కరోనా వైరస్.. ప్రస్తుతం ప్రపంచ దేశాలన్నీటిని గజగజా వణికిస్తుంది. ఇప్పటికే ఈ మహమ్మారి బారిన పడి లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు.. ఇంకా కోల్పోతూనే ఉన్నారు. అయినా ఈ మహమ్మారి మాత్రం కనికరించట్లేదు. అలాగే ప్రపంచంలోని దేశాలన్నీ ఈ వైరస్ కి మందు కనిపెట్టే పనిలో పడ్డాయి.. వైద్యులు, శాస్త్రవేత్తలు, పరిశోధకులు దీని వ్యాక్సిన్ కోసం ఎంతగానో ప్రయత్నిస్తున్నారు. ఈ నేపధ్యంలోనే వాట్సాప్ యూనివర్సిటీల్లో పీహెచ్ డీలు చేసిన కొందరు శాస్త్రవేత్తలు తమ పైత్యాన్నంతా ప్రజలపై రుద్దుతున్నారు. అలాగే కొందరు నేతలు కూడా మతిభ్రమించిన మాటలు మాట్లాడుతున్నారు. గోమూత్రంతో కరోనా పోతుందంటూ మొన్నటికి మొన్న బీజేపీ నేతలు వ్యాఖ్యానించడంపై విమర్శలు వచ్చాయి. మరికొందరు నేతలైతే దీని గురించి మనం బయపడాల్సిన అవసరం లేదు అని కూడా చెప్పారు. వాటికి సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో ఎంతగా వైరల్ అయ్యాయో అందరం చూశాం. ఇలా చెప్పుకుంటూ పోతే కరోనాపై వాట్సాప్ ప్రొఫెసర్లు వదిలిన ఎన్నో ఆణిముత్యాలు మనకు దొరుకుతాయి. తాజాగా ఆ జాబితాలో తెలంగాణ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు చేరారు.

 

ఓ సభలో కరోనా వైరస్ గురించి ఎర్రబెల్లి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. కరోనా వచ్చి పడిశంలో, గొంతులో ఆగుతుంది. గొంతులో ఉంటే శరీరానికి ఎక్కుతుంది. జలుబు, దగ్గు లేకపోతే ఠక్కున కడుపులోకి పోతుంది. మీ కడుపులో మిషన్ మంచిది. ఎటువంటి బొక్కలు గానీ, సిమెంట్ గానీ ఏదైనా నమిలిపెడుతుంది. అందులోకి కరోనా పోతే పిప్పి పిప్పి బయటకు పంపేస్తుంది. గొంతులో, ముక్కులో ఉంటే కరోనా శరీరంపై ప్రభావం చూపుతుంది. వేడి నీటి ద్వారా కడుపులోకి వెళ్తే.. ఇబ్బందేం ఉండదంటూ సెలవిచ్చారు. దీంతో ఎర్రబెల్లిని నెటిజన్లు ఓ రేంజ్‌లో ట్రోల్ చేస్తున్నారు. డాక్టర్ ఎర్రబెల్లి…ఎంబీబీఎస్, ఎండీ, ఎఫ్ ఆర్సీఎస్, చైనా వచ్చేశారని…ఇక కరోనా పారిపోతుందని ట్రోల్ చేస్తున్నారు. ‘ఎర్రబెల్లి ఉండగా కరోనా గురించి భయమెందుకు దండగా’ అంటూ మరో నెటిజన్ వ్యంగాస్త్రాలు సంధించారు. ఎర్రబెల్లి దెబ్బకు గజగజ వణికిపోతోన్న కరోనా అంటూ ఓ రేంజ్ లో సెటైర్లు, మీమ్స్ పేలుతున్నాయి. మరి రాజకీయ నాయకులు, సెలబ్రిటీలు, సినీ తారలు కరోనాపై అవగాహన కలిగించేందుకు పలు రకాలుగా ప్రచారం చేస్తూ... ఫిజికల్ డిస్టెన్స్, హ్యాండ్ వాష్, మాస్క్ ధరించడంపై వివిధ మాధ్యమాల ద్వారా అవగాహన కల్పిస్తుంటే.. ఇలాంటి బాధ్యత లేని మంత్రులు వచ్చి మతిభ్రమించిన మాటలు మాట్లాడటం ఎంతవరకు సబబు..?

మరింత సమాచారం తెలుసుకోండి: