దేశంలో కోట్లాది మందికి ఉపాధి కల్పించే రియ‌ల్ ఎస్టేట్ రంగం కుదేలైంది. క‌రోనా దెబ్బ‌తో దేశ వ్యాప్తంగా స్థిరాస్థి వ్యాపారం క‌దిలిక‌లేని ప‌రిస్థితుల్లోనే ఉంది. కరోనా మహమ్మారి కొట్టిన చావు దెబ్బకి రియల్‌ ఎస్టేట్‌ రంగం విలవిలలాడుతోంది.ముఖ్యంగా క‌న‌స్ట్ర‌క్ష‌న్ వ్యాపారమైతే ల‌క్ష‌లాదిమంది బిల్డ‌ర్ల‌కు న‌ష్టాలు మిగుల్చుతోంది. వాస్త‌వానికి  గత మూడేళ్ల నుంచి మందగమనంలో సాగుతున్న ఈ రంగంలో తాజాగా క‌రోనా కార‌ణంగా ఉరుము లేని పిడుగులా మ‌రిన్ని న‌ష్టాల‌ను కొని తెచ్చాయ‌నే చెప్పాలి. వాస్త‌వానికి దేశ ఆర్థికి వ్య‌వ‌స్థ‌కు రియ‌ల్ ఎస్టేట్ రంగం అనేది ప్ర‌ధాన ఆదాయ వ‌న‌రుగా చెప్పాలి. ఈ రంగంపై కోట్లాదిమంది ప్ర‌జ‌లు ఉద్యోగ, ఉపాధి అవ‌కాశాల‌తోపాటు ల‌క్ష‌ల కోట్ల వ్యాపారం జ‌రుగుతూ ఉంటుంది. 

 

సిమెంటు, ఇసుక‌, ఇటుక‌, రిజిస్ట్రేష‌న్లు, పేయింటింగ్‌,గృహాలంక‌ర‌ణ‌, స్టీల్‌, ర‌వాణా ఇలా ఎన్నో ర‌కాల రంగాలు మిళిత‌మై ఉంటాయి. స్థిరాస్థుల కొనుగోలుపై ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో జ‌నాలు ముందుకు వ‌చ్చే ప‌రిస్థితి క‌నిపించ‌క‌పోవ‌డంతో వ్యాపారులు తీవ్ర ఆందోళ‌న చెందుతున్నారు. ఫ‌లితంగా..అంతిమంగా ఈ రంగం ఆటుపోట్లకి గుర‌వుతుండ‌టంతో ఆ ప్రభావం దేశ ఆర్థిక వ్యవస్థపై కూడా పడుతోంది. ఇండిపెండెంట్‌ ఇళ్లు, అపార్ట్‌మెంట్లు, ఎస్టేట్లు, విల్లాలు, గేటెడ్‌ కమ్యూనిటీలు, మహా టవర్లు, బహుళ అంతస్తుల సౌధాలు.. ఇలా ఎవరెస్టు శిఖరాన్నే తాకిన రంగమిది. అయితే ప్ర‌స్తుతం క‌రోనా కాలం న‌డుస్తుండ‌టంతో ఎంతో  శక్తివంతమైన రియాల్టీ రంగం కూడా ఇప్పుడు గ‌జ‌గ‌జ వ‌ణుకుతోంది.

 

ఒక నివేదిక ప్ర‌కారం.. సుమారు 60 లక్షల కోట్ల రూపాయల విలువజేసే ప్రాజెక్టులు అర్ధాంతరంగా నిలిచిపోయిన‌ట్లు తెలుస్తోంది. పెద్దనోట్ల రద్దు, జీఎస్‌టీ వంటివి కూడా గ‌తంలో దెబ్బ‌కొట్ట‌డంతో మెల్ల‌గా గాడిన ప‌డే స‌మ‌యంలోనే ఈ రంగంపై క‌రోనా పిడుగు ప‌డింది. క‌రోనా త‌గ్గుముఖం ప‌ట్టేనా..? అన్న సందేహాలు వ్య‌క్త‌మ‌వుతున్న నేప‌థ్యంలో ప్ర‌జ‌లు స్థిరాస్థి కొనుగోళ్ల వైపు చూడ‌క‌పోవ‌చ్చ‌న్న‌ది చాలామంది నిపుణుల అభిప్రాయం. వాస్త‌వానికి ఇళ్లు కొనాలనుకున్న వారు తమ నిర్ణయాన్ని వాయిదా వేసుకుంటున్నారు. కరోనా కారణంగా 2021 ఆర్థిక సంవత్సరం వరకూ లగ్జరీ హౌసింగ్‌తో పాటు మొత్తం రియల్‌ ఎస్టేట్‌ రంగంపై ప్రతికూల ప్రభావం తీవ్రంగా ఉందని హౌసింగ్ డాట్ కామ్ తాజా నివేదిక వెల్లడించింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: