వ్యూహం.. అనేది రాజ‌కీయాల్లో కామ‌నే అయిన‌ప్ప‌టికీ.. అది వ‌ర్క‌వుట్ అయితేనే ఫ‌లితం ఉంటుంది. కానీ, ఏం ఖ‌ర్మ‌మో తెలి య‌దు కానీ.. ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం చంద్ర‌బాబు.. ఏడాది కాలంగా వేస్తున్న ఏ వ్యూహమైనా.. విఫ‌ల‌మ‌వుతూనే ఉంది. రాజ‌ధాని ఆందోళన నుంచి ఇసుక ఉద్య‌మం వ‌ర‌కు చంద్ర‌బాబు వేసిన ప్ర‌తి అడుగూ.. ఫెయిల్ దిశ‌గా సాగుతూనే ఉంది. తాజాగా రాజ్య‌స‌భ ఎన్నిక‌ల్లోనూ బాబు వ్యూహం ఫ‌లించ‌క‌పోగా.. కొత్త వివాదం తెర‌మీదికి వ‌చ్చింది. ప్ర‌స్తుతం రాష్ట్రంలో క‌రోనా మ‌హ‌మ్మారి విస్త‌రించింది. నిత్యం వంద‌ల సంఖ్య‌లో కేసులు వ‌స్తున్నాయి. మ‌ర‌ణాలు కూడా 100కు చేరువ‌లో ఉన్నాయి.

 

గ‌తంలో స్థానిక ఎన్నిక‌లు నిర్వ‌హించాల్సిన అవ‌స‌రం ఉన్న‌ప్పుడు క‌రోనానేప‌థ్యంలో వాటినివాయిదా వేయ‌డాన్ని చంద్ర‌బాబు స‌మ‌ర్ధించారు. నిజానికి స్థానిక ఎన్నిక‌లు వాయిదా వే్స్తున్న‌ట్టు అప్పటి ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్ నిమ్మ‌గ‌డ్డ ర‌మేష్‌కుమార్ ప్ర‌క‌టించే స‌మ‌యానికి క‌రోనా ప్ర‌భావం రాష్ట్రంలోనే కాకుండా దేశంలోనూ ఎక్క‌డా పెద్ద‌గా లేదు. అయినప్ప‌టికీ.. ఆయ‌న వ్యూహాత్మ‌కంగా (దీని వెనుక రాజ‌కీయ కోణం ఉంద‌ని అంటారు) నిమ్మ‌గ‌డ్డ అప్ప‌ట్లో ఎన్నిక‌ల‌ను వాయిదా వేశారు. ఈ విష‌యంపై పెద్ద ఎత్తున ప్ర‌భుత్వం విరుచుకుప‌డిన‌ప్ప‌డు చంద్ర‌బాబు.. నిమ్మ‌గ‌డ్డ ప‌క్షాన నిలిచారు. క‌రోనా నేప‌థ్యంలో ఎన్నిక‌ల‌ను వాయిదా వేయాల‌ని డిమాండ్ చేశారు.

 

అంతేకాదు, నిమ్మ‌గ‌డ్డ తీసుకున్న నిర్ణ‌యాన్ని బాబు స‌మ‌ర్ధించారు. పార్టీ త‌ర‌ఫున కూడా గ‌ట్టి వాయిస్ వినిపించారు. క‌ట్ చేస్తే.. ఎన్నిక‌లు వాయిదాప‌డ్డాయి. ఇక‌, ఇప్పుడు మాత్రం క‌రోనా విజృంభించిన నేప‌థ్యంలోనూ రాజ్య‌స‌భ ఎన్నిక‌లు పెట్టి తీరాల‌ని బాబు ప‌ట్టారు. నిజానికి త‌న‌కు సంఖ్యాబ‌లం లేద‌ని తెలిసి కూడా.. తాను పోటీకి నిల‌బెట్టిన వ‌ర్ల రామ‌య్య ఓడిపోవ‌డం త‌ప్ప‌ద‌ని తెలిసి కూడా చంద్ర‌బాబు ఈ విష‌యంలో ప‌ట్టుద‌ల‌తో వ్య‌వ‌హ‌రించారు. నిజానికి వ‌ర్ల రామ‌య్య ఓట‌మి ముందుగానే అంద‌రికీ తెలుసు. 

 

ఈ విష‌యం తెలిసిన బాబు.. రాజ్య‌స‌భ ఎన్నిక‌ల‌ను ఏక‌గ్రీవం చేసి ఉంటే ప‌రిస్థితి మ‌రోలా ఉండేది. కానీ, ఆయ‌న ప‌ట్టుబ‌ట్టి ఎన్నిక‌ల‌కు వెళ్లారు. వ‌ర్లకు కేవ‌లం17 ఓట్లు మాత్ర‌మే ప‌డి ఓట‌మి పాల‌య్యారు. ఇక్క‌డ కీల‌క విష‌యం ఏంటంటే.. క‌రోనా లేని స‌మ‌యంలో ఎన్నిక‌లు వ‌ద్ద‌న్న చంద్ర‌బాబు.. క‌రోనా విజృంభించిన స‌మ‌యంలో మాత్రం ఎన్నిక‌ల‌కు సై అన‌డం. దీనిని రెండు క‌ళ్ల సిద్ధాంతం అన‌రా? అనే విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: