మే 7 2020 ఆంధ్రప్రదేశ్ ప్రజలు చరిత్రలో మర్చిపోలేని రోజు, ముఖ్యంగా విశాఖపట్నం ప్రజలకి ఇది చీకటి రోజు. విశాఖ‌లో ఎల్జీ పాలిమ‌ర్స్ కంపెనీ నుంచి విడుద‌లైన విష‌వాయువు ఘ‌ట‌న తాలూకా దృశ్యాలు ఇంకా కళ్ల ముందు కదులుతూనే ఉన్నాయి. ఈ ఘ‌ట‌న‌లో మొత్తం 15 మంది చ‌నిపోయారు. స్పాట్‌లో 12 మంది, ఆ త‌ర్వాత ఒక్కొక్క‌రు చొప్పున ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. ఎన్నో కుటుంబాలు రోడ్డున పడ్డాయి, ఎంతోమంది జీవితాలు చితికిపోయాయి, మూగజీవాలు సైతం మరణించాయి. ఆ దృశ్యాలను చూసి కన్నీరు పెట్టని కన్ను లేదు, చలించని గుండె లేదు, అయ్యో పాపం అనని నోరు లేదు. ఈ ఘటన ఒక్క ఆంధ్ర రాష్ట్రాన్నే కాకుండా దేశాన్ని సైతం కుదిపేసింది.

 

ఆఖరికి ఈ విషయాన్ని కూడా రాజకీయంగా వాడేసుకున్నారు మన సిగ్గులేని నాయకులు. దీనిపై అధికార, ప్రతిపక్షాల మధ్య ఒక మినీ యుద్ధమే జరిగింది. ఎల్జీ కంపెనీతో సీఎం జ‌గ‌న్ కుమ్మ‌క్క‌య్యార‌ని.. అందుకే స్టైరిన్‌ను రాష్ట్రం నుంచి దొడ్డిదారిలో అనుమ‌తులు ఇచ్చి పంపేశార‌ని ప్రతిపక్షాలు తీవ్రంగా విమర్శించాయి. అయితే ఈ ఘటన సమయంలో టీడీపీ అధినేత హైదరాబాద్ లో ఉన్నారు. కరోనా లాక్ డౌన్ కారణంగా విశాఖ‌ వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని కేంద్రానికి లేఖ రాశారు. అయితే, అనూహ్యంగా ఆ రోజు దేశ వ్యాప్తంగా ప్ర‌యాణించాల్సిన విమానాల‌ను కేంద్ర విమాన‌యాన శాఖ ర‌ద్దు చేసింది. దీంతో చంద్ర‌బాబు విశాఖ ప‌ర్య‌ట‌న ర‌ద్దు చేసుకున్నారు. అనంత‌రం నాలుగు రోజుల త‌ర్వాత ఇరు రాష్ట్రాల పోలీసుల అనుమతితో మ‌హానాడును నిర్వహించేందుకు హైద‌రాబాద్ నుంచి చంద్ర‌బాబు విజ‌య‌వాడ‌కు వ‌చ్చారు.

 

ఈ నేపధ్యంలో ఆయ‌న తొలుత విశాఖ వెళ్లి, ఎల్జీ పాలి మ‌ర్స్ బాధితుల‌ను ప‌రామ‌ర్శించాల‌ని నిర్ణ‌యించుకున్నారు. కానీ ఏమైందో ఏమో మ‌హానాడు పూర్తి చేసుకుని మ‌ళ్లీ హైద‌రాబాద్ వెళ్లిపోయారు. దీనిపై వైసీపీ నేతలు చంద్రబాబుని పాయింట్ అవుట్ చేశారు. విశాఖ ఎందుకు వెళ్ల‌లేదు బాబూ అని నేరుగా నిలదీశారు. కానీ, ఈ వ్య‌వ‌హారంపై టీడీపీ నేత‌లు గానీ, చంద్రబాబు గానీ ఎవరూ నోరు మెదపలేదు. దీనికి కారణం అన్వేషించగా.. విశాఖ వెళ్లి ఎల్జీ విష‌యాన్ని రాజ‌కీయం చేయ‌ద్ద‌ని ఢిల్లీ పెద్దలు చంద్రబాబుకు సూచించారని.. అందుకే బాబు సైలెంట్ అయిపోయార‌ని తెలిసింది. ఇక ఇదే విష‌యంలో రాష్ట్ర బీజేపీని కూడా కేంద్ర ప్ర‌భుత్వం క‌ట్ట‌డి చేసింద‌ని, అందుకే క‌న్నా కూడా మౌనం వ‌హించార‌ని తెలిసింది. దీన్నిబట్టి చూస్తే ఈ వ్యవహారంలో ఏదో మతలబ్ ఉందని అర్ధమవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: