ఆమె మ‌హిళా మంత్రి. అంత సింపుల్‌గా తీసేయ‌డానికి కుదిరే ప‌రిస్థితి లేదు. ఆమె డిప్యూటీ సీఎం కూడా. పైగా గిరిజ‌న కోటాలో జ‌గ‌న్ అభిమానంతోపాటు.. ఆయ‌న కేబినెట్‌లోనూ మంత్రిగా చోటు సంపాయించుకు న్న నాయ‌కురాలు.  వైఎస్ కుటుంబంతో క‌లిసి మెలిసిపోయే నాయ‌కురాలిగా కూడా ఆమె గుర్తింపు పొందారు. చేతిపై ప‌చ్చ‌బొట్టు కూడా వేయించుకున్నారు. వైఎస్ ఫ్యామిలీ కోసం ఎంత‌వ‌ర‌కైనా రెడీ! అన‌గలిగిన నాయ‌కురాలు కూడా! అందుకే ఆమె డిప్యూటీ సీఎంగా కీల‌క‌మైన మంత్రి త్వ‌శాఖ ద‌క్కింది. ఆమేకు రుపాం ఎమ్మెల్యే పాముల పుష్ప శ్రీవాణి.

 

వ‌రుస విజ‌యాలు సాధించిన పుష్ప శ్రీవాణి 2014, 2019 ఎన్నిక‌ల్లో వైసీపీ త‌ర‌ఫున కురుపాం నుంచి గెలుపు గుర్రం ఎక్కారు. జ‌గ‌న్‌కు న‌మ్మిన బంటుగా పేరు తెచ్చుకున్నారు. మ‌రి ఇప్పుడు ఆమె డిప్యూటీ సీఎంగా బాధ్య‌త‌లు తీసుకుని ఏడాది పూర్త‌యింది. డిప్యూటీ సీఎంగా, గిరిజ‌న సంక్షేమ శాఖ మంత్రిగా ఆమె ఈ ఏ డాది కాలంలో ఏమేర‌కు దూకుడు ప్ర‌ద‌ర్శించారు? ఏయే మార్పులు తీసుకువ‌చ్చారు? ఎలాంటి నిర్ణ‌యా లు తీసుకున్నారు? అనే విష‌యాలు కీల‌కంగా మారాయి. గిరిజ‌న మంత్రిగా ఆమె ప‌రిశీల‌న‌, ప‌ర్య‌వేక్ష‌ణ‌కు మంచి మార్కులే ఉన్నాయి.

 

అయితే, ఎక్క‌వ కాలం ఆమె టిక్ టాక్ వంటి సోష‌ల్ మీడియా గ్రూపుల్లో అభిన‌యించ‌డం గ‌మ‌నార్హం. దీని నుంచి మంత్రిగా ఆమె గుర్తింపు కోరుకోవడం, మ‌రీ ముఖ్యంగా జ‌గ‌న్ కు అత్యంత అభిమాన పాత్రురాలు కావ‌డంతో జ‌గ‌న్‌పైనే టిక్‌టాక్ చేసి అధికార ప‌క్షం నుంచి ప్ర‌శంస‌లు, ప్ర‌తిప‌క్షాల నుంచి విమ‌ర్శ‌లు ఎదుర్కొన్నారు. అయితే, అదేస‌మ‌యంలో నియోజ‌క‌వ‌ర్గం అభివృద్ధి విష‌యంలో మాత్రం మంత్రిగా ఆమె వెనుక‌డుగు వేశార‌ని, అభివృద్దిని ప‌ట్టించుకోలేద‌నే విమ‌ర్శ‌లు ఉండ‌డం గ‌మ‌నార్హం.

 

దీనికితోడు ఇటీవ‌ల ఆమె మామ .. జ‌గ‌న్ ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌లు సంధించారు. అభివృద్ధిని పట్టించుకోవ‌డం లేద‌ని, డ‌బ్బులు పంచితే స‌రిపోతుందా? అని ఆయ‌న ప్ర‌శ్నించారు. ఈ నేప‌థ్యంలో మంత్రిగా ఆమె ఒకింత ఇర‌కాటంలో ప‌డ్డార‌నే చెప్పాలి. మొత్తంగా చూస్తే.. సోష‌ల్ మీడియాపై ఉన్న శ్ర‌ద్ధ త‌న ప‌ద‌విపై లేద‌నే వ్యాఖ్య‌ల‌కు అవ‌కాశం ఇచ్చార‌నే చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: