నారా లోకేశ్.. పాపం.. ఈ మాజీ మంత్రి, తెలుగు దేశం ఆశాకిరణం.. వైసీపీ నాయకులకు మాత్రం లాఫింగ్ స్టాక్ అవుతున్నారు. లోకేశ్ సీరియస్ ఆరోపణలు చేస్తున్నా.. వైసీపీ నాయకులు మాత్రం సిల్లీగానే తీసుకుంటున్నారు. తాజాగా లోకేశ్ దిశ చట్టంపై విమర్శలు చేశారు. దీన్ని కౌంటర్ చేస్తున్న వైసీపీ ఎమ్మెల్యేలు.. అసలు లోకేశ్ కు తెలుగు చదవడం కూడా రాదా అంటూ ప్రశ్నిస్తున్నారు.

 

 

దిశ చట్టం, బిల్లుకు తేడా తెలియని అజ్ఞాని చంద్రబాబు పుత్రుడని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే కొలుసు పార్థసారధి అన్నారు. లోకేశ్ తన అజ్ఞానాన్ని అంతా పోగేసి పుస్తకం విడుదల చేయడం హాస్యాస్పదమని అంటున్నారు. పేదవాడికి మేలు జరిగితే సహించలేని పార్టీ టీడీపీ అని మండిపడ్డారు. లోకేష్‌ ఓడిపోయిన మంగళగిరిలోనైనా.. చంద్రబాబు గెలిచిన కుప్పంలోనైనా.. సీఎం వైయస్‌ జగన్‌ ఏడాది పాలనపై తాను చర్చకు సిద్ధమని, దమ్ముంటే సవాల్‌ను స్వీకరించాలన్నారు. వెంటనే స్పందించకపోతే లోకేష్‌ తోకముడిచి పారిపోయినట్లేనని పార్థసారధి అంటున్నారు.

 

 

సంక్షేమ పథకాల గురించి లోకేష్‌ మాట్లాడితే.. దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉందని పార్థసారధి మండిపడ్డారు. జన్మభూమి కమిటీలు పెట్టి ప్రజలను పీడించిన నీచ చరిత్ర తెలుగుదేశం పార్టీదని మండిపడ్డారు. బీసీలను తోకకత్తిరిస్తా.. తోలు తీస్తా అని చంద్రబాబు మాట్లాడిన మాటలు ఎవరూ మర్చిపోలేదని ఆయన గుర్తు చేశారు. కొన్ని సంక్షేమ పథకాల పేరు చెబితే దివంగత మహానేత వైయస్‌ఆర్, స్వర్గీయ ఎన్టీఆర్‌ పేర్లు గుర్తుకువస్తాయని, ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ అమలు చేస్తున్న అమ్మఒడి పథకం కూడా చెరగని ముద్ర వేసుకుందని అంటున్నారు పార్థసారథి.

 

 

అన్నదాత సుఖీభవ పథకాన్ని మార్చి.. రైతు భరోసా పథకం అమలు చేస్తున్నారని మాట్లాడేందుకు చంద్రబాబుకు సిగ్గుందా..? అని ఎమ్మెల్యే పార్థసారధి మండిపడ్డారు. ప్రజా సంకల్పయాత్రకు ముందు జరిగిన వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్లీనరీ సమావేశంలోనే రైతు భరోసా పథకాన్ని వైయస్‌ జగన్‌ ప్రకటించారన్నారు. నాలుగేళ్లలో రూ.50 వేలు ఇస్తామని.. చెప్పినదానికంటే ముందుగానే రైతు భరోసా పథకాన్ని అమలు చేసి ఐదేళ్లలో రూ.67,500 అందిస్తున్నామన్నారు పార్థసారథి

 

మరింత సమాచారం తెలుసుకోండి: