2019 ఎన్నికల్లో 151 మంది ఎమ్మెల్యేలతో సంచలనాత్మక విజయం సాధించి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. రాజన్న రాజ్యమే లక్ష్యంగా తనదైన శైలిలో సంచలన నిర్ణయాలు తీసుకుంటూ, కీలక సంక్షేమ పథకాలను వరుసగా ప్రకటిస్తూ అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తూ.. పాలనా పరంగా ప్రజల మద్దతు పొందుతున్నారు. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వలంటీర్లు, గ్రామ సచివాలయాల వ్యవస్థ, సంక్షేమ పథకాల అమలు, ఎన్నికల ప్రచార సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడం.. వంటి చర్యలపైనే ఫోకస్ పెట్టారు. తొలి ఏడాదిలోనే దాదాపు 90 శాతం మేర ఎన్నికల హామీలను నెరవేర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నామని, దాన్ని సాధించామని స్వయంగా వైఎస్ జగన్ స్పష్టం చేయడం.. అయితే ఈ సారి ఆయన పార్టీ పరంగా అనూహ్య నిర్ణయం తీసుకోవచ్చని తెలుస్తోంది. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవీ బాధ్యతల నుంచి తప్పుకోవాలని యోచిస్తున్నట్లు సమాచారం. ఈ దిశగా ఆయన ఇప్పటికే కొందరు సన్నిహితులతో తన అభిప్రాయాలను పంచుకున్నారని అంటున్నారు. ఎందుకంటే..?


వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా పగ్గాలను చేపట్టిన తరువాత పార్టీ సమావేశాలను ఏర్పాటు చేసిన సందర్భాలు చాలా తక్కువే. మొదట్లో ఒకట్రెండు సార్లు పార్టీ నాయకులతో సమావేశం అయ్యారు తప్పితే పెద్దగా వైసీపీ క్యాడర్‌పై ఫోకస్ పెట్టలేదు. ఈ బాధ్యతలను పార్టీ సీనియర్ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డికి అప్పగించారు. పార్టీ నాయకులను కలవడం, తరచూ వారితో సమావేశాలను ఏర్పాటు చేసే బాధ్యతలను సాయిరెడ్డి తీసుకున్నారు. అయితే వైసీపీ పార్లమెంటరీ పార్టీకి కూడా సాయిరెడ్డి సారథ్యాన్ని వహిస్తున్నారు. 22 మంది లోక్‌సభ సభ్యులతో పాటు రాజ్యసభ సభ్యులతో దేశంలో నాలుగో అతి పెద్ద పార్టీగా అవతరించిన వైసీపీ రానున్న రోజుల్లో జాతీయ స్థాయిలో క్రియాశీలకంగా మారనుంది. కాబట్టి మున్ముందు ఆయన దేశ రాజధానికే పరిమితం అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. 


ఈ పరిణామాల మధ్య రాష్ట్ర పార్టీ వ్యవహారాలు ఎవరు చూడాలన్న దానిపై సీఎం జగన్ కసరత్తు మొదలుపెట్టారట. అయితే ఇప్పటికే జగన్ ఒక పేరును ఎంపిక చేసినట్టు తెలుస్తుంది..ప్రస్తుతం పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉన్న సజ్జల రామకృష్ణారెడ్డికి కార్యనిర్వాహక అధ్యక్ష బాధ్యతలను అప్పగించవచ్చని సమాచారం. ఇప్పుడు ఇదే చర్చ వైసీపీ వర్గాల్లో జోరుగా సాగుతోంది. ఇందుకు ముఖ్యకారణం పార్టీ పరంగా అన్ని ప్రాంతాల నేతలతో సజ్జలకు సత్సంబంధాలు ఉండటం. అలాగే కొద్దిరోజులుగా సజ్జల రామకృష్ణా రెడ్డి తరచూ మీడియా ముందుకు రావటం. దీన్ని గ్రహించిన జగన్ మోహన్ రెడ్డి  కరోనా పరిస్థితులు కుదురుకున్న తరువాత దీని గురించి ఓ కీలక ప్రకటన చేయనున్నారని సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: