ఏపీలో ప్రతిపక్షాలకు పోటీగా వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు సొంత పార్టీపైనే బాగా రివర్స్ అవుతున్నట్లు కనిపిస్తోంది. 2019 ఎన్నికల్లో వైసీపీ తరుపున నరసాపురం ఎంపీగా గెలిచిన దగ్గర నుంచి స్వపక్షంలో విపక్ష నేతగా ఉంటూ వస్తున్నారని సొంత పార్టీ వాళ్లే మాట్లాడుకుంటున్నారు. మొదట నుంచి తమ పార్టీ లైన్‌లో ఈయన నడవడం లేదని . గెలిచిన 22 మంది ఎంపీల్లో 21 మంది ఒకదారిలో పోతుంటే, రఘు మాత్రం సెపరేట్ దారిలో వెళుతున్నారని వైసీపీ వర్గాలే కోడైకూస్తున్నాయి.

 

అయితే ముందు నుంచి సొంతపార్టీపై రఘు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారని తెలుస్తోంది. మొదట్లో ఢిల్లీలో బీజేపీ పెద్దలకు విందు ఇచ్చి సంచలనం సృష్టించారు. అలాగే పశ్చిమ గోదావరి జిల్లా జెడ్పీ సమావేశం జరిగితే తనకు వేదిక పైన సీటు వేయలేదని అలిగి వెళ్ళిపోయారు. ఇక మొన్న ఈ మధ్య కూడా ఇళ్ల స్థలాల పంపిణీలో తమ నేతలే అవినీతికి పాల్పడుతున్నారని ఆరోపించారు. అదేవిధంగా ఇసుక విషయంలో కూడా అక్రమాలు జరుగుతున్నాయని చెప్పారు.

 

అలాగే టీడీపీ సీనియర్ నేత అచ్చెన్నాయుడు అరెస్ట్ విషయంలో కూడా రఘు..సొంత పార్టీకి కాస్త వ్యతిరేకంగానే మాట్లాడినట్లు కనిపిస్తోంది. కొందరు వైసీపీ నేతల అత్యుత్సాహం ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చిపెడుతోందన్న ఆయన అచ్చెన్నాయుడు ఇంటి గోడ దూకి ఆయన్ను అరెస్ట్‌ చేయాల్సిన అవసరం లేదని అన్నారు. ఇక అచ్చెన్నను పరామర్శించడానికి చంద్రబాబును అనుమతించకపోవడం మానవ హక్కుల ఉల్లంఘన కిందకు వస్తుందన్న ఆయన బాబును ఆస్పత్రిలోకి అనుమతించకపోవడం సరైన పద్ధతి కాదని వ్యాఖ్యానించారు.

 

అయితే రాజు గారు ఈ విధంగా ప్రభుత్వానికి చురకలు అంటిస్తూనే..అప్పుడప్పుడు జగన్‌ని పొగుడుతున్నారని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. కానీ తాజాగా మాత్రం ఊహించని విధంగా వ్యాఖ్యలు చేసి, మరో సంచలనం క్రియేట్ చేశారు. తన కాళ్లా, వేళ్లా పడితేనే వైసీపీలోకి వచ్చానని, తన వల్ల సీట్లు పెరుగుతాయని జగన్ బ్రతిమాలారని, తాను సీటు అడిగానో, తనని బ్రతిమాలితే వచ్చానో జగన్‌కు తెలుసని వ్యాఖ్యానించారు. ఇక రాజు గారు ఈ రివర్స్ మాటలు వెనుక...చాలా అర్ధం ఉన్నట్లే ఉందని విశ్లేషుకులు అభిప్రాయపడుతున్నారు.

 

కాకపోతే మొదట్లో వైసీపీలో ఉండి తర్వాత జగన్‌పై విమర్శలు చేసి బయటకొచ్చి బీజేపీలో చేరిన రఘు...నెక్స్ట్ టీడీపీలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఇక 2019 ఎన్నికల సమయంలో టీడీపీ తరుపున నరసాపురం ఎంపీ టిక్కెట్ కూడా ఖాయమైపోయింది. కానీ వైసీపీ గాలి ఉందని తెలుసుకుని, వెంటనే వెళ్ళి జగన్ సమక్షంలో వైసీపీలో చేరిపోయి, ఆ పార్టీ తరుపున పోటీ చేసి గెలిచేసి, ఇప్పుడు ఇలా రివర్స్ పాలిటిక్స్ చేస్తున్నారని ఆ పార్టీ వర్గాలే చర్చికుంటున్నాయి. కాకపోతే ఈయన వైసీపీలో చేరేటప్పుడు ఎవరి కాళ్ళు ఎవరు పట్టుకున్నారనేది తెలియాలంటే ఈ విషయంపై జగన్ స్పందించాల్సిందే. కానీ జగన్ మాత్రం బయటకొచ్చి స్పందించడం చాలా కష్టం.

మరింత సమాచారం తెలుసుకోండి: