ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చాలా గందరగోళం నెలకొంది. అసలు ఎవరు ఎవరిని విమర్శిస్తున్నారో.. ఎందుకు విమర్శిస్తున్నారో కూడా అర్ధంకావట్లేదు. అలాగే ఎవరి అలక వెనుక ఏం కారణముందో కూడా అంతుచిక్కట్లేదు. ముఖ్యంగా ఇదంతా అధికార పార్టీకి చెందిన నేతల్లోనే కనబడటం గమనార్హం. నిన్న, మొన్నటి దాక వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. పార్టీ నిర్ణయాలను తప్పు పట్టడం.. పార్టీలోని కీలక నేతలను తీవ్రంగా విమర్శించడం, అలాగే తనకు ప్రాణహాని ఉందని, కేంద్ర బలగాలతో రక్షణ కల్పించాలంటూ లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాయడం. ఇలా రోజుకో రచ్చ చేస్తున్న రఘురామకృష్ణంరాజు చర్యలతో విసిగిపోయిన అధిష్టానం ఆయనకు షోకాజ్ నోటీస్ జారీ చేసింది. దీనిపై వారం రోజుల్లో సమాధానం చెప్పాలి అని గడువు విధించింది.

 

కాగా, ఈ నోటీస్ పై రఘురామకృష్ణంరాజు కూడా అంతే ధీటుగా బదులిచ్చి మ‌రింత వ్య‌తిరేకం అయ్యారు. అయితే ఇప్పుడు తాజాగా రఘురామకృష్ణంరాజు బాట‌లోనే తిరుప‌తి ఎంపీ బ‌ల్లి దుర్గాప్ర‌సాద్ రావు కూడా ప‌య‌నిస్తున్న‌ట్లు రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తుంది. 2019 ఎన్నికల్లో టీడీపీ తరుపున టిక్కెట్ దొరక్కపోవడంతో.. వెంటనే వైసీపీలో చేరి టిక్కెట్ సంపాదించారు ఆయన. అలాగే ఆ ఎన్నికల్లో తిరుప‌తి ఎంపీగా గెలుపొందారు. మొదట్లో బాగానే ఉన్న ఆయన.. ఈ మధ్య స్థానిక వైసీపీ నేతలను పట్టించుకోకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాడంటూ పార్టీ వర్గాల్లో గుస‌గుస‌లు మొద‌ల‌య్యాయి. ఆయనపై సొంత పార్టీ నేతలే అసంతృప్తిగా ఉన్నారు. ఇటీవలే తిరుప‌తి స్మార్ట్ సిటీ కోసం జ‌రిగిన శంకుస్థాప‌న ప‌నుల్లో దుర్గాప్ర‌సాద్ పేరును ఇంటిపేరు లేకుండా వేయ‌డంపై ఆయ‌న తీవ్ర ఆగ్రహం వ్య‌క్తం చేసారు.

 

 ఇదంతా అధిష్టానం కుట్రే అన్నట్టుగా మీడియా స‌మావేశాల్లో మాట్లాడారు. పైగా కేంద్రం ఇచ్చిన నిధుల‌తో చేప‌డుతున్న ప్రాజెక్ట్ లో రాష్ర్ట ప్ర‌భుత్వం పెత్త‌నం ఏంట‌ని ప్రశ్నించారు. అదేవిధంగా కరోనా కట్టడి విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఫెయిల్ అయిందని ఆయన సన్నిహితుల దగ్గర వ్యాఖ్యానించారట. దీంతో సదరు ఎంపీ తీరుపై అధిష్టానం సీరియస్ అయినట్టు సమాచారం. జిల్లాకి సంబధించిన ఇంచార్జ్ మంత్రిని దీనిపై విచార‌ణ జ‌రిపి నివేదిక ఇవ్వాల‌ని అదిష్టానం ఆదేశించిందని వైసీపీ వర్గాలు చెప్తున్నాయి. ఆ ఇంచార్జ్ ఇచ్చే నివేదిక ఆధారంగా ఎంపీపై అదిష్టానం చ‌ర్య‌లకు దిగుతుందని పార్టీ వర్గాల్లో వినికిడి. మరి ఈ ఎంపీకి కూడా రఘురామకృష్ణంరాజు మాదిరిగానే షోకాజ్ నోటీస్ ఇస్తారేమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: