వైసీపీ ఫైర్ బ్రాండ్ అనగానే ముందుగా గుర్తొచ్చే పేరు నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా. 2014 లో ప్రతిపక్షానికే పరిమితమైన వైసీపీ తరుపున ఆమె తన గొంతును బలంగా వినిపించారు. అసెంబ్లీలో సైతం అధికారపక్షానికి చెమటలు పట్టించారు. అలాగే 2019లో అధికారం చేపట్టిన తర్వాత కూడా ఆమె తన గొంతును బలంగానే వినిపిస్తున్నారు. ప్రతిపక్షాలకు నిద్రలేకుండా చేస్తున్నారు. ముఖ్యంగా చంద్రబాబు, లోకేష్ లపై ఆమె చేసే విమర్శలు, వారిపై ఆమె వేసే కౌంటర్లు ఆమెను ఈ స్థాయిలో ఉంచాయని చెప్పవచ్చు. అయితే తాజాగా ఎమ్మెల్యే రోజా మరో కౌంటర్ ఇచ్చారు.. ఇప్పుడు దీనిపైనే తెలుగు రాష్ట్రాల్లో చర్చ నడుస్తుంది. ఎందుకంటే ఆమె ఈ కౌంటర్ ఇచ్చింది చంద్రబాబు, లోకేష్ లకు కాదు... డైరెక్ట్ గా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కే ఆమె కౌంటర్ ఇచ్చినట్టు తెలుస్తుంది.

 

అదేంటి కేసీఆర్ తో రోజాకి మంచి అనుబంధం ఉంది కదా, ఆమె కేసీఆర్ ను అనడం ఏంటి..? ఇది అవాస్తవం అనుకుంటున్నారా.? కానీ ఇది నిజంగా నిజం అంటున్నారు విశ్లేషకులు. ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు అనూహ్యంగా పెరుగుతుండటంతో ఎమ్మెల్యే రోజా వాటిపై స్పందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఏపీలో క‌రోనా పెర‌గ‌డానికి కార‌ణంగా పక్క రాష్ర్టాల ప్ర‌భుత్వాలేన‌ని మండిప‌డ్డారు. అక్క‌డ స‌రైన ప‌రీక్ష‌లు చేయ‌కుండా ఏపీకి పంపిస్తున్నార న్నారు. క‌రోనా పాజిటివ్ వ‌చ్చినా అధికారులు, మంత్రులు ప‌ట్టించుకోకుండా ఏపీ మీద‌కి కావాల‌ని వ‌దులుతున్న‌ట్లు ఉంద‌ని వ్యాఖ్యానించారు. గ్రామాల్లో కొత్త వారు క‌నిపిస్తే అడ్డుకోవాల‌ని, వెంట‌నే అధికారుల‌కు ఫిర్యాదు చేయాల‌ని పిలుపునిచ్చారు.

 

ఈ సందర్భంగా ఏపీలో క‌రోనా వ్యాప్తికి తీసుకుంటున్న చర్య‌ల గురించి కొంతమంది పాత్రికేయులు ప్రశ్నించగా, రోజా దానికి సమాధానం చెప్పకుండా అక్కడినుంచి జరుకున్నారు. దీంతో అసలైన రచ్చ మొదలైంది. ఎందుకంటే.. ఏపీలోకి అధికంగా తెలంగాణ రాష్ర్టం నుంచే త‌ర‌లి వ‌స్తున్నారు. ఇప్ప‌టికే అక్క‌డ క‌రోనా ప‌రీక్ష‌లు చేయ‌డంలో ప్ర‌భుత్వం విఫ‌ల‌మైంద‌ని హైకోర్టు మొట్టికాయ‌లు వేయ‌డం జ‌రిగింది. దీంతో ఎమ్మెల్యే రోజా తెలంగాణ సీఎం కేసీఆర్ ని ఉద్దేశించే మాట్లాడారని అర్ధమవుతుంది. అయితే రోజా వ్యాఖ్య‌లు పూర్తి వివాదాస్ప‌దంగా ఉన్నాయ‌ని సోష‌ల్ మీడియా లో విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. ఓ ప్ర‌జా ప్ర‌తినితిగా ఉండి ఏ మాత్రం బాధ్య‌త లేకుండా..స‌మాధానాలు దాట వేయ‌డం క‌రెక్ట్ కాద‌ని పలువురు మండిప‌డుతున్నారు. మ‌రి రోజా వ్యాఖ్య‌ల‌పై తెలంగాణ సీఎం కేసీఆర్ స్పందిస్తారేమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: