ఆంధ్రప్రదేశ్ రాజకీయాలతో పోలిస్తే కరోనా కొంచం నయమేమో అనిపిస్తుంది. అంత హీనంగా ఉంది ఏపీ రాజకీయాల  పరిస్థితి. రాష్ట్రంలో ఏం జరిగినా సరే.. దానికి కులం అనే రంగు పూయడం మన నేతలకు వెన్నతో పెట్టిన విద్య. ఈ విషయంలో అధికారపక్షం, ప్రతిపక్షం ఇద్దరూ ఇద్దరే. ఎవరికి అనుగుణంగా వారు కులం కార్డును వాడతారు.

 

మొన్నటికి మొన్న రాష్ట్రంలోనే కాకుండా దేశ వ్యాప్తంగా సంచలనం రేపిన నర్సీపట్నం డాక్టర్. సుధాకర్ కేసులో దళితుడు అనే కులం కార్డు తొంగి చూసింది. అలాగే నిన్న ఈఎస్ఐ మందుల కొనుగోళ్ల కుంభకోణంలో మాజీ మంత్రి అచ్చెన్నాయుడు అరెస్టులో కూడా బీసీ అనే కులం కార్డు తొంగి చూసింది. అయితే ఇప్పుడు తాజాగా ఒక మంత్రి కూడా తనపై వస్తున్న ఆరోపణలకు కులం కార్డు అడ్డుపెడుతున్నారు.

 

నిన్న శాసన మండలిలో మంత్రి అనిల్‌ కుమార్ యాదవ్.. మహిళా సభ్యులు ఉన్నారని కూడా చూడకుండా ‘ప్యాంటు జిప్పు’ తీసి ‘బొచ్చు పీకుతావా’ అంటూ అసభ్యకరంగా టీడీపీ సభ్యుల్ని ఉద్దేశించి మాట్లాడారన్నది టీడీపీ నేతలు దీపక్‌రెడ్డి, అశోక్‌బాబు ఆరోపించిన విషయం తెలిసిందే. అయితే తాను బీసీ వర్గానికి చెందిన నేతను కాబట్టే తనపై బురదజల్లేందుకు చూస్తున్నారని మంత్రి తెలిపారు. ఇక్కడ కూడా బీసీ అనే కులం కార్డు తొంగి చూసింది.

 

ఇదంతా రాజకీయ లబ్ధికోసం అధికారపక్షం, ప్రతిపక్షం ఆడుతున్న నాటకం. ఇవి కేవలం ఆరోపణలు మాత్రమే కాదు వాస్తవాలు కూడా. ఎందుకంటే.. డాక్టర్ సుధాకర్ కేసుతో పాటు అదే సమయంలో నడిచిన రంగనాయకమ్మ కేసు ఇందుకు నిదర్శనం. విశాఖ గ్యాస్ లీక్ ఘటనపై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టిన ఈమెను అరెస్టు చేశారు. కానీ, ఈమె విషయంలో మాత్రం కులం తొంగి  చూడలేదు.

 

అలాగే అచ్చెన్నాయుడి అరెస్టుతో పాటు రాష్ట్రంలో జరిగిన మరో అరెస్టు జేసీ ప్రభాకర్ రెడ్డి, అతని తనయుడు జేసీ అస్మిత్ రెడ్డిలది. అయితే వీరి విషయంలో కూడా కులం కార్డు తొంగిచూడలేదు. దీనికి ప్రధాన కారణం వీరంతా అగ్ర కులాలకి చెందిన వారు కావడం. ఇకనైనా రాజకీయ నాయకులు మారి.. కుల బేధాలు మాని,  ప్రతీదాంట్లోకి కులాన్ని లాగకుండా ఉంటే బాగుంటుందని భావిస్తున్నాను.

మరింత సమాచారం తెలుసుకోండి: