పైన పటారం లోన లొటారంలా ఉంది ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో జరుగుతున్న సంఘటనలు చూస్తుంటే. విమర్శలు చేయడంలో రాజకీయ నాయకులను మించిపోతున్నారు...రాష్ట్ర రాజకీయాలకన్నా సినీ పరిశ్రమలో జరిగే రాజకీయాలే ఎక్కువ హాట్ టాపిక్ గా మారుతున్నాయి. అంతా ఒకటే.. మేమంతా ఒకే కుటుంబం.. హీరోల మధ్య వివాదాలు కానీ విభేదాలు కానీ అస్సలు లేవు. అంతా కళామతల్లి బిడ్డలం అంటూ బయటకి చెప్తూనే లోలోపల చేసే రాజకీయాలన్నీ చేస్తుంటారు.

 

ఈ మధ్యకాలంలో బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు ఎంత దుమారం రేపాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. హైదరాబాద్ లో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తో కూర్చొని భూములు పంచుకుంటున్నారు అంటూ బాలయ్య చేసిన కామెంట్స్ సినీ వర్గాల్లో సెగలు పుట్టిస్తున్నాయి. ఇదిలా ఉంటే రోజుకొకరు వచ్చి దానిపై పెట్రోల్ పోసి మరింత మంట పెంచుతున్నారు. దాంతో చిలికి చిలికి గాలివానలా మారిపోతుంది ఆ వివాదం. బాలయ్య అలా అనకుండా ఉండాల్సిందంటూ కొందరు బాలయ్యను విమర్శిస్తుంటే.. మరికొందరు మాత్రం అన్నపూర్ణ స్టూడియోస్‌తో పాటు రామానాయుడు స్టూడియోస్ భూములను పంచుకోడానికే అక్కడ మీట్ అయ్యారంటూ బహిరంగంగానే విమర్శిస్తున్నారు. దానికితోడు బాలయ్య చేసిన వ్యాఖ్యలపై నాగబాబు రియాక్షన్ మరింత దుమారం రేపింది. ఇక ఇదే అంశం పట్ల సీఎం కేసీఆర్ ఆరా తీసినట్టు తెలుస్తోంది. అలాగే ఈ నెల 8 తర్వాత, లాక్‌డౌన్ ఆంక్షల సడలింపుల తర్వాత సీఎం కేసీఆర్ తో బాలకృష్ణ సమావేశం కాబోతున్నట్టు తెలుస్తోంది.

 

అసలు ఇండస్ట్రీలో ఏం జరుగుతుంది.. ఎందుకు తనను దూరంగా పెట్టారనే విషయాలపై కూడా బాలయ్య ఇందులో మాట్లాడబోతున్నాడనే వార్తలు అయితే వినిపిస్తుంది. అసలు ఏ అంశంపై తొందరపడి స్పందించకూడదో అదే అంశంపై స్పందించిన నాగబాబు ఇప్పుడు అనవసరంగా చిరంజీవిని బలిపశువును చేసారనే చర్చ జరుగుతోంది. ఇప్పుడు  బాలకృష్ణ వేస్తున్న ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేక అయోమయ పరిస్థితిలో నాగబాబు ఉన్నట్టు తెలుస్తోంది. కాగా, చెలరేగిన వివాదాన్ని శాంతింపజేసేందుకు, పరిశ్రమలోని నిధులు, గతంలో చేసుకున్న ఒప్పందాలతో పాటు అన్ని సందేహాలకు సమాధానం రప్పించే దిశగా సీఎం చొరవచూపబోతున్నట్టు తెలుస్తోంది. ఏదేమైనా కూడా కేసీఆర్‌తో బాలయ్య భేటీ జరిగితే మాత్రం మరిన్ని ఆసక్తికరమైన విషయాలు బయటకి వచ్చే అవకాశం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: