ఉన్ననాడు పండుగ‌...లేనినాడు ఎండుగ‌ని వెన‌కొక‌టి సామెత ఉన్న విష‌యం తెలిసిందే. అయితే ఇదికాస్త రాజ‌కీయాల‌కు అన్వ‌యించుకుంటే అధికారం ఉన్న‌ప్పుడు పార్టీకి అంద‌రూ కావాల్సిన నాయ‌కులే..అంద‌రూ ముఖ్య‌నేత‌లే..పార్టీకి తాము ఎంతో చేస్తేగాని పార్టీ ఈ స్థితిలో లేద‌ని చెప్పుకునే వారే...అయితే ప‌రిస్థితి త‌ల‌కిందులైన‌ప్పుడు మాత్రం పార్టీని ముందుండి న‌డిపించేందుకు ఒక్క‌రంటే ఒక్క నేత కూడా ఇప్పుడు ముందుకు రావ‌డం లేదంటే ఆశ్చ‌ర్యం వేయ‌క‌మాన‌దు. వాస్త‌వానికి ఇందులో ఆశ్చ‌ర్య ప‌డాల్సింది కూడా ఏం లేదు. పార్టీకి ఏం చేశావ‌న్న‌ది కాదు..పార్టీ మ‌న‌కు ఏం చేసింద‌నేదే నేటి రాజ‌కీయాల్లో ట్రెండింగ్ సూత్రం మ‌రి. ఈ సూత్రాన్ని తెలుగు దేశం పార్టీ నేత‌లు మాత్రం అవ‌పోస‌న ప‌ట్టిన‌ట్లుంది. 


అందుకే పార్టీ క‌ష్ట‌కాలంలో ఉంటే ఒక్క నేత కూడా ముందుకు రావ‌డం లేదు. అవ‌స‌ర‌మైతే వైసీపీలోకే..బీజేపీలోకే వెళ్లిపోతున్నారు గాని టీడీపీకి నాయ‌క‌త్వం వ‌హించ‌డానికి ఇష్ట‌ప‌డ‌క‌పోవ‌డం విశేషం. ఎన్నిక‌లు పూర్తై  ఏడాది గడుస్తున్నా ఇంకా ఆ పార్టీ నేతలు హ్యాంగోవర్ నుంచి బయటపడిన‌ట్లు లేరు.  అధినేత చంద్ర‌బాబు ఎంత ఆరాట‌ప‌డినా క్షేత్ర‌స్థాయిలో ప‌రిస్థితులు పార్టీని వెక్కిరిస్తున్నాయ‌నే చెప్పాలి. స్థానిక సంస్థల ఎన్నికల సమయంలోనూ ఎవరూ బయటకు రాకపోవడం ఆందోళన క‌లిగిస్తోంది. పశ్చిమ గోదావరి జిల్లాను తీసుకుంటే.. 2014 ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేసిన జిల్లా ఇది. గ‌తేడాది జ‌రిగిన ఎన్నిక‌ల్లో మాత్రం కేవ‌లం రెండు సీట్ల‌తో స‌రిపెట్టుకుంది. ఈ జిల్లాలో పార్టీ వాయిస్ కూడా విన‌బ‌డ‌టం లేదు.


  అధికారంలో ఉన్నప్పుడు అందరూ కాలరెగిసిన వాళ్లే. కానీ అధికారం పోయిన తర్వాత మాత్రం పార్టీని పూర్తిగా గాలికి వదిలేశార‌న్న అభిప్రాయం కార్య‌క‌ర్త‌ల నుంచి వినిపిస్తోంది.  పితాని సత్యనారాయణ,మాగంటి బాబు, చింతమనేని ప్రభాకర్,  మాజీ రాజ్యసభ సభ్యులు తోట సీతారామలక్ష్మి, గన్ని వీరాంజనేయులు తదితరులు  ఏడాది కాలంగా మౌనం వ‌హిస్తున్నారు. అధికార పార్టీ కేసుల భయం కావచ్చు, పార్టీకి ఖర్చు చేయాల్సి వస్తుందన్న భయాలు కూడా కావ‌చ్చ‌న్న‌ది రాజ‌కీయ విశ్లేష‌కులు చెబుతున్న మాట‌. అయితే ఏదిఏమైనా అస‌లే రోజురోజుకు కుంచించుకుపోతున్న టీడీపీకి ఇలాంటి పరిణామాలు తీవ్రంగా దెబ్బ‌కొడుతున్నాయ‌నే చెప్పాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: