తెలంగాణ పీసీసీ పదవిపై కన్నేసింది 20 మంది కాంగ్రెస్ నేతలు.. మరి సీటు ఎవరిని వరిస్తుంది..? కాంగ్రెస్ హై కమాండ్ ఎవరి వైపు మొగ్గు చూపుతుంది..? సోనియమ్మ అభయం ఎవరికి దక్కుతుంది..? ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో ఈ అంశాలే హాట్ టాపిక్. ఎవరి ప్రయత్నాలు వారు చేస్తున్నప్పటికీ నిత్యం ఒకరి పై ఒకరు విమర్శలు, సెటైర్లు. ముఖ్యంగా మల్కాజ్ గిరి ఎంపీ రేవంత్ రెడ్డి, నల్గొండ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిల మధ్య ప్రధాన పోటీ నడుస్తుంది. ఈ క్రమంలో తెలంగాణ కాంగ్రెస్ కమిటీ ప్రెసిడెంట్‌ గా రేవంత్ రెడ్డిని అధికారికంగా ప్రకటించేందుకు కాంగ్రెస్ హైకమాండ్ ఏర్పాట్లు పూర్తి చేసినట్లుగా తెలుస్తోంది.

 

రేవంత్ రెడ్డి అయితేనే పార్టీని సమర్థవంతంగా ముందుకు తీసుకువెళ్లడంతో పాటు, తమ ప్రధాన ప్రత్యర్థి అయిన టిఆర్ఎస్ పార్టీని ధీటుగా ఎదుర్కొంటూ పార్టీని బలోపేతం చేస్తాడని అధిష్టానం భావిస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే కోమటిరెడ్డి వెంకటరెడ్డి, రేవంత్ రెడ్డిలతో ఇప్పటికే హైకమాండ్ మంతనాలు జరిపిందని, అన్ని సమీకరణాలు పరిశీలించి.. ఎవరికి ఇచ్చినా కలిసి పని చేస్తామనే మాట తీసుకున్నట్లుగా చెబుతున్నారు. అయితే ఈ విషయంలో పార్టీ సీనియర్లు మాత్రం అధిష్టానంపై తీవ్ర ఒత్తిడి తీసుకొస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో రేవంత్ కు పీసీసీ అధ్యక్ష పదవి ఇవ్వొద్దని, వేరే ఎవరికి ఇచ్చినా తమకి అభ్యంతరం లేదని చెబుతున్నా, హైకమాండ్ మాత్రం అన్ని రకాల ప్లస్సులు, మైనస్సులు పరిశీలించి.. చివరికి రేవంత్ రెడ్డి వైపు మొగ్గుచూపించిందని చెబుతున్నారు.

 

అలాగే అధికారిక ప్రకటన చేసే ముందు రేవంత్ ను ఓ సారి ఢిల్లీకి పిలిపించి మాట్లాడే అవకాశం ఉందని అంటున్నారు రాజకీయ నిపుణులు. అయితే రేవంత్ రెడ్డి పై హైకమాండ్ అంతలా ఆశలు పెట్టుకోవటానికి కారణం ఏంటంటే.. ఇటీవల కేటీఆర్ ఫామ్ హౌస్ వ్యవహారంలో రేవంత్ దూకుడుగా ముందుకు వెళ్లడం అని తెలుస్తుంది. ఈ వ్యవహారంలో అధికారపార్టీని రేవంత్ కాస్త ఇబ్బంది పెట్టడాని, దాని ద్వారా కాంగ్రెస్ పార్టీలో కదలిక వచ్చిందని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తుందట. దీంతో రేవంత్ రెడ్డిని పీసీసీ అధ్యక్షుడిగా నియమిస్తే పార్టీకి పూర్వ వైభవం రావచ్చని హైకమాండ్ ఆశిస్తుందట. మరి అధిష్టానం పెట్టుకున్న ఆశలను రేవంత్ నెరవేరుస్తాడా..? రేవంత్ తో కలిసి పనిచేసేందుకు మిగతా నేతలంతా ముందుకు వస్తారా..? అసలు రేవంత్ కి పార్టీ పగ్గాలు పట్టిస్తే.. ఆ పార్టీలో ఉండేవారెవరు..? బయటకి పోయేవారెవరు..? అనే ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: