ఏపీ నుంచి రాజ్యసభకు ఇద్దరు మంత్రులు పిల్లి సుభాష్ చంద్రబోస్ - మోపిదేవి వెంకటరమణ తరలిపోవడంతో ఆ రెండు సీట్లు ఖాళీ అయ్యాయి. దీంతో జగన్ కేబినెట్ లో మార్పులు చేర్పులు చేయడం ఖాయంగా కనిపిస్తోంది. అయితే ఈ పదవులు ఎవరికి దక్కనున్నాయి అనేది మాత్రం ఉత్కంఠంగా మారింది. సీనియర్లు, జూనియర్లు అందరూ ఆ పదవుల కోసం తెగ ప్రయత్నిస్తున్నారు. ఎవరి వ్యూహాలు వారు అమలు చేస్తూ.. అధినేత జగన్ ని కలుస్తూ.. తమ మీద దయ చూపమని కోరుకుంటున్నారు ఎమ్మెల్యేలు.

 

ఇలాంటివేళ.. తెర మీదకు అనూహ్యంగా ఉమ్మారెడ్డి పేరు వచ్చింది. గుంటూరు జిల్లాకు చెందిన మోపిదేవి వెంకటరమణ స్థానంలో అదే జిల్లాకు చెందిన సీనియర్ నేత, వైసీపీ ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లును సీఎం జగన్ కేబినెట్‌ లోకి తీసుకునే అవకాశం ఉందని పార్టీలో చర్చ జరుగుతోంది. పార్టీలో సీనియర్ అయిన ఉమ్మారెడ్డిని కేబినెట్‌ లోకి తీసుకోవడం వల్ల ఎవరూ పెద్దగా ఇబ్బందిపడబోరని భావిస్తున్న సీఎం జగన్... సీనియర్ అయిన ఉమ్మారెడ్డి సేవలు మంత్రివర్గంలో అవసరమవుతాయని యోచిస్తున్నట్టు తెలుస్తోంది.

 

అయితే బీసీ నాయకుడి కారణంగా ఖాళీ అవుతున్న కేబినెట్ స్థానాన్ని కాపు వర్గానికి చెందిన ఉమ్మారెడ్డికి జగన్ కేటాయిస్తారా అనే చర్చ కూడా మొదలైంది. మరోవైపు కాపు సామాజిక వర్గానికి చెందిన ఉమ్మారెడ్డికి మంత్రి పదవి ఇవ్వటం ద్వారా.. ఆ సామాజిక వర్గానికి జగన్ ప్రభుత్వం పెద్ద పీట వేసినట్లు అవుతుందని కొందరు చెబుతున్నారు.  అయితే ఇప్పటికే కేబినెట్‌ లో సీఎం జగన్ అనేకమంది కాపు నేతలకు ప్రాధాన్యత కల్పించారు.

 

ఈ నేపథ్యంలో అదే వర్గానికి చెందిన నాయకుడిని మంత్రివర్గంలోకి తీసుకోవడం ద్వారా కాపులకు అధిక ప్రాధాన్యత ఇచ్చినట్టు అవుతుందని ఇతర వర్గాలు భావించే అవకాశం లేకపోలేదని పలువురు చర్చించుకుంటున్నారు. మొత్తానికి ఖాళీ కాబోతున్న రెండు మంత్రివర్గ స్థానాల్లో ఒకటి ఉమ్మారెడ్డికి దక్కే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయనే టాక్ మాత్రం వైసీపీలో బలంగా వినిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: