ఈనాడు.. తెలుగులో అగ్రశ్రేణి దినపత్రిక.. తెలుగుపత్రికారంగాన్ని కొత్త పుంతలు తొక్కించిన పత్రిక. 1974లో పత్రిక స్థాపించిన నాటి నుంచి ఇప్పటివరకూ తెలుగు పత్రికారంగాన్ని శాసిస్తోంది. ప్రారంభించిన కొద్దికాలంలోనే తోటి పత్రికలను అధిగమించి ది లార్జెస్ట్ సర్క్యులేటెడ్ డెయిలీగా రికార్డులకెక్కి.. దశాబ్దాల తరబడి ఆ రికార్డును కాపాడుకుంటూ వస్తోంది.

 

 

తెలుగుపత్రికల్లో ఏమార్పులు తీసుకురావాలన్నా ఈనాడుతోనే శ్రీకారం.. ప్రత్యేక పేజీల విషయంలోనూ.. టాబ్లాయిడ్ ల విషయంలోనూ..ఇంకా అనేక కొత్త మార్పుల విషయంలోఈనాడే మిగిలిన పత్రికలకు దిక్సూచి. ఈనాడు ఆరంభిస్తుంది. మిగిలిన పత్రికలు అనుసరిస్తాయి అనేది ఓ నానుడిగా మారింది. అయితే.. ఇప్పుడు అంతటి ఈనాడు కూడా కరోనా కారణంగా వచ్చిన నష్టాలతో సంయమనం పాటిస్తోంది.

 

 

తానే ప్రారంభించిన జిల్లా టాబ్లాయిడ్ల విధానానికి తానే స్వస్తి పలికింది. పూర్తిగా జిల్లా టాబ్లాయిడ్ ఎత్తేయకుండా మెయిన్ పత్రికలోనే ఓ రెండు పేజీలు కేటాయిస్తోంది. మొదట్లో మిగిలిన పత్రికలు కూడా న్యూస్ ప్రింట్ ఖర్చు తగ్గించుకునేందుకు ఇదే పద్ధతి ఫాలో అయ్యాయి. కానీ అనూహ్యంగా తెలంగాణలో నమస్తే తెలంగాణ, సాక్షి.. ఈ రెండు పత్రికలూ మళ్లీ టాబ్లాయిడ్లు ప్రచురించడం ప్రారంభించాయి.

 

 

ఖర్చు పెరిగినా పర్వాలేదు.. టాబ్లాయిడ్లు ఉండాల్సిందేనని నిర్ణయించుకున్నాయి. అయితే ఈనాడు మాత్రం నమస్తే తెలంగాణ, సాక్షి కవ్వింపులను పెద్దగా పట్టించుకున్నట్టు లేదు. తన ధోరణి తనదే అన్నట్టు ఇంకా జిల్లా టాబ్లాయిడ్‌లు ప్రారంభించలేదు. ప్రారంభించే ఉద్దేశం ఉన్నట్టు కూడా లేదు. మరి సాక్షి, నమస్తే తెలంగాణ ఈ ట్రెండ్ ను కొనసాగిస్తాయా.. ఈనాడు కూడా తన నిర్ణయం మార్చుకోకుండా ఇలాగే నడిపిస్తుందా.. అనేది చూడాలి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: