కాంగ్రెస్ సీనియర్ నేత, కీలక నేత అహ్మద్ పటేల్ ను ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఇడి) విచారించటం సంచలనంగా మారింది. పటేల్ ను ఇడి దాదాపు నాలుగు నెలల క్రితమే విచారించాల్సింది. అయితే అప్పట్లో తనకు ఆరోగ్యం సరిగాలేదంటూ పటేల్ ఆసుపత్రిలో జాయిన్ అయ్యారు. మూడుసార్లు ఇడి నోటీసులిచ్చినా పటేల్ విచారణకు హాజరుకాకుండా తప్పించుకున్న విషయం అందరికీ తెలిసిందే. ఒకసారి పార్లమెంటు సమావేశాలని, మరోసారి అనారోగ్యమని ఏవేవో కారణాలు చూపించాడు. అయితే ఇవన్నీ కాదని ఏకంగా ఇడి ఉన్నతాధికారులే పటేల్ ఇంటికి వచ్చేసింది. దాదాపు 8 గంటలపాటు పటేల్ ను మనీ ల్యాండరింగ్ వ్యవహారాలపై ఇడి విచారించింది.

 

ఇక్కడ మనం చూడాల్సిన విషయం ఏమిటంటే ఎక్కడో గుజరాత్ రాష్ట్రానికి చెందిన అహ్మద్ పటేల్ ను ఇడి విచారిస్తే ఏపిలో ఎవరు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కానీ అదే అహ్మద్ పటేల్ తో ఏపిలో కూడా ఓ ముఖ్యనేతకు సంబంధాలున్నాయని స్వయంగా ఇడి, ఐటి ఉన్నతాధికారులే నాలుగు నెలల క్రితం నిర్ధారించారు. చంద్రబాబునాయుడు సిఎంగా ఉన్నపుడు ఆయన దగ్గర పిఎస్ గా పనిచేసిన పెండ్యాల శ్రీనివాస్ పై ఇడి, ఇన్ కమ్ ట్యాక్స్ ఉన్నతాధికారులు దాడులు జరపటం రాష్ట్రంలో సంచలనం సృష్టించింది. పైగా దాడులు కూడా ఏదో గంటో లేకపోతే ఓ పూటో కాదు. నాలుగు రోజుల పాటు వరుసగా పెండ్యాల ఇంటిలో సోదాలు జరిపింది. కీలకమైన డైరీలను, డాక్యుమెంట్లను, అనేక పత్రాలను, కంప్యూటర్లు, హార్డ్ డిస్కులను కూడా స్వాధీనం చేసుకోవటం కలకలం రేపింది.

 

ఎంతపెద్ద నేతల ఇళ్ళల్లో కూడా గతంలో ఎప్పుడూ ఇడి, ఐటి అధికారులు నాలుగు రోజులపాటు సోదాలు, విచారణ జరపలేదు. అధికారంలో ఉన్నపుడు చంద్రబాబుతో సమాంతరంగా పెండ్యాల కూడా విపరీతమైన అధికారాలు చెలాయించినట్లు పార్టీలోనే విపరీతమైన ఆరోపణలుండేవి. అలాంటి శ్రీనివాసే ఇతర రాష్ట్రాల్లో కూడా చంద్రబాబు దూతగా టూర్ చేశాడని, కొందరు ప్రముఖులను రెగ్యులర్ గా కలుసుకునే వాడని విచారణలో తేలినట్లు సమాచారం. అందుకనే పెండ్యాల ఇంటిలో సోదాలు, విచారణ తర్వాత ఇడి ఓ ప్రెస్ నోట్ జారీ చేసింది. అందులో పెండ్యాల ఇంట్లో జరిపిన సోదాల్లో సుమారు రూ. 2 వేల కోట్ల విలువైన లావాదేవీలకు ప్రాధమిక ఆధారాలు దొరికినట్లు స్పష్టంగా చెప్పారు.

 

చంద్రబాబు పిఏ ఇంట్లోనే రూ. 2 వేల కోట్ల లావాదేవీలకు ప్రాధమిక ఆధారాలు దొరికాయంటే అర్ధమేంటి ? అంటే అప్పట్లోనే ఉత్తరాధి రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఎన్నికల ఫండ్ చంద్రబాబు సమకూర్చినట్లు ప్రచారంలో ఉన్న విషయం అందరికీ తెలిసిందే. పైగా చత్తీస్ ఘడ్, రాజస్ధాన్ రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ విజయంలో తన కృషి కూడా ఉందని చంద్రబాబు బహిరంగంగా ప్రకటించుకున్నాడు. పై రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో ఒక్కరోజు కూడా చంద్రబాబు ప్రచారం చేయలేదు. నిజానికి పై రాష్ట్రాల ఎన్నికలకు చంద్రబాబుకు ఎటువంటి సంబంధం లేదు. మరి కాంగ్రెస్ విజయంలో చంద్రబాబు పాత్ర ఏమిటి ?

 

ఏమిటంటే నిధులు సమకూర్చటమే అని అప్పట్లోనే విపరీతమైన ప్రచారం జరిగింది. దానికి తగ్గట్లే పెండ్యాల ఇంట్లో సోదాల తర్వాత ఇడి ప్రెస్ నోట్ అనుమానాలను బలపరిచింది. కాంగ్రెస్ పార్టీ-చంద్రబాబు మధ్య ఆర్ధిక వ్యవహారాలను చక్కపెట్టింది అహ్మడ్ పటేల్ అనే ప్రచారం కూడా ఉంది.  కాబట్టి ఇపుడు అహ్మడ్ పటేల్ ను ఇడి విచారించిందంటే నెక్ట్స్ విచారణ ఏపినే అనే ప్రచారం ఊపందుకుంది. మరి ఏం జరుగుతుందో చూడాల్సిందే.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: