తెలంగాణ రాజ‌కీయాల్లో గ‌త ఆరేడు సంవ‌త్స‌రాలుగా సీఎం కేసీఆర్‌కు ఎదురు ఉందా ? అని ఆలోచించుకుంటే ఖ‌చ్చితంగా లేద‌నే చెప్పాలి. అసలు కేసీఆర్‌ను ఢీ కొట్టేదెవ‌రు ?  ఆయ‌న్ను ఎదిరించే దెవ‌రు ? ఆయ‌న‌కు ఎదురు నిల‌బ‌డేదెవ‌రు ?  ఇక రెండో సారి కేసీఆర్ అధికారంలోకి వ‌చ్చాక చూస్తే తెలంగాణ‌లో ప్ర‌తిప‌క్షం అనేదే లేద‌ని చెప్పాలి. అస‌లు కేసీఆర్‌ను, టీఆర్ఎస్‌ను విమ‌ర్శించేందుకు కూడా ఎవ్వ‌రూ సాహ‌సించ‌ని ప‌రిస్థితి నెల‌కొంది. అలాంటి తెలంగాణ‌లో ఇప్పుడు ఓ కొత్త ప్ర‌తిప‌క్షం సీఎం కేసీఆర్‌ను తెగ ఉక్కిరి బిక్కిరి చేసేస్తోంది. అసలు ఆయ‌న‌కు, తెలంగాణ నేత‌ల‌కు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. అదే క‌రోనా.. రాజ‌కీయంగా తిరుగులేకుండా దూసుకు పోతోన్న కేసీఆర్ దూకుడుకు క‌రోనా కొంత వ‌ర‌కు బ్రేకులు వేసింద‌నే చెప్పాలి. 

 

ఓ వైపు క‌రోనా టెస్టులు చేయ‌డంలో దేశంలోనే తెలంగాణ వెన‌క ప‌డి ఉంద‌న్న విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. మ‌రోవైపు క‌రోనా టెస్టులు పెంచాల‌ని కోర్టులు, విప‌క్షాలు సైతం మొత్తుకుంటున్నా తెలంగాణ‌లో మాత్రం అనుకున్న స్థాయిలో అయితే ప‌రీక్ష‌లు చేయ‌డం లేద‌న్న‌ది వాస్త‌వం. ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో తెలంగాణ కాంగ్రెస్ నాయ‌కులు దీనిని అంది పుచ్చుకుని ప్ర‌జ‌ల్లోకి వెళ్లి ఫైట్ చేసే సోయ‌లో కూడా లేరు. వారికి టీ పీసీసీ పీటం కోసం కోట్లాడుకోవ‌డంతోనే టైం స‌రిపోయేలా ఉంది. ఇక తెలంగాణ బీజేపీ నేత‌లు మాట్లాడితే మాత్రం ప‌ట్టించుకునే దెవ‌రు.. వారి మాట‌లు వినే తెలంగాణ ప్ర‌జ‌లు ఎవ‌రు ? అన్న‌ట్టుగా ప‌రిస్థితి ఉంది. వీళ్లెవ్వ‌రు కేసీఆర్‌ను ఏం చేయ‌లేక‌పోయినా క‌రోనా మాత్రం ఆయ‌న‌కు ముచ్చెమ‌ట‌లు ప‌ట్టిస్తోంది.

 

ఆదివారం తెలంగాణ‌లో భారీ స్థాయిలో క‌రోనా కేసులు న‌మోదు అయ్యాయి. ఇక టీవీ 5 జ‌ర్న‌లిస్టు క‌రోనాతో మృతి చెంద‌డంతో విధుల్లో ఉన్న జ‌ర్న‌లిస్టులు త‌మ ఉద్యోగం - ప్రాణ భ‌ద్ర‌త నేప‌థ్యంలో తీవ్రంగా స్పందించ‌డంతో దిగి వ‌చ్చిన తెలంగాణ ప్ర‌భుత్వం ప‌లువురు జ‌ర్న‌లిస్టులకు కూడా క‌రోనా ప‌రీక్ష‌లు చేస్తోంది.  గత 5 రోజుల్లోనే రాష్ట్ర వ్యాప్తంగా 1054 కరోనా కేసులు నమోదు కాగా, వాటిలో అత్యధికంగా 825 కేసులు జీహెచ్ఎంసీ పరిధిలోనే నమోదయ్యాయి. రాష్ట్రానికి కీల‌క‌మైన హైద‌రాబాద్‌లో క‌రోనా విజృంభిస్తోంటే ప్ర‌భుత్వం స్పందించాల్సిన రీతిన స్పందించ‌డం లేద‌న్న విమ‌ర్శ‌లు ప్ర‌జ‌ల నుంచి కూడా ఉన్నాయి. ఏదేమైనా తెలంగాణ‌లో ఇప్పుడు కేసీఆర్‌కు క‌రోనాయే పెద్ద ప్ర‌తిప‌క్షంగా మారి ఆయ‌న్ను టెన్ష‌న్ పెట్టేస్తోంద‌న‌డంలో సందేహం లేదు.
 

మరింత సమాచారం తెలుసుకోండి: