అప్పుడెప్పుడో సంవత్సరాల క్రితం చంద్రబాబునాయుడు వేసిన రాంగ్ స్టెప్పే ఇపుడు పార్టీ కొంప ముంచేస్తోందా ? అవుననే అంటున్నారు పార్టీ నేతలు. దాదాపు పది సంవత్సరాల క్రితం అంటే జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధిని ఎదిరించి పార్టీలో నుండి బయటకు వచ్చేసిన విషయం గుర్తుంది కదా. కాంగ్రెస్ అధ్యక్షురాలిని ధిక్కరించి పార్టీలో నుండి బయటకు వెళ్ళిపోయాడన్న కోపంతో కొందరు వైఎస్ వ్యతిరేక నేతలు కలిసి సోనియాగాంధిని బాగా రెచ్చగొట్టారు. దాంతో ముందు వెనకా ఆలోచించకుండా సోనియా కూడా జగన్ పై బాగా ధ్వేషం పెంచుకుంది. దాని ఫలితంగానే అప్పటి  కాంగ్రెస్  ఎంఎల్ఏ శంకరరావు పేరుతో హై కోర్టుకు ఓ లేఖ రాయించారు.

 

తండ్రి, దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ అధికారాన్ని అడ్డం పెట్టుకుని జగన్ అవినీతికి పాల్పడ్డాడని శంకర్రావు లేఖ లో ఆరోపించాడు. ఎటువంటి ఆధారాలు లేకుండా కేవలం ఆరోపణలతో రాసిన లేఖను హైకోర్టు కూడా విచారణకు స్వీకరించింది. సిబిఐతో విచారణ చేయించాలంటూ ఆదేశించింది. దాని పర్యవసానం అందరికీ తెలిసిందే.  అక్కడి నుండి కాంగ్రెస్ పార్టీకి జగన్ కు మధ్య పచ్చగడ్డి వేయకపోయినా భగ్గుమనే పరిస్దితులు మొదలయ్యాయి. సరే జగన్ కు మద్దతుగా కాంగ్రెస్ లో నుండి బయటకు వచ్చేసిన వాళ్ళు వచ్చేశారు. జగన్ ను వ్యతిరేకించిన వాళ్ళు అధికారాన్ని చూసుకుని మరింతగా రెచ్చిపోయారు. సరే అదంతా కాంగ్రెస్-జగన్ వ్యవహారం.

 

ఇక్కడే చంద్రబాబు ఓవర్ యాక్షన్ చేశాడు. కాంగ్రెస్ పార్టీకి జగన్ మధ్య గొడవలు తారాస్ధాయికి చేరుకుంటున్న సమయంలో అవసరం లేకపోయినా  జగన్ కేసుల్లో చంద్రబాబు కూడా వేలుపెట్టాడు. అప్పటి సీనియర్ నేత కేంద్ర మాజీ మంత్రి యర్రన్నాయుడుతో  పిటీషన్ వేయించాడు. జగన్ కు వ్యతిరేకంగా సిబిఐ చేస్తున్న విచారణలో తాను కూడా భాగస్ధుడవుతానంటూ యర్నన్న వేసిన పిటీషన్ కు హై కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.  సిబిఐ విచారణలో కాంగ్రెస్ పార్టీ,  అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఏకమైపోయాయి. ఏదన్నా ఉంటే కాంగ్రెస్ పార్టీ, ప్రభుత్వం, జగన్ తేల్చుకుంటారు. మధ్యలో చంద్రబాబుకు వేలుపెట్టాల్సిన అవసరం ఏమొచ్చింది ?

 

ఏమొచ్చిందంటే అప్పటికే వైఎస్సార్ మీదున్న కసిని జగన్ మీద చూపించాలని చంద్రబాబు డిసైడ్ అయ్యాడు. భవిష్యత్తులో తనకు ఎటువంటి సమస్యా  ఎదురుకాకుండా ముందు జాగ్రత్తగా జగన్ను దెబ్బ కొట్టాలన్న ఉద్దేశ్యంతోనే చంద్రబాబు కూడా అక్రమార్జన కేసుల్లో వేలుపెట్టాడు. జగన్ కు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీతో చంద్రబాబు కుమ్మక్కయ్యాడనే ఆరోపణలు అందరికీ తెలిసిందే.  జగన్ కేసుల్లో టిడిపి ఇంప్లీడ్ అవ్వటం వల్ల జగన్ కు అదనంగా వచ్చిన కష్టాలేమీ లేవు. కాకపోతే నిబంధనలకు విరుద్ధంగా జగన్ ను 16 మాసాల పాటు జైల్లో ఉంచటంలో చంద్రబాబు పాత్రకూడా ఉందనే ప్రచారం అందరికీ తెలిసిందే.

 

దానికి తగ్గట్లే రాష్ట్ర విభజన తర్వాత ముఖ్యమంత్రయిన చంద్రబాబు అసెంబ్లీలో కానీ బయట కానీ జగన్ను ప్రధానప్రతిపక్ష నేతగా ఏరోజూ అంగీకరించ లేదు. అంగీకరించకపోగా  అసెంబ్లీలోనే ఎన్నిరకాలుగా అవమానించింది అందరూ చూసిందే. అసెంబ్లీలో జగన్ను అవమానించిన వాళ్ళల్లో అచ్చెన్నాయుడు, దేవినేని ఉమామహ్వేశ్వరరావు, యనమల రామకృష్ణుడు, బోండా ఉమ, ప్రత్తిపాటి పుల్లారావు, ఫిరాయింపు ఎంఎల్ఏలు ఇలా చాలామందే ఉన్నారు. అవసరం లేకపోయినా జగన్ను వ్యక్తిగత విషయాలను, కేసులను, జైలు శిక్షను, ప్రతిశుక్రవారం కోర్టులో హాజరవ్వటాన్ని ప్రస్తావించి అవమానించి వాళ్ళు. వీళ్ళందరినీ చంద్రబాబు బాగా ప్రోత్సహించాడనే విషయం మరచిపోకూడదు.

 

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే ప్రధాన ప్రతిపక్షనేతగా జగన్ గుర్తించని చంద్రబాబు, టిడిపి నేతలు చివరకు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా సిఎంగా కూడా గుర్తించ లేదు.  అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి  జగన్ను ఎన్ని రకాలుగా అవమానిస్తున్నది అందరూ చూస్తున్నదే.  తాము అవమానించటమే కాకుండా ఎల్లోమీడియాలో కూడా పుంఖాను పుంఖాలుగా బురద చల్లిస్తునే ఉన్నాడు చంద్రబాబు.

 

సో మొత్తం మీద జగన్ పై చంద్రబాబులో ఎంత కసి పేరుకుపోయిందో అందరికీ అర్ధమైపోయింది. అధికారంలో ఉన్నపుడూ చివరకు ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత కూడా జగన్ను టార్గెట్ చేస్తున్నపుడు జగన్ ఎందుకు చేతులు కట్టేసుకుని కూర్చుంటాడు ? దాని ఫలితమే  అచ్చెన్న, జేసి ప్రభాకర్ రెడ్డి అరెస్టులు. అప్పట్లో చంద్రబాబు రాంగ్ స్టెప్ వేయకుండా ఉండుంటే ఇపుడు పరిస్ధితి ఎలాగుండేదో ?

 

మరింత సమాచారం తెలుసుకోండి: