ఏపీ సీఎం జగన్ అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయింది. ఈ ఏడాదిలో దాదాపు 90 శాతం హామీలు పూర్తి చేశానంటున్నాడు జగన్. ఆ విషయంలో జనం కూడా చాలా వరకూ సంతృప్తిగానే ఉన్నారు. ఎవరికి ఇచ్చిన హామీల ప్రకారం.. వారి చేతుల్లో ఆర్థిక సాయం పెట్టేయడంలో జగన్ మంచి రికార్డే సొంతం చేసుకున్నారు. కానీ.. ఓ విషయంలో మాత్రం జగన్ సర్కారు ఘోరంగా విఫలమైందన్న టాక్ వస్తోంది.

 

 

అదేంటంటే.. తెలుగు దేశం ప్రభుత్వంలోని అవినీతిని బయటపెట్టడం.. గతంలో ఐదేళ్ల చంద్రబాబు పాలనలో దారుణమైన అవినీతి జరిగిందని వైసీపీ ఎన్నికల ముందు ఆరోపించింది. లక్షల కోట్ల చంద్రబాబు అవినీతిపై వైసీపీ పుస్తకాలు కూడా ప్రచురించింది. జన్మభూమి కమిటీలు, ఇసుక అక్రమాలు అంటూ ఎన్నో ఆరోపణలు చేసింది. ఇక అమరావతి పేరుతో చంద్రబాబు రియల్ ఎస్టేట్ చేశారని.. ఇన్ సైడర్ ట్రేడింగ్ నిర్వహించారని ఆరోపణాస్త్రాలు సంధించారు. వాటిని జనం కూడా నమ్మారు. మొత్తానికి చంద్రబాబును ఘోరంగా ఓడించారు.

 

 

అయితే అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయినా మరి తెలుగు దేశం అవినీతిని నిరూపించడంలో మాత్రం జగన్ సర్కారు ఘోరంగా విఫలమైందన్న వాదనలు వినిపిస్తున్నాయి. అటు టీడీపీ నాయకులు కూడా.. ఏమైంది మా అవినీతిని నిరూపించలేకపోయారేం అంటూ తొడలుగొట్టి మరీ ప్రశ్నిస్తున్నారు. అమరావతి ఇన్ సైడర్ ట్రేడింగ్ వంటి అంశాలపై మంత్రుల కమిటీలను కూడా వేశారు. సిట్ దర్యాప్తునకూ ఆదేశించారు.

 

 

ఇంత జరిగినా చంద్రబాబు సర్కారు అవినీతిని నిరూపించడంలో మాత్రం ముందడుగు పడటం లేదు. అంటే మరి చంద్రబాబు అంత పకడ్బందీగా ఎక్కడా దొరకకుండా అవినీతి సాగించారనుకోవాలా.. లేక.. వైసీపీ దుష్ప్రచారం చేసిందనుకోవాలా.. లేక.. చంద్రబాబు అవినీతిని నిరూపించడంలో వైసీపీ సర్కారు ఫెయిలైందనుకోవాలా.. ఇదీ ఇప్పుడు ఏపీ ప్రజలను కన్‌ఫ్యూజ్ చేస్తున్న ప్రశ్న.

 

మరింత సమాచారం తెలుసుకోండి: