ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ప్రస్తుతం కొన్ని సంఖ్యల చుట్టూ తిరుగుతున్నాయి. తెలుగుదేశం పార్టీకి ఆగస్టు సంక్షోభం మాదిరిగానే 23 కూడా కలిసి రాలేదనే అభిప్రాయాలు ఇటీవల కాలంలో ఎక్కువైన సంగతి తెలిసిందే. అలానే ఇప్పుడు వైసీపీకి కూడా ఒక సంఖ్య అసలు కలిసి రావడంలేదని సమాచారం. మరి వైసీపీకి కలిసి రాని ఆ సంఖ్య ఏంటి..? ఆ సంఖ్య కారణంగా కలిసిరాని అంశాలు ఏంటి..? ఇప్పుడు చూద్దాం..

 

గతంలో వైసీపీ నుంచి 23 మంది ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎంపీలను తీసుకున్న టీడీపీకి దేవుడు అదే సంఖ్యలో ఎమ్మెల్యేలు, ఎంపీలను మిగిల్చాడంటూ వైసీపీ నేతలు సెటైర్లు వేశారు. ముఖ్యంగా టీడీపీకి 23వ తేదీన చేదు అనుభవాలు ఎదురైన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అయితే అచ్చం అలానే 3 అనే సంఖ్య వైసీపీకి కలిసి రావడంలేదంటూ టీడీపీ సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి సెటైర్లు వేస్తున్నారు. ‘‘మూడు మాస్కులు అన్నారు క్వాలిటీ లేకపోయే.. మూడు రాజధానులు అన్నారు క్లారిటీ లేకపోయే.. మూడు రంగులు అన్నారు ఒక రంగుకి మిగిలిపోయే.. మొత్తానికి ఈ మూడు అన్నది వైసీపీ ప్రభుత్వానికి మాడు పగిలేందుకే అనుకుంటా’’ అని సోషల్ మీడియా వేదికగా చెప్పుకొచ్చారు. బుచ్చయ్య చౌదరి మాటలను బాగా పరిశీలిస్తే.. ఇందులో నిజం లేకపోలేదు.. ఎందుకంటే..

 

కరోనా నేపధ్యంలో రాష్ట్రంలోని ప్రతి ఇంటికీ మూడు మాస్కులు ఇస్తానని ఏపీ సీఎం జగన్ ప్రకటించరు. అయితే, వీటి పంపిణీ సక్రమంగా జరగలేదు. చాలామందికి ఇవి అందలేదని, ఇచ్చిన మాస్కులు కూడా నాణ్యతపరంగా బాగోలేదని విపక్షాలు ఆరోపణలు చేశాయి. అలాగే మూడు రాజధానుల అంశం ఎంత రచ్చ అయిందో చెప్పక్కర్లేదు. రాజధాని తరలింపునకు పెట్టిన ఏ ముహూర్తం కూడా కలిసి రాలేదు. దీంతో ప్రస్తుతానికి ఈ ప్రతిపాదన సస్పెన్స్ లో పడింది. కాగా, పంచాయతీ కార్యాలయాలకు వైసీపీకి సంబంధించిన మూడు రంగులు వేయాలన్న నిర్ణయంపై కోర్టులో చుక్కెదురైంది.

 

దీంతో నిజంగానే మూడు అనేది వైసీపీకి కలసి రాదా అనే సందేహాలు వైసీపీ శ్రేణుల్లో కూడా మొదలయ్యాయి. అలాగే బుచ్చయ్య చౌదరి చెప్పిన మాటలతో వైసీపీ నేతల్లో కొంత కలవరం మొదలైనట్టు సమాచారం. ఎందుకంటే.. ఆ పార్టీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజుపై వైసీపీ ఎంపీలు కొంతమంది స్పీకర్ కు ఫిర్యాదు చేయడానికి ఇవాళ ప్రత్యేక విమానంలో ఢిల్లీ వెళ్తున్నారు. పైగా ఇవాళ తేదీ కూడా 3.. దీంతో ఢిల్లీలో ఏం జరుగుతుందోననే భయం వారిలో మొదలైంది. అటు అధిష్టాన వర్గంలో కూడా దీనిపై సీరియస్ గానే చర్చ జరుగుతున్నట్టు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: