సందర్భం ఏదైనా గానీ, దాన్ని రాజకీయంగా ఉపయోగించుకోవటంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడికి ఎవరూ సాటిరారన్న విషయం జగమెరిగిన సత్యం. ఆయనకి ప్రయోజనం కలుగుతుంది అంటే మాత్రం ఎక్కడిదాకైనా వెళ్లిపోతారు.. ఎవరినైనా కలుస్తారు. ఇలాంటి సందర్భాలు చాలానే జరిగాయి. అయితే తాజాగా చంద్రబాబు మరో చావు రాజకీయానికి తెరలేపినట్టు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చర్చ నడుస్తుంది. ఆ చావు ఎవరిది అని తెలుసుకునే ముందు.. ఒక్కసారి చంద్రబాబు గతంలోకి వెళ్ళొద్దాం.

 

చంద్రబాబు గతం ఒక్కసారి చూసుకుంటే సొంత బావమరిది నందమూరి హరికృష్ణ చూవును కూడా రాజకీయంగా వాడుకోవాలని చూసిన చరిత్ర బాబుది. హరికృష్ణ పార్థివదేహాన్ని చూడటానికి వచ్చిన తెలంగాణ మంత్రి కేటీఆర్ తో.. టి.టీడీపీ, టిఆర్ఎస్ పొత్తుల గురించి మాట్లాడిన ఘనుడు చంద్రబాబు. దీనికి షాక్ తిన్న కేటీఆర్ ఇది సరైన సమయం కాదని, దాని గురించి తర్వాత మాట్లాడుకుందాం అని చెప్పారు. ఈ విషయాన్ని స్వయానా కేటీఆరే చెప్పారు.. అప్పట్లో దీనిపై పెద్ద రాద్దాంతమే జరిగింది.

 

అలాగే ఒకసారి గతంలో తెలంగాణ సీఎం కేసీఆర్ మాట్లాడిన మాటలు చూసుకుంటే.. 2018 తెలంగాణ ఎన్నికల్లో నందమూరి సుహాసినిని టీడీపీ అభ్యర్ధిగా కూకట్ పల్లిలో పోటీచేపించడం, ఆపై ఆమె ఓడిపోవడంపై కేసీఆర్ మండిపడ్డారు. అవకాశానికి ఉపయోగించుకోవడం, వదిలించుకోవడం చంద్రబాబు నాయుడుకే తెలుసునన్నారు. హరికృష్ణ చనిపోవడాన్ని సొమ్ము చేసుకోవాలని ప్రయత్నించిన వ్యక్తి చంద్రబాబు అంటూ మండిపడ్డారు. చంద్రబాబు నాయుడు అమాయకురాలిని తీసుకువచ్చి బలిచేశాడని ధ్వజమెత్తారు.  నందమూరి సుహాసినికి ఇప్పుడు ఏం చేస్తాడని ప్రశ్నించారు. ఇలాంటి వ్యక్తిని ఏపీ ప్రజలు ఎలా భరిస్తున్నారంటూ ప్రశ్నించారు. ప్రపంచంలో సిగ్గు శరం లేని వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది చంద్రబాబు నాయుడు మాత్రమే అని గతంలో కేసీఆర్ అన్నారు.

 

అయితే కేసీఆర్ చెప్పినట్టు చంద్రబాబును భరించడం కష్టం అనుకున్నారో ఏమో గానీ, 2019 ఎన్నికల్లో దారుణంగా ఓడించారు ఆంధ్ర ప్రజలు. అయితే 2019 ఎన్నికల ముందు ప్రధాని మోదీతో కయ్యానికి కాలుదువ్విన చంద్రబాబు.. ఓటమి తర్వాత మోదీతో కలిసేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఇది అందరికీ తెలిసిన నగ్న సత్యం. అయితే దానికి సరైన సందర్భం రాలేదు. కానీ ఇప్పుడు మోదీతో కలిసేందుకు బాబుకు ఒక అవకాశం దొరికింది. అదే భారత్-చైనా ఘర్షణలు. ఈ ఘర్షణల వల్ల 20 మంది జవాన్లు వీరమరణం పొందారు. దేశమంతా ఏకమై వీరి మరణం పట్ల సంతాపం తెలుపుతూ.. సెల్యూట్ చేస్తున్నారు.

 

అయితే దీనిమీద చంద్రబాబు కూడా స్పందించారు. అమరవీరులకు సంతాపం తెలిపారు. దాంతో పాటు ఇలాంటి విపత్కర పరిస్థితులలో దేశమంతా మోదీకి మద్దతుగా నిలబడాలని పిలుపునిచ్చారు. తాను కూడా మోదీకి మద్దతు తెలుపుతున్నట్టు ప్రకటించారు. అయితే బావమరిది చావునే రాజకీయంగా వాడుకోవాలని చూసిన బాబుకి ఈ అమరవీరుల చావులు ఓ లెక్కా..? అని ప్రశ్నిస్తున్నారు కొందరు. అసలు ఇదంతా మోదీ మెప్పుకోసం బాబు ఆడుతున్న నాటకమని కొందరు విశ్లేషకులు భావిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: