అధికార పార్టీలో జరుగుతున్న వ్యవహారాలు చూస్తుంటే అందరికీ ఇదే అనుమానాలు పెరిగిపోతున్నాయి.  కాకపోతే కాస్త సవరణలు జరిగినట్లుగా అనిపిస్తోందంతే. పార్టీ నుండి బయటకు వెళ్ళిపోవాలని నరసాపురం వైసిపి ఎంపి కనుమూరి రఘురామకృష్ణంరాజు ప్రయత్నాలు మొదలుపెట్టినట్లున్నారు. పార్టీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి పార్టీలైన్ ను కాదని ఎంపి సొంతంగానే వ్యవహారాలు నడుపుతున్నాడు. ప్రభుత్వంపై నోటికి ఎంతొస్తే అంతా మాట్లాడేస్తున్నాడు. ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి అంటే పెట్రోలు మంటలాగ ఎగసిపడే ఎల్లోమీడియాతో ప్రభత్వానికి వ్యతిరేకంగా జగన్ ఇబ్బంది పడేలాగ అనేకసార్లు కామెంట్లు చేసిన విషయం అందరికీ తెలిసిందే. ఇదంతా ఎంపి ఎందుకు చేస్తున్నాడంటే పార్టీతో తనను సస్పెండ్ చేయించుకునేందుకే అనే ప్రచారం పార్టీలో విపరీతంగా పెరిగిపోయింది.

 

సరే రాజుగారి ముచ్చటను ఎందుకు కాదనాలని నాయకత్వం కూడా అనుకున్నట్లుంది. ఎంపి ముచ్చటను వెంటనే తీర్చేస్తే సరిపోతుంది కదా అని షోకాజ్ నోటీసు జారీ చేసింది. అయితే నోటీసుకు సమాధానం చెప్పకుండా నోటీసు జారీ చేయటంలో లా పాయింట్లు లాగాడు ఎంపి. అసలు తనకు నోటిసు సర్వ్ చేసే అర్హతే పార్టీకి లేదన్నాడు. వైఎస్ఆర్సిపి పార్టీ వేరు యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ వేరంటూ లా పాయింట్ లాగాడు. తాను గెలిచింది యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ నుండే కానీ వైఎస్సార్సీపి తరపున కాదంటూ వాదించాడు. పైగా ఇదే విషయాన్ని ఎన్నికల కమీషన్ కు ఫిర్యాదు చేశాడు. ఇదే విషయమై  లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాతో పాటు అనేకమంది కేంద్రమంత్రులను కూడా కలిశాడట.

 

సీన్ కట్ చేస్తే ఎంపిపై అనర్హత వేటు వేయాలనే డిమాండ్ తో  శుక్రవారం పార్టీ తరపున మిధున్ రెడ్డి నేతృత్వంలో కొందరు ఎంపిలు, లాయర్లు లోక్ సభ స్పీకర్ ను కలవబోతున్నట్లు పార్టీ అధికారికంగా ప్రకటించింది. సరే వీళ్ళ ఫిర్యాదుతో స్పీకర్ ఏమి చేయబోతున్నాడన్నది వేరే సంగతి. ఇదే విషయమై ఎంపి మాట్లాడుతూ తానేమీ తప్పు చేయలేదని బుకాయిస్తున్నాడు. పార్టీకి వ్యతిరేకంగా ఏరోజు మాట్లాడలేదంటున్నాడు. పార్టీ తనకు షోకాజ్ నోటీసు ఇచ్చినపుడు  ఇచ్చిన సమాధానంలోనే తన ధిక్కారాన్ని ఎంపి స్పష్టంగా తెలియజేశాడు. లేకపోతే షోకాజ్ నోటీసును పట్టుకుని ఎన్నికల కమీషనర్ ను కలవాల్సిన అవసరం లేదు. వివాదాన్ని సర్దుబాటు చేసుకునే ఉద్దేశ్యమే ఉంటే నోటీసిచ్చిన ఎంపి విజయసాయిరెడ్డినే కలిసుండే వాడు.

 

సరే ప్రస్తుత విషయానికి వస్తే పార్టీలో నుండి సస్పెండ్ చేయించుకుని బిజెపితో కలిసిపోవాలన్నది ఎంపి వ్యూహంగా ప్రచారంలో ఉంది. కానీ పార్టీయేమో ఎంపిని సస్పెండ్ చేయకుండా ఏకంగా అనర్హత వేటు వేయించాలని ప్లాన్ చేసింది. మరి ఇద్దరిలో ఎవరి ప్రయత్నాలు సక్సెస్ అవుతుందో చూడాల్సిందే.  ఎంపి మాటే చెల్లుబాటైతే మాత్రం జగన్ పరువు కృష్ణానదిలో కలిసిపోయినట్లే అనుకోవాలి. అదే ఎంపిపై వేటుకు స్పీకర్ నిర్ణయిస్తే కృష్ణంరాజు కు దిమ్మతిరగటం ఖాయమనే అనుకోవాలి. ఎందుకంటే కృష్ణంరాజు  వైసిపి అభ్యర్ధిగా పోటి చేశాడు కాబట్టే గెలిచాడన్నది వాస్తవం. తన వ్యక్తిగత ఇమేజితోనే గెలిచాను కానీ పార్టీ మద్దతు వల్ల కాదని చెబుతున్న కృష్ణంరాజు రేపు ఉపఎన్నిక వస్తే అప్పుడు ఏమి జరుగుతుందో చూడాల్సిందే.

 

మరింత సమాచారం తెలుసుకోండి: