ప్ర‌జ‌లే దేవుళ్లు-స‌మాజ‌మే దేవాల‌యం- అనే నినాదంతో తెలుగు వాడి ఆత్మ‌గౌర‌వానికి ప్ర‌తీక‌గా ఏర్ప‌డిన తెలుగు దేశం పార్టీ కాలులో ముల్లు గుచ్చుకుంటే.. తెలుగు వారి కంట్లో నుంచి నీళ్లు కార‌తాయ‌నే నానుడి ఉంది. గ‌తంలో ఎన్టీఆర్ హ‌యాంలోనూ, త‌ర్వాత చంద్ర‌బాబు అధ్య‌క్షుడిగా ఉన్న స‌మ‌యంలోనూ ఈ త‌ర‌హా సెంటిమెంటు బాగానే పండింది. టీడీపీలో ఏం జ‌రిగినా, వెంట‌నే ప్ర‌జ‌లు క‌నెక్ట్ అవుతారు. త‌మ ఇంట్లోనే ఏదో జ‌రిగింద‌నే భావ‌న క‌లుగుతుంది. వారు వెంట‌నే రియాక్ట్ అవుతారు. గ‌తంలో టీడీపీలో సంక్షోభం ఏర్ప‌డిన‌ప్పుడు.. త‌ర్వాత చంద్ర‌బాబుకు అలిపిరి వ‌ద్ద మావోయిస్టుల దాడి జ‌రిగిన‌ప్పుడు ఇలా నే స్పందించారు.

 

అదే స‌మ‌యంలో 2014లో రాష్ట్ర విభ‌జ‌న‌కు ముందు ఆయ‌న నిర్వ‌హించిన వ‌స్తున్నా మీకోసం.. వంటి యాత్ర‌లు చేసిన‌ప్పుడు కూడా ప్ర‌జ‌ల రియాక్ష‌న్ ఆత్మీయంగానే ఉంది. అంతెందుకు.. 2014లో ఎన్నిక‌ల స‌మ‌యంలో బాబు మాత్ర‌మే ఈ రాష్ట్రానికి ప్ర‌ధాన మ‌నే రేంజ్‌లో ప్ర‌చారం చేసిన‌ప్పుడు కూడా ప్ర‌తి తెలుగు లోగిలీ కూడా ఆయ‌న‌ను ఆత్మీయంగా హ‌త్తుకుంది. అత్యంత కీల‌క స‌మ‌యంలో రాష్ట్రాన్ని పాలించే అర్హ‌త‌, స‌మ‌ర్ధ‌త కూడా బాబుకే ఉన్నాయ‌ని పేర్కొంటూ.. అధికారం కూడా అప్ప‌గించింది. ఆయ‌న వ‌స్తారు.. మార్పు తెస్తారు.. అనే నినాదం భారీగా ప్ర‌చారంలోకి వ‌చ్చింది కూడా ప్ర‌జ‌ల్లోనే!

 

అలాంటి తెలుగు వారి గుండెల్లో స్థానం సంపాయించుకున్న పార్టీ ఇప్పుడు అదే ప్ర‌జ‌ల‌కు దూర‌మ‌వుతోందా?  టీడీపీలో చోటు చేసుకుంటున్న ప‌రిణామాల‌ను ఒక‌ప్పుడు త‌మ‌విగా భావించిన ప్ర‌జ‌లు ఇప్పుడు లైట్ తీసుకుంటున్నారా? అంటే.. తాజాగా ఏడాది కాలంగా జ‌రుగుతున్న ప‌రిణామాల‌ను గ‌మ‌నిస్తే.. ఔన‌నే అంటున్నారు. విశాఖ‌లో చంద్ర‌బాబును నిలువ‌రించిన‌ప్పుడు సింప‌తీ వ‌స్తుంద‌ని భావించిన బాబుకు ఎదురు దెబ్బ‌త‌గిలింది. ఇక‌, ఎన్నిక‌ల‌కుముందు ప‌సుపు-కుంకుమ త‌న అధికారాన్ని నిల‌బెడుతుంద‌ని భావించినా.. ప్ర‌జ‌లు ప‌ట్టించుకోలేదు. ఇక‌, జ‌గ‌న్ ప్ర‌భుత్వంపై ఇచ్చిన నిర‌స‌న పిలుపుల‌కు కూడా ప్ర‌జ‌ల నుంచి స్పంద‌న క‌రువైంది.

 

అయితే, ఇసుక కొర‌త విష‌యంలో ప్ర‌జ‌ల నుంచే స్వ‌చ్ఛందంగా ఉద్య‌మం రావ‌డం డిఫ‌రెంట్‌. కానీ, ఇప్పుడు అచ్చెన్న అరెస్టు, ప్ర‌భాక‌ర‌రెడ్డి అరెస్టుల విష‌యం.. టీడీపీ ఒంట‌రి అవుతోంద‌నే భావ‌నను ప్ర‌జ‌ల్లోకి తీసుకువెళ్తున్నా.. జ‌గ‌న్ ప‌నిగ‌ట్టుకుని త‌మ‌పై రాజ‌కీయ ప్ర‌తీకారాన్ని తీర్చుకునేందుకు ప్ర‌యాస‌ప‌డుతున్నార‌ని, అధికారుల‌ను త‌మ‌పై పుర‌మాయిస్తున్నార‌నే ప్ర‌చారం చేస్తున్నా.. బాబు వ్యాఖ్య‌లు ప్ర‌జ‌ల‌ను ప్ర‌భావితం చేయ‌లేక పోవ‌డం గ‌మ‌నార్హం. మొత్తంగా ఈ ప‌రిణామాలు చూస్తే.. తెలుగు వాడి నాడిలో బాబు పిలుపు వినిపించ‌డం లేదు. రియాక్ష‌న్ క‌నిపించ‌డ‌మూ లేదు!!

మరింత సమాచారం తెలుసుకోండి: