వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు చర్యలతో విసిగిపోయిన అధిష్టానం ఆయనకు షోకాజ్ నోటీస్ జారీ చేసింది. దీనిపై స్పందించిన ఆయన.. అసలు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ పేరుతో నోటీస్‌ ఎలా ఇస్తారు.? మనది యువజన శ్రామిక రైతు కాంగ్రెస్‌ పార్టీ కదా.! అని బాంబ్ పేల్చారు. అయితే అసలు ఈ పేరు వెనుక రాజకీయం ఏంటని ఆలోచిస్తే..

 

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తన తండ్రి మరణానంతరం సొంత పార్టీ పెట్టారు.. తండ్రి పేరు కలిసి వచ్చేలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని దానికి నామకరణం చేశారు. వాస్తవంగా ఎన్నికల కమిషన్ రికార్డుల మేరకు దాని పూర్తి పేరు యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ. కానీ, ఈ విషయం చాలా మందికి తెలియదు. ఇప్పుడు ఈ పేరే ఎంపీ రఘురామకృష్ణంరాజుకు ఆయుధంగా మారింది. వాడుక భాషలో ఎలా ఉన్నా పార్టీ రిజిస్టర్ చేసుకున్న సందర్భంలో ఇచ్చిన పేరుపై ఇప్పుడు రఘురామకృష్ణంరాజు లేవనెత్తిన అభ్యంతరాలు కేవలం పార్టీ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డికి లేఖ రాయడంతో సరిపుచ్చలేదు. ఆయన కేంద్ర ఎన్నికల సంఘానికి కూడా ఫిర్యాదు చేశారు.

 

దాంతో ఇప్పుడు ఎంపీ తిరుగుబాటు అంశం జాతీయ స్థాయిలో పార్టీ పేరుపై చర్చకు దారి తీస్తున్నది. ఇది కచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇబ్బంది కలిగించే అంశంగా మారబోతున్నట్లు స్పష్టంగా కనిపిస్తున్నది. తనకు న్యాయబద్ధంగా షోకాజ్ నోటీసు పంపిన లెటర్ హెడ్ పై ఎన్నికల కమిషన్ కు ఇచ్చిన పేరు కాకుండా తనకు బిఫారం ఇచ్చిన పార్టీ పేరుతో కాకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనే పేరుతో లేఖ పంపడమే న్యాయ సమ్మతంగా లేదని ఆయన అంటున్నారు. తనకు తెలిసినంత వరకూ యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ పేరును వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా మార్చిన దాఖలాలు లేవని ఆయన కొత్త అంశం తెరపైకి తెచ్చారు. ఇది చట్ట విరుద్ధమని ఆయన అన్నారు.

 

వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అని చెప్పినా.. యువజన శ్రామిక రైతు కాంగ్రెస్‌ పార్టీ అని చెప్పినా ఒకటే.. రఘురామకృష్ణరాజు తెలివిగా మాట్లాడుతున్నాననుకుంటున్నారుగానీ, ఆయన తప్పటడుగులు వేస్తున్నారు.. ఆయనపై పార్టీ పరంగా చర్యలు తప్పవు.. అంటూ ఓ ఛానల్‌ చర్చా కార్యక్రమంలో రఘురామకృష్ణంరాజు వుండగానే వైసీపీ నేత మల్లాది విష్ణు వ్యాఖ్యానించడం గమనార్హం. రఘురామకృష్ణంరాజు మాత్రం, ఎవరెవరో ఏదేదో పనికిమాలిన మాటలు చెబుతుంటారు.. వైఎస్‌ జగన్‌ మాత్రం నన్ను పార్టీలోంచి బయటకు పంపరు.. అని తేల్చి చెబుతుండడం కొసమెరుపు. మరి రఘురామకృష్ణంరాజు లేవనెత్తిన ఈ అంశాల నుంచి వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎలా బయటపడుతుందో వేచి చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: