బీజేపీ అడుగులు మళ్ళీ టీడీపీ వైపు పడుతున్నాయా..? ప్రధాని నరేంద్ర మోదీ, టీడీపీ అధినేత చంద్రబాబు మళ్ళీ ఒక్కటవబోతున్నారా..? ఇద్దరు కలిసి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి చెక్ పెట్టబోతున్నారా..? ఏపీ రాజకీయాల్లో సంచలనాత్మక పరిణామాలు చోటుచేసుకోబోతున్నాయా..? అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది..

 

2019 లో సీఎం జగన్ అధికారం చేపట్టగానే.. పోల‌వ‌రంలో అవినీతి జ‌రిగింద‌ని రివ‌ర్స్ టెండ‌రింగ్ ద్వారా ఆ ప్రాజెక్ట్‌ ను వేరేవారికి క‌ట్ట‌బెట్టారు. అయితే తాజాగా కేంద్ర జ‌ల‌శ‌క్తిమంత్రిత్వ శాఖ పోల‌వ‌రంలో ఎటువంటి ఉల్లంఘనలు జ‌ర‌గ‌లేద‌ని, ఎటువంటి అవినీతి జ‌ర‌గ‌లేద‌ని ప్ర‌క‌టించ‌డం ఇప్పుడు చ‌ర్చ‌నీయాంశమైంది. ఎందుకంటే.. 2014 ఎన్నిక‌ల్లో పొత్తులో భాగంగా మీకు స్కాం ఆంధ్ర కావాలా లేకా స్కీం ఆంధ్ర కావాలా అని అప్పట్లో జ‌గ‌న్‌పై మోదీ విరుచుకుప‌డ్డారు. మ‌ళ్లీ 2019 ఎన్నిక‌ల‌కు ముందు టీడీపీ అధినేత చంద్ర‌బాబుపై కూడా చాలా వివాద‌స్పద వ్యాఖ్య‌లు చేశారు మోదీ. ముఖ్యంగా పోలవరం అంశంలో తీవ్ర విమర్శలు గుప్పించారు. చంద్ర‌బాబు పోల‌వ‌రం ప్రాజెక్ట్‌ ను ఒక ఏటీఎంలా వాడుకున్నార‌ని అప్ప‌టి ఎన్నిక‌ల స‌మ‌యంలో వ్యాఖ్య‌లు చేసింది మోదీ ప్రభుత్వం.

 

అయితే తాజాగా అదే మోదీ ప్ర‌భుత్వం చంద్ర‌బాబుకు పోల‌వ‌రం అంశంలో క్లీన్ చిట్ ఇచ్చింది. దీంతో ఈ ప‌రిణామం రాష్ట్రంలో ఒక కొత్త రాజ‌కీయ చ‌ర్చ‌కు దారితీసింది. బీజేపీ చంద్రబాబుకు దగ్గ‌ర‌వ‌డంలో భాగంగానే ఇలాంటి ప్ర‌క‌ట‌న చేసింద‌ని అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. అలాగే ర‌ఘురామ‌కృష్ణ రాజు విషయంలో కూడా బిజేపీదే కీల‌క పాత్ర అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దానికి కారణం.. ఆయన మొన్న ఢిల్లీ వెళ్ళి కేంద్ర పెద్దలని కలవడం. ర‌ఘురామ‌కృష్ణ రాజు, ఢిల్లీ పెద్దలని కాలవడంతో వైసీపీలో గుబులు మొదలైంది.. అసలు ఆయన ఏం చేయబోతున్నారు అనే దానిపై ఆ పార్టీలో ఎక్కువగా చర్చించుకుంటున్నారు.

 

అలాగే ఈ మధ్య నిర్మ‌ల‌సీతారామ‌న్, రామ్ మాద‌వ్ పార్టీ వర్చువల్ ర్యాలీ సమయంలో వైసీపీకి వ్య‌తిరేకంగా చేసిన వ్యాఖ‌లు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారాయి. వీటిని బాగా పరిశీలించిన రాజకీయ విశ్లేషకులు.. టీడీపీకి దగ్గరయ్యేందుకే బీజేపీ ఇలా చేస్తుందని అభిప్రాయపడుతున్నారు. మరి రానున్న రోజుల్లో ఈ కొత్త స్నేహం దేనికి దారితీయబోతుందో చూద్దాం.

మరింత సమాచారం తెలుసుకోండి: