ఎంపీ రేవంత్ రెడ్డి వ్యూహంలో సీఎం కేసీఆర్ చిక్కుకుంటారా..? మంత్రి ఈటల రాజేందర్ పై నిజంగానే వేటు పడబోతుందా..? రేవంత్ రెడ్డి మాటల్లో నిజమెంత..? అనే ప్రశ్నలను కొంచెంసేపు పక్కనపెడితే.. అసలు రేవంత్ రెడ్డి అలా ఎందుకు మాట్లాడాడో చూద్దాం. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సాదించుకున్న తర్వాత సీఎం కేసీఆర్ అధ్యక్షతన ఏర్పడ్డ తొలి ప్రభుత్వంలోనే ఈటల రాజేందర్ కు ఆర్థిక మంత్రిగా పనిచేసే అవకాశం దక్కింది. మంత్రి పదవి దక్కడంతో నాడు కేసీఆర్ కు చాలా కృతజ్ఞతలు చెప్పుకున్నారు ఈటల. ఐదేళ్ల పాటు కొత్తగా ఏర్పాటైన తెలంగాణ రాష్ట్రానికి ఈటల ఆర్థిక మంత్రిగా వ్యవహరించారు. అనంతరం 2018 లో జరిగిన ఎన్నికల్లో మళ్ళీ టిఆర్ఎస్ ఘనవిజయం సాధించి కేసీఆర్ అధ్యక్షతన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అయితే ఈ సారి ఈటలకు మంత్రి వర్గంలో చోటు లభించదనే ప్రచారం జోరుగా జరిగింది. కానీ, చివరి నిమిషంలో వైద్య ఆరోగ్యశాఖను ఈటలకు కేటాయించడం జరిగింది.

 

అయితే ఆ కుర్చీ ఏ ముహూర్తాన్న ఎక్కారో తెలియదు కానీ… నాటి నుంచి ఈటలకు కష్టాలు మొదలయ్యాయి. మొదట్లో డెంగ్యూ – చికెన్ గున్యా బలంగా ప్రబలి చాలా మరణాలు సంభవించాయి. దీంతో అది పూర్తిగా ఆశాఖ మంత్రి ఈటల అసమర్థత అంటూ ప్రచారం జరిగింది. తెరాస అనుకూల పత్రికల్లో కూడా పరోక్ష కథనాలు వచ్చాయి. ఆ తర్వాత ఈఎస్ఐ కుంభకోణం.. ఇలా ఒకదానితర్వాత ఒకటి ఈటలకు ఇబ్బందులు కలిగించాయి. దీంతో ఈటలను మంత్రి పదవి నుంచి తొలగిస్తారనే చర్చ బలంగా సాగింది. కానీ అలా జరగలేదు. అయితే ఇప్పుడు కరోనా కారణంగా ఈటల సీటుకి మళ్ళీ గండం ఉందని తెలుస్తుంది. తెలంగాణలో కరోనా కేసులు విచ్చలవిడిగా పెరుగుతున్న నేపథ్యం, టెస్టుల సంఖ్య పెంచడంలేదని కోర్టుల్లో కేసులు.. దీంతో మరోసారి బాధ్యుడిని చేస్తూ ఈటలను మంత్రి పదవి నుంచి తప్పించబోతున్నారని వార్తలు వచ్చాయి.

 

అయితే ఇదే విషయాన్ని చనిపోయిన జర్నలిస్ట్ మనోజ్ కుటుంబానికి మద్దతుగా దీక్షలు చేస్తున్న జర్నలిస్టుల వద్దకు వెళ్లిన రేవంత్ రెడ్డి కూడా చెప్పారు. అయితే ఇప్పుడు రేవంత్ రెడ్డి మాటలే ఈటలను కాపాడబోతున్నాయని విశ్లేషకుల అభిప్రాయం. ఎందుకంటే కరోనా సాకుతో ఈటలను కేసీఆర్ మంత్రిపదవి నుంచి తొలగించాలని భావించినా… రేవంతి రెడ్డి కామెంట్ల నేపథ్యంలో ఆ ధైర్యం చేయలేరని అంటున్నారు. అలా చేస్తే… రాజకీయంగా ప్రజల్లో రేవంత్ మాటలకు, తనపై చేసే విమర్శలకు ఆదరణ పెరిగిపోతుందని కేసీఆర్ భావిస్తున్నారట. దీంతో… ఈటలను రేవంత్ బలంగా సేవ్ చేసినట్లే అని రాజకీయ వర్గాల్లో టాక్ నడుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: