తెలంగాణ.. ఒకప్పుడు బాగా వెనుకబడిన ప్రాంతం.. అలా అనడం కంటే.. వెనకకు నెట్టేయబడిన ప్రాతం అంటే కరెక్టుగా ఉంటుందేమో. తలాపునా పారుతోంది గోదారి.. నా చేను, నా చెలకా ఎడారి అంటూ రైతులు పాడుకునే దుస్థితి తెలంగాణలో ఉండేది. క్షీరసాగరాలైన గోదావరి, కృష్ణా.. ఈ రెండు నదులూ తెలంగాణ నుంచే పారుతున్నా.. తెలంగాణకు ఎప్పుడూ కరవు కాటకాలే ప్రాప్తంగా మిగిలాయి.

 

 

దశాబ్దాల తరబడి ఇదే గోస. ఒక దశలో తెలంగాణలో రైతుల ఆత్మహత్యలు నిత్యకృత్యం అయ్యాయి. వాన దేవుడు కరుణించడు. నదీమతల్లులు పారుతున్నా.. ఆ నీళ్లు మన చేలకు రావు. పోనీ.. భూగర్భజలాలు వాడుకుందామంటూ కరెంటు ఉండదు. ఇలా తెలంగాణ దశాబ్దాలు ఇబ్బందులు పడింది. కానీ రాష్ట్రావతరణతో తెలంగాణ రూపు రేఖలు మారాయనే చెప్పొచ్చు. ఆరేళ్లు అంటే కాలగమనంలో అదో పెద్ద కాలం కాదు.

 

 

కానీ ఆ స్వల్ప కాలంలోనే తెలంగాణ గర్వించే విధంగా విజయాలు సాధించింది. తెలంగాణ వస్తే కరెంటు కష్టాలు తప్పవని ఓ ముఖ్యమంత్రి బోర్డుపై లెక్కలు వేసి మరీ చెప్పాడు. తెలంగాణను చీకట్లు ఆవరిస్తాయని హెచ్చరించాడు. కానీ తెలంగాణ వచ్చాక.. అందుకు భిన్నమైన దృశ్యాలే కనిపిస్తున్నాయి. ఇప్పుడు 24 గంటల కరెంటు రైతుకు కూడా దక్కుతోంది.

 

 

తెలంగాణ భూములను సస్యశ్యామలం చేసుకునేందుకు తెలంగాణ ఏర్పడిన తర్వాత కేసీఆర్ జలయజ్ఞానికి తెర తీశారు. మొదటి ఐదేళ్ల ఏలుబడిలో మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ ప్రాజెక్టులకు ప్రయారిటీ ఇచ్చారు. కాళేశ్వరం వంటి భారీ ప్రాజెక్టులను తలకెత్తుకున్నారు. నాలుగేళ్లలో దాదాపు 60వేల కోట్ల రూపాయలు ఒక్క కాళేశ్వరం మీదనే వెచ్చించారు. తెలంగాణ రాకపోయి ఉంటే.. ఇంత బారీ స్థాయిలో నిధుల కేటాయింపులు ఉండేవి కావు. ఈ ప్రాజెక్టులు సాధ్యమయ్యేవే కావు. ఒకప్పుడు కరవు కాటకాలతో అల్లాడిన తెలంగాణ ఇప్పుడు దేశానికే అన్నం పెట్టే అన్నపూర్ణగా మారింది. ఈ ఏడాది కేంద్రం సేకరించిన ధాన్యంలో 60 శాతం ఒక్క తెలంగాణ నుంచే వచ్చిందని సాక్షాత్తూ ఎఫ్‌సీఐ ప్రకటించిందంటే.. తెలంగాణ సాధించిన విజయానికి ఇంతకంటే నిదర్శనం ఏం కావాలి..?

 

మరింత సమాచారం తెలుసుకోండి: