుని అందరూ ఇవే పాటించాలి అని చెబుతున్నా, పల్లెటూరి జనాల్లో మాత్రం ఆ కొత్త పద్ధతిపై ఆసక్తి లేదు... భయం లేదు... అసలు కరోనా అంటే కంగారే లేదు.


హెరాల్డ్ ఫీల్డ్ విజిట్ లో ఎన్నో సంగతులు బయటపడ్డాయి. ప్రపంచం అంతా కరోనా భయం తో అల్లాడుతున్నా,  పల్లె జనాల్లో ఆ భయం కనిపించడం లేదు సరికదా నిర్లక్ష్యం మాత్రం ఎక్కువ కనిపిస్తోంది. ఒకరికి ఒకరు చేతులు పట్టుకుని మాట్లాడుకోవడం, భుజాలపై చేతులు వేసుకోవడం, బల్లల దగ్గర, రచ్చ బండ ల దగ్గర గుంపులు గా చేరి కబుర్లు చెప్పుకోవడం, భారీ జనాలతో ఫంక్షన్ లు చేస్తూ,  వందల మందిని ఆహ్వానించడం, ఊరి కట్టుబాట్ల పేరుతో అంతా ఒక్క మాట మీద నిలబడి ఊళ్ళల్లో భారీ పంక్షన్ లు పెట్టుకున్నా, అధికార్లకు సమాచారం వెళ్లకుండా లోకల్ గా మేనేజ్ చేసుకోవడం, ఇలా ఎన్నో నిరాటంకంగా పల్లెల్లో జరిగిపోతున్నాయి. ఇక ఫంక్షన్ లలో 50 మంది వరకే లిమిట్ ఉన్నా, అదెక్కడా అమలు కావడం లేదు ఇక్కడ.  


ఇదేంటి ఇంతమందితో ఫంక్షన్స్ పెడితే ఎలా అని ప్రశ్నిస్తే  ఆ... అలాగే చెబుతారు. పల్లెటూర్లలో ఒకడిని కేకేసి ఇంకొకడిని వదిలేస్తే, ఆళ్లు మోకం ఎత్తి పెడతారు. ఈ రూల్స్ గీల్సు అయన్నీ పట్నాల్లో కుదురుద్ది కానీ, మా పల్లెటూర్లలో నడవ్వురా అబ్బాయ్ అంటూ సమాధానం చెబుతున్నారు. కరోనా రాక ముందు ఎలా ఉన్నారో ఇప్పుడూ పల్లె జనాలు అలానే ఉన్నారు తప్ప, ఇప్పుడు ఎవరిలోనూ కరోనా భయమే కనిపించడం లేదు. ఇక ఫంక్షన్ల దగ్గర జనాల సంగతి చెప్పక్కర్లేదు. గుంపులు గుంపులుగా తోసుకుంటూ, రాసుకుంటూ వెళ్లడమే కనిపిస్తోంది.


అసలు కరోనా అంటే పట్నాల్లో వాళ్లకి మాత్రమే అన్న అభిప్రాయం, మాకు కరోనా రాదు అనే ధీమా వారిలో కనిపిస్తోంది. ఈ కరోనా కి పల్లె, పట్నం అనే తేడా లేదు. ఎవరైనా ఒక్కటే అని ఎంత చెప్పినా వారు పట్టించుకునేలా లేరు. ప్రభుత్వం ఎంత మొత్తుకున్నా, ఎన్ని జాగ్రత్తలు చెబుతున్నా, వారిలో నిర్లక్షమే కనిపిస్తోంది. ఇక చేసేది ఏముంది ..? వారి మాటల్లోనూ ఓ పాయింట్ ఉంది అనుకోవడమే తప్ప. పల్లె జనాల్లో కాస్త కూడా కరోనా అంటే కంగారు కనిపించడం లేదు. ఇది ఏదో ఆషామాషీగా చెప్పే విషయం మాత్రం కాదు. స్వయంగా చాలా పల్లెల్లో ప్రత్యక్షంగా చుసిన, చూస్తున్న వాస్తవాలు.

మరింత సమాచారం తెలుసుకోండి: