నేనండీ నల్లచొక్కాని... అదే, ఇవాళ ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అసెంబ్లీకి వస్తూ ధరించిన నల్లచొక్కాని. కొన్ని విషయాలను, అలాగే నా బాధను మీతో పంచుకోవటానికి ఇవాళ, ఇలా మీ ముందుకు వచ్చాను. అసలు ఈ చంద్రబాబుకు ఇవాళ నా అవసరం ఏమొచ్చిందో నాకైతే అర్ధం కావట్లేదు.. మీలో ఎవరికైనా అర్ధమైతే దయచేసి నాకు చెప్పండి.

 

గత ప్రభుత్వ హయాంలో అవినీతికి పాల్పడ్డారంటూ ఆయనెవరో మాజీమంత్రి అచ్చెన్నని ఇప్పుడు ఈ ప్రభుత్వం అరెస్టు చేయడం ఏంటి..? దానికి వ్యతిరేఖంగా ఈయన నన్ను ధరించి అసెంబ్లీకి వెళ్ళడం ఏంటి..? నా ఖర్మ కాకపోతే. అసలే నన్ను చాలా మంది అపశకునం అంటారు.. అయినా సరే నన్ను ఇష్టపడే వాళ్ళు ఉన్నారు కదా అని వాళ్లకోశం ఏదో అలా నెట్టుకొస్తుంటే.. ఈ బాబు ఇలా చేసి నా పరువు తీయడం ఏమన్నా బాగుందా..? మీరే చెప్పండి. అయినా మీ అందరి సమక్షంలో బాబుకి నేనొకటి చెప్పదలుచుకున్నా. అదేంటంటే.. బాబు.. నువ్వు నిత్యం నా మిత్రులైన తెలుపు, పసుపును ధరించినా శాశ్వతంగా అధికారంలో ఉండవు. అలా అని ఎవరికో వ్యతిరేఖంగా నన్ను ధరించినా వారికి నా వల్ల చెడు జరగదు, నువ్వు తిరిగి అధికారంలోకి రావు. ఏదైనా నీ మనసులో ఉండాలి, ప్రజా సమస్యలపై నిజాయితీగా పోరాడాలి అప్పుడే నీకు దక్కాలసింది దక్కుతుంది.

 

నన్ను రోజు ధరించే వ్యక్తుల గురించైతే నేను ఇంతలా మాట్లాడేదాన్ని కాదు. కానీ, బాబు నన్ను ధరించడం ఇది రెండో సారి మాత్రమే. మొదటి సారి కూడా ఇలానే ఆయనెవరో ప్రధాని నరేంద్ర మోదీ ఈయన రాష్ట్రానికి ఏదో ఇస్తానని చెప్పి ఇవ్వలేదట. దీంతో ఆయనపై పోరాటానికి దిగేందుకు ఈయన నన్ను ధరించారు. అయినా మీ రాజకీయ నాయకుల్లో చెప్పింది చెప్పినట్టు చేసేవాడు ఎవడున్నాడు.. ఎక్కడో ఎవడో తప్పా. పైగా మీరు మీరు బాగానే ఉంటారు, మరి మధ్యలో నన్నెందుకు బలి చేస్తున్నారు..? దయచేసి మీలో ఎవరికైనా నా బాధ అర్ధమైతే పోయి ఆ చంద్రబాబుతో చెప్పండి ఇంకోసారి ఇలాంటివి చేసేటప్పుడు నన్ను ధరించొద్దని.

మరింత సమాచారం తెలుసుకోండి: