మాజీ మంత్రి, నారాయణ విద్యాసంస్థల అధినేత నారాయణ ఈ మధ్య కాలంలో ఎక్కడా కనిపించట్లేదు. అధికారంలో ఉన్నప్పుడు తెగ వినిపించిన ఈయన గొంతు ఇప్పుడు అస్సలు వినపడట్లేదు. రాష్ట్రంలో జరుగుతున్న టీడీపీ నేతల వరుస అరెస్టుల నేపధ్యంలో ఎంతో మంది ఆ పార్టీ నాయకులు మీడియా ముందుకు వచ్చి అధికారపక్షంపై నిప్పులుచెరిగారు..కానీ, మాజీ మంత్రి నారాయణ మాత్రం ఎక్కడా కనిపించలేదు.. వినిపించలేదు. దీంతో ఆయన చంద్రబాబుకు షాక్ ఇచ్చే పనిలో పడ్డారని రాజకీయ వర్గాల్లో టాక్ వినిపిస్తుంది. ఆ షాక్ ఏంటో తెలియాలంటే ఈ మ్యాటర్ మొత్తం చదవాల్సిందే.

 

2014లో టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత నారాయణను ఎమ్మెల్సీ చేసి మరీ చంద్రబాబు తన కేబినెట్ లోకి తీసుకున్నారు. కేబినెట్ లో కీలకమైన మున్సిపల్ శాఖ, సీఆర్డీఏ బాధ్యతలను నారాయణ నిర్వహించారు. ఆయన కూడా నియోజకవర్గంలో భూగర్భ డ్రైనేజీ పనులను రికార్డ్ సమయంలో పూర్తి చేసి మంచి పేరు తెచ్చుకున్నారు. అలాగే ఆ సమయంలో చాలా చురుకైన పాత్ర పోషించారు. అయినప్పటికీ 2019లో తెలుగుదేశం ప్రభుత్వం పట్ల వీచిన వ్యతిరేక పవనాల లో నారాయణ సైతం కొట్టుకుపోయారు. అయితే వైసీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి నారాయణ కొంత పార్టీకి దూరంగా ఉంటున్నారు.

 

అయినప్పటికీ నిబంధనలు పాటించడం లేదన్న కారణంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఉన్న నారాయణ విద్యాసంస్థలను చెందిన కొన్ని కాలేజీలను సీజ్ చేశాయి ప్రభుత్వాలు. మరి కొన్నీటిని సీజ్ చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. దీంతో పాటు రాజధాని భూముల వ్యవహారంలో నారాయణపై ఇప్పటికే సిట్ కేసు నమోదు చేసింది. అందుకే గత కొంతకాలంగా నారాయణ రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. పార్టీ కార్యక్రమాల్లోనూ పెద్దగా పాల్గొనడం లేదు. ఎక్కువగా హైదరాబాద్ లోనే ఉంటున్నారు. అయితే విద్యాసంవత్సరం త్వరలో ప్రారంభం కానుండంటంతో నారాయణలో కాస్త ఆందోళన మొదలైంది. టీడీపీలో ఉన్నా,లేకున్నా పెద్దగా ప్రయోజనం లేదని ఆయనకు అర్ధమైపోయింది.

 

దీంతో వ్యాపారాలను కాపాడుకునేందుకు ఆయన పక్క పార్టీల వైపు చూస్తున్నారు. ఇప్పటికే సీఎం జగన్ తో ఆయన మంతనాలు జరిపినట్టు సమాచారం. జగన్ కూడా సానుకూలంగానే స్పందించారని తెలుస్తుంది. అయితే నెల్లూరు జిల్లాకి చెందిన మంత్రి అనీల్ కుమార్ యాదవ్ మాత్రం ఈయన రాకను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారట. దీంతో నారాయణ ఢిల్లీలోని కేంద్ర పెద్దలని కలిసి బీజేపీలో చేరేందుకు రంగం సిద్ధం చేస్తున్నారని సమాచారం. ఒకవేళ ఆయన కనుక కేంద్ర పెద్దలని కలిస్తే వారు ఆయన్ని పార్టీలోకి ఆహ్వానించడం పక్కా అని రాజకీయ విశ్లేషకుల మాట. మరి సీఎం జగన్ ముందుగానే మేల్కొని మంత్రి అనీల్ కుమార్ ని బుజ్జగించి నారాయణను పార్టీలోకి తీసుకుంటారా..? లేక నారాయణ కేంద్ర పెద్దలని కలిసి బీజేపీ తీర్థం పుచ్చుకుంటారా..? అనే ప్రశ్నకి త్వరలోనే సమాధానం రానుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: