తిరుగుబాటు ఎంఎల్సీలపై వీలైనంత తొందరలో యాక్షన్ తీసుకునే విషయంలో తెలుగుదేశంపార్టీ చాలా ఆతృతపడిపోతోంది. టిడిపికి చెందిన ఇద్దరు ఎంఎల్సీలు శివనాధరెడ్డి, పోతుల సునీతలపై ఎలాగైనా అనర్హత వేటు వేయించాలని చంద్రబాబునాయుడు చాలా పట్టుదలగా ఉన్నాడు. గతంలో పై ఇద్దరు ఎంఎల్సీలపై టిడిపి ఇచ్చిన అనర్హత పిటీషన్ పై బుధవారం విచారణ జరగాల్సుంది. విచారణకు వ్యక్తిగతంగా హాజరుకావాలంటూ శాసనమండలి సచివాలయం నుండి నోటీసులు వెళ్ళాయి.

 

అయితే  విచారణకు హాజరు కావాల్సిన ఇద్దరు ఎంఎల్సీలు హాజరుకాలేదు.  తామిద్దరము తమ నియోజకవర్గాల్లో ఉన్న కారణంగా విచారణకు హాజరుకాలేకపోతున్నట్లు నోటీసుకు విడివిడిగా సమాధానమిచ్చారట. కరోనా వైరస్ తదితర కారణాలను ఇద్దరూ తమ సమాధానాల్లో  ప్రస్తావించారు.  విచారణను ఎదుర్కోవాల్సిన సభ్యులు రాకపోయినా టిడిపి తరపున కౌన్సిల్ విప్ బుద్ధా వెంకన్న తన లాయర్ తో హాజరయ్యాడు. ఎప్పుడైతే ఇద్దరు ఎంఎల్సీలు హాజరు కావటం లేదని అర్ధమైందో టిడిపిలో తీవ్ర అసహనం మొదలైంది.

 

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే ఎంఎల్సీలపై తక్షణమే అనర్హత వేటు వేయించేయాలన్న ఆతృత టిడిపిలో బాగా కనబడుతున్నట్లు అర్ధమవుతోంది. ఇప్పటికే రెండు సార్లు ఎంఎల్సీలిద్దరికీ నోటీసులిచ్చిన సచివాలయం టిడిపి పిటీషన్ పై సమాధానం ఇవ్వమని కోరింది. అయితే నోటీసులకు కూడా ఎంఎల్సీలు సమాధానమివ్వలేదు. దాంతో మూడోసారి ఏకంగా విచారణకే హాజరుకవాలంటూ నోటీసులు వెళ్ళాయి. అయితే  వ్యక్తిగత విచారణకు కూడా నెల రోజుల గడువు కోరుతు ఇద్దరు రిప్లై ఇచ్చారు. దాంతో ఏమి చేయాలో ఇటు ఛైర్మన్ కార్యాలయానికి అటు టిడిపికి అర్ధంకావటం లేదు.

 

విచిత్రమేమిటంటే చంద్రబాబు హయాంలో ఇదే అంశంపై వైసిపి ఇచ్చిన అనర్హత పిటీషన్లను ఏమాత్రం పట్టించుకోలేదు. టిడిపి అధికారంలో ఉన్నపుడు వైసిపికి చెందిన 23 మంది ఎంఎల్ఏలను చంద్రబాబు టిడిపిలోకి లాక్కున్న విషయం తెలిసిందే. వారిపై అనర్హత వేటు వేయాలంటూ అప్పట్లో వైసిపి మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ కు చాలాసార్లు పిటీషన్లు ఇచ్చింది.  అయితే ఏ ఒక్క  పిటీషన్ కు కూడా కోడెల రెస్పాండ్ కాలేదు. 

 

తాము అధికారంలో ఉన్నపుడు వైసిపి ఇచ్చిన పిటీషన్లను కనీసం పరిగణలోకి కూడా తీసుకోని టిడిపి ఇపుడు మాత్రం తమ పార్టీలోని తిరుగుబాటు ఎంఎల్సీలపై అనర్హత వేటు వేయించేందుకు మహా ఆతృతపడిపోతోంది. కారణం ఏమిటంటే మండలి ఛైర్మన్ షరీఫ్ కూడా టిడిపి సభ్యుడు కావటమే. అంటే తాము అధికారంలో ఉంటే ఒకనీతి, ప్రతిపక్షంలో ఉంటే మరోనీతి అన్నది చంద్రబాబు సిద్ధాంతమన్న విషయం మరోసారి రుజువవుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: