నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణం రాజుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గట్టి షాక్ ఇవ్వబోతున్నారా..? ఇందుకోసం ఢిల్లీ స్థాయిలో పావులు కదుపుతున్నారా..? జగన్ దెబ్బకి రఘురామకృష్ణంరాజు రాజకీయ భవిష్యత్తు ప్రమాదంలో పడనుందా..? జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అవుననే అనిపిస్తుంది.

 

నర్సాపురం వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు గత కొన్ని రోజులుగా పార్టీకి.. పార్టీ నిర్ణయాలకు.. పార్టీ అధినాయకత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు.. అలాగే తనకు ప్రాణహాని ఉందంటూ జగన్ ప్రభుత్వం మీద తీవ్రమైన ఆరోపణ చేశారు. ఈ వ్యవహారం రోజురోజుకూ ముదురుతున్న నేపథ్యంలో వైసీపీ అధిష్టానం రఘురామకృష్ణంరాజుకు షోకాజ్ నోటీస్ జారీ చేసింది. కాగా, ఈ నోటీస్ పై రఘురామకృష్ణంరాజు కూడా అంతే ధీటుగా బదులిచ్చి మ‌రింత వ్య‌తిరేకం అయ్యారు. తనకొచ్చిన షోకాజ్ నోటీస్ పై ఉన్న పార్టీ పేరు న్యాయబద్దకం కాదని కేంద్ర ఎన్నికల సంఘాన్ని, అలాగే కొందరు బీజేపీ కేంద్ర పెద్దలని కలిసి వైసీపీకి మరింత షాక్ ఇచ్చారు రఘురామకృష్ణంరాజు. అలాగే తాను పార్టీకి విధేయుడినంటూ వైసీపీ అధినేత, సీఎం జగన్‌కు లేఖ రాశారు. ఇదంతా అందరికీ తెలిసిందే..

 

అయితే ఇక్కడే సీఎం జగన్ మోహన్ రెడ్డి ఒక సరికొత్త వ్యూహం రచిస్తున్నట్టు సమాచారం. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న రఘురామకృష్ణంరాజును పార్టీ నుంచి సస్పెండ్ చేసిన వెంటనే... ఆయన లోక్ సభ సభ్యత్వం కూడా రద్దయ్యేలా చేయాలని సీఎం జగన్ భావిస్తున్నారట. ఇందుకోసం ఉన్న అవకాశాలను పరిశీలిస్తోంది. ఎంపీ బాలశౌరి కేంద్ర పెద్దలతో వరుసగా సమావేశం కావడం వెనుక అసలు కారణంగా కూడా ఇదేననే ప్రచారం జరుగుతోంది.

 

గతంలో పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా వ్యవహరించిన జేడీయూ ఎంపీ శరద్ యాదవ్‌ పై రాజ్యసభలో వేటు పడిన విషయాన్ని వైసీపీ తెరపైకి తీసుకొస్తున్నట్టు సమాచారం. అదే రకంగా రఘురామకృష్ణంరాజు సభ్యత్వాన్ని కూడా రద్దు చేయించాలనే ప్రయత్నాల్లో వైసీపీ ఉన్నట్టు తెలుస్తోంది. ఒకవేళ రఘురామకృష్ణంరాజుపై సస్పెన్షన్ వేటు వేసి వదిలేస్తే... భవిష్యత్తులో ఆయన బాటలోనే మరికొందరు పయనించే అవకాశం లేకపోలేదనే భావనలో వైసీపీ ఉన్నట్టు సమాచారం. మరి కేంద్ర పెద్దలకు విధేయంగా ఉంటున్న రఘురామకృష్ణంరాజు విషయంలో వారు ఇలాంటి నిర్ణయాన్ని తీసుకుంటారా అనేది ఆలోచించదగ్గ విషయమే.

మరింత సమాచారం తెలుసుకోండి: