ఒకపక్క దేశ ప్రజలంతా కరోనా మహమ్మారి ధాటికి అల్లాడిపోతున్నారు. మరోపక్క అన్నీ రాష్ట్రాల్లో కరోనా కట్టడిపై అధికార, ప్రతిపక్షాల నేతలు తీవ్ర విమర్శలు చేసుకుంటున్నారు. కానీ, ఆంధ్రప్రదేశ్ లో మాత్రం దీనికి భిన్నంగా ఉంది. భిన్నం అంటే మన వాళ్ళు విమర్శలు చేసుకోవట్లేదు అనుకునేరు.. అలా అనుకోవడం చాలా పెద్ద తప్పు సుమీ. ఎందుకంటే మన వాళ్ళు కూడా విమర్శలు చేసుకుంటున్నారు.. ఇంకా చెప్పాలంటే అంతకు మించి. కానీ, అవన్నీ కరోనా కట్టడి విషయంలో కాదు.. పబ్జీ విషయంలో. అవును మీరు విన్నది నిజమే అది ముమ్మాటికి పబ్జీనే. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో నడుస్తున్నది కూడా పబ్జీ రాజకీయాలే. ఇవి నేను చెప్తున్న మాటలు కాదు.. మన నాయకులు చెప్తున్న మాటలే...

 

గత కొద్ది కాలంగా టీడీపీ, వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధంలో భాగంగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్ రెడ్డిని  పబ్జీ ఆటగాడిగా టీడీపీ అభివర్ణిస్తుంది. సీఎం జగన్‌ కి అసలు పరిపాలనే చేతకాదు.. ఇంట్లో కూర్చుని పబ్జీ ఆడుకుంటున్నారు.. అంటూ టీడీపీ నేతలు తరచూ విమర్శిస్తున్నారు. దీనికి కౌంటర్ గా వైసీపీ నేతలు సైతం అలాంటి ఆరోపణలే చేయడం మొదలుపెట్టారు. తాజాగా వైసీపీ ఎమ్మెల్యే రోజా.. మాజీ మంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ను ఉద్దేశించి.. కరోనా లాంటి విపత్కర సమయంలో ప్రజలకి అండగా నిలవాల్సింది పోయి, బయపడి ఇంట్లో కూర్చుని పబ్జీ ఆడుకుంటున్నారు అని ఆరోపించారు.

 

రాష్ట్రంలో జరుగుతున్న ఈ పబ్జీ రాజకీయాలు చూస్తుంటే.. ఔరా.. ఇదేమి రాజకీయం.. నీచపు రాజకీయం అని అనిపిస్తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే అటు టీడీపీకి గానీ, ఇటు వైసీపీకి గానీ రాష్ట్ర ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పట్ల పెద్దగా ఆలోచన ఉన్నట్లు కనిపించడంలేదు. ఒకవేళ వీరిరువురి ఆరోపణలూ నిజమైతే.. రాష్ట్ర ప్రజలు ఇద్దరు పబ్జీ ఆటగాళ్ళ కారణంగా ఇబ్బందులు పడుతున్నట్టే. అసలు ఈ తరహా విమర్శల్ని టీడీపీ అధిష్టానం కావొచ్చు, వైసీపీ అధిష్టానం కావొచ్చు.. ఎందుకు ప్రోత్సహిస్తున్నట్లు.? అనే ప్రశ్న ప్రజల మనసుల్లో అలానే ఉండిపోయింది. అలాగే పబ్జీ ఆటలో జగన్, లోకేష్ ఇద్దరిలో ఎవరు బెస్ట్ అని కొందరు వ్యంగ్యంగా ప్రశ్నిస్తున్నారు. మరికొందరు మాత్రం.. అధినేతల మాదిరిగానే మిగిలిన నేతలు కూడా పబ్జీ మొదలుపెడితే రాష్ట్ర భవిష్యత్తు ఏంటి అని ప్రశ్నిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: