శత్రువు శత్రువు మనకు మిత్రుడు.. ఇదే ఫార్ములా ప్రస్తుత తెలుగు రాష్ట్రాల సీఎంలను ఒకటి చేసింది. ఎందుకంటే.. తెలంగాణలో జరిగిన 2018 ఎన్నికల్లో కేసీఆర్‌ తో ఢీ అంటే ఢీ అన్నట్టుగా వ్యవహరించి భంగపడ్డారు చంద్రబాబు. దీంతో హార్ట్ అయిన కేసీఆర్ 2019 ఎన్నికల్లో వైసీపీ అధినేత వైఎస్ జగన్‌కు బహిరంగంగానే మద్దతు ప్రకటించి... ఏపీ ఎన్నికల్లో ఆయన గెలుపు కోసం తనవంతుగా పరోక్ష సాయం చేశారు. ఇదే కేసీఆర్ చంద్రబాబుకి ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్ అంటూ అందురూ అభిప్రాయపడ్డారు.

 

ఇక అప్పటి నుంచి తెలంగాణ సీఎం కేసీఆర్, ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ ల బంధం మరింత గట్టి పడింది. ఇద్దరు సోదర భావంతో మెదులుతూ.. ఇరు రాష్ట్రాలను అభివృద్ధి పదంలో ముందుకు తీసుకుపోతున్నారు. అయితే ఇలాంటి సమయంలో ఏపీ సీఎం జగన్ కి నిమ్మగడ్డ రమేశ్ కుమార్ రూపంలో మరో సమస్య వచ్చింది. నిమ్మగడ్డ రమేశ్ కుమార్‌తో న్యాయపోరాటం చేస్తున్న జగన్ ప్రభుత్వానికి... పార్క్ హయత్ హోటల్‌లో జరిగిన రహస్య భేటీ వ్యవహారం బిగ్ రిలీఫ్ ఇచ్చింది. అయితే సీఎం కేసీఆరే వైసీపీ ప్రభుత్వానికి ఈ వ్యవహారంలో సాయం చేశారని రాజకీయ వర్గాల్లో టాక్ వినిపిస్తుంది.

 

అలాగే ఈ రహస్య భేటీలో నిమ్మగడ్డ రమేశ్ కుమార్‌తో కనిపించే బీజేపీ ఎంపీ సుజనా చౌదరి, మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్‌ లు కాకుండా.. కనిపించని మరో సీక్రెట్ బాస్ ఉన్నరన్నది వైసీపీ వాదన. దానికి సంబంధించిన వీడియో సాక్ష్యాలను త్వరలోనే కోర్టుకు సమర్పించాలనే యోచనలో ఉన్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ రహస్య భేటీ వ్యవహారం బయటికి పొక్కడంతో నిమ్మగడ్డ రమేశ్ కుమార్‌పై తాము చేస్తున్న ఆరోపణలకు మరింత బలం చేకూర్చినట్టయ్యిందని వైసీపీ వర్గాలు భావిస్తున్నాయి. అయితే ఇక్కడ టీడీపీ వర్గాల ప్రధాన ఆరోపణ ఏంటంటే.. తెలంగాణ ప్రభుత్వం సహకారం లేకుండా ఈ రకమైన వీడియోలు బయటకు వచ్చే అవకాశం లేదని.. ఈ విషయంలో కేసీఆర్ పరోక్షంగా జగన్‌కు సహకారం అందించారనే వాదనలను టీడీపీ లేవనెత్తుతుంది. ఏది ఏమైనా ఈ వ్యవహారంపై పూర్తి క్లారిటీ రావాలంటే మరి కొన్ని రోజులు ఆగాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: