ఒక్కోసారి విమర్శలు కూడా మంచే చేస్తాయి. విమర్శించిన వారందరినీ శత్రువులు అనుకోకుండా.. వారు చేసిన విమర్శల్లో వాస్తవం గ్రహించి తప్పులు సరిదిద్దుకుంటే ఇక తిరుగే ఉండదు. ఇప్పుడు నరసాపురం వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు వ్యవహారాన్ని చూసుకుంటే ఆయన వైసిపిపైన, అధినేత జగన్ పైనా ఎన్నో విమర్శలు చేశారు. జగన్ ఎవరికీ అపాయింట్మెంట్లు ఇవ్వడం లేదని, పార్టీ ని పట్టించుకోవడం లేదని, ప్రభుత్వంలో ఎన్నో లోపాలు నెలకొన్నాయని, ముఖ్యంగా ఇసుక కొరతతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఆ విషయాల్లో పెద్ద ఎత్తున అవినీతి జరుగుతోందని, తిరుమల తిరుపతి దేవస్థానం భూములు అమ్మకం విషయంలో కాని, ఇలా ఎన్నో విషయాలపై రఘురామ కృష్ణంరాజు జగన్ విమర్శించారు.

 

IHG


 ఆయన వైసీపీని వీడి బిజెపిలోకి వెళ్లేందుకే ఈ వ్యాఖ్యలు చేస్తున్నారని ఆయనపై వైసీపీ శ్రేణులు పెద్ద ఎత్తున విమర్శలు చేశాయి. అక్కడితో ఆగకుండా, ఆయనకు షోకాజ్ నోటీసు ఇచ్చి విమర్శలు చేయడానికి గల కారణాలను చెప్పాలంటూ నోటీసు ఇచ్చారు. ఈ సంగతి పక్కన పెడితే, రఘురామకృష్ణంరాజు విమర్శల్లో చాలా వాస్తవాలు ఉన్నాయనేది వైసీపీలోని  నాయకులందరి అభిప్రాయం. ఈ విషయం జగన్ కూడా గుర్తించడంతో, తన వ్యవహారశైలి మార్చుకోకపోతే ముందు ముందు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని, రాజకీయంగా ఇది తనకు తీరని నష్టాన్ని చేకూరుస్తుంది అనే అభిప్రాయానికి వచ్చిన జగన్, ఎమ్మెల్యేలకు, ఎంపీలకు ఇప్పుడు అపాయింట్మెంట్ లు ఇస్తూ, వారి సమస్యలను వింటూ, పరిష్కార మార్గాలను సూచిస్తూ వస్తున్నారు.

IHG


 ఈ పరిణామాలు ఇప్పుడు వైసీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలలో ఆనందం కలిగిస్తున్నాయి. జగన్ అపాయింట్మెంట్ కోసం ఇప్పటి వరకు ఎంతగానో ఎదురు చూపులు చూశామని, ఇప్పుడు అడిగిన వెంటనే అపాయింట్మెంట్ లభిస్తోందని చెబుతున్నారు. అలాగే ఇసుక వ్యవహారంపై రఘురామకృష్ణరాజు విమర్శలు చేయడంతో, ఇసుక వ్యవహారంపైన జగన్ దృష్టి పెట్టి ట్రాక్టర్ల ద్వారా ఉచితంగా ఇసుక తీసుకెళ్లేలా జీవోను జారీ చేశారు. అలాగే తిరుమల తిరుపతి దేవస్థానం భూముల అమ్మకానికి సంబంధించి ఆస్తులను రద్దు చేస్తూ, నిర్ణయం తీసుకున్నారు. ఇవే కాకుండా రఘురామకృష్ణరాజు చేసిన ఆరోపణలపై జగన్ దృష్టి పెట్టి అన్నింటిపైన ఎవరికి అసంతృప్తి లేకుండా చేస్తున్నారు. 


అంతకు ముందు ముఖ్యమంత్రి ని కలుసుకోవాలంటే, జిల్లా పర్యటనలకు, అసెంబ్లీ సమావేశాల సందర్భంగానే కొంతమందికి మాత్రమే అవకాశం దొరికేది. జగన్ కోటరీకి చెందిన కొంతమంది కీలక నాయకుల అనుగ్రహం ఉన్నవారికి మాత్రమే జగన్ దర్శనం లభించేది. కానీ ఇప్పుడు పరిస్థితి మొత్తం మారిపోయింది. ఇప్పుడు పార్టీలో నాయకులు మధ్య అసంతృప్తి తగ్గినట్లుగా కనిపిస్తోంది.  కొద్ది రోజుల క్రితమే ఎంపీ రఘురామ కృష్ణంరాజు జగన్ అపాయింట్మెంట్ తనకు లభించడం లేదని, జగన్ కలవాలంటే ముందుగా ఆయన పార్టీ నాయకుల అనుగ్రహం కావాల్సిందేనని, వారు ఇద్దరు ముగ్గురు తప్ప ఎవరికి అపాయింట్మెంట్ ఇవ్వడం లేదని ఎన్నో ఆరోపణలు చేశారు. 

 


ఈ నేపథ్యంలోనే జగన్ తన షెడ్యూల్ మార్చుకున్నట్లు తెలుస్తోంది. ప్రతిరోజు సాయంత్రం ఐదు నుంచి పది మంది వరకు ఎమ్మెల్యేలకు అపాయింట్మెంట్ ఇస్తూ, నియోజకవర్గ సమస్యలు వింటూ వారి ఇబ్బందులను అడిగి తెలుసుకుంటూ వస్తున్నారు. అలాగే నిధుల కేటాయింపు వంటి విషయాలను, వారు చెబుతున్న అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుని అందరినీ సంతృప్తి పరుస్తుండడంతో వైసీపీ నాయకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి రఘురామకృష్ణం రాజు తిట్టినా మంచే చేసాడు అనేది ఇప్పుడు వైసీపీ వర్గాల్లో ఉన్న టాక్.

మరింత సమాచారం తెలుసుకోండి: