తెలుగుదేశంపార్టీ సీనియర్ నేత, మాజీమంత్రి కొల్లు రవీంద్రను పోలీసులు అరెస్టు చేశారు. మచిలీపట్నంలోని వైసిపి నేత మోకా భాస్కరరావును హత్య కేసులో నాలుగో నిందితుడుగా ఉన్న కొల్లును శుక్రవారం రాత్రి తుని నుండి విశాఖపట్నం వైపు వెళుతుంటే పోలీసులు గుర్తించారు. ఉదయం కొల్లు ఇంటికి వెళ్ళిన పోలీసులకు మాజీమంత్రి కనబడలేదు.  అరెస్టు కాకుండా మాజీమంత్రి  తప్పించుకు తిరుగుతున్నట్లు గుర్తించిన పోలీసులు ఇదే విషయాన్ని అన్నీ జిల్లాలకు  వివరించారు. రాత్రికి తునిలో అరెస్టయ్యాడు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే మోకా హత్య కేసులో ఇప్పటికే అరెస్టయిన టిడిపి లీడర్ చిన్నా తదితరులు కొల్లు ప్రోద్బలంతోనే తాము హత్య చేసినట్లు ఒప్పేసుకున్నారు. దాంతో కొల్లుపైన కూడా పోలీసులు కేసు నమోదు చేసి అరెస్టుకు ప్రయత్నించారు.

 

నాలుగు రోజుల క్రితం మోకా భాస్కరరావును  బందరులోని చేపల మార్కెట్లో హత్య చేసిన విషయం అందరికీ తెలిసిందే. మోకా హత్య ఘటన బందరులో సంచలనమే అయ్యింది. దాంతో పోలీసులు వెంటనే రంగంలోకి దిగి సిసి ఫుటేజి ఆధారంగా విస్తృతంగా గాలింపు మొదలుపెట్టారు. దాంతో హత్య జరిగిన రెండో రోజే చిన్ని అండ్ కో ను అదుపులోకి తీసేసుకున్నారు. విచారణలో వాళ్ళు కొల్లు ప్రమేయాన్ని బయటపెట్టడంతో  మాజీమంత్రిని అరెస్టు చేయక తప్పలేదు.  ముందుగా చిన్నా తదితరులే మోకాను హత్య చేయటానికి ప్లాన్ వేశారు. అయితే తాము చేయదలచుకున్న హత్యకు  మద్దతు కావాలని అడగ్గానే అందుకు మాజీమంత్రి అంగీకరించాడట. దాంతో హత్య విషయం కొల్లుకు ముందుగానే తెలుసని పోలీసులు నిర్ధారణకు వచ్చారు.

 

హత్యకు మద్దతు ఇచ్చాడు కానీ మరీ ఇంత బాహాటంగా పట్టుబడిపోయేట్లుగా వ్యవహరిస్తారని కొల్లు కూడా అనుకునుండడు. అందుకనే ధైర్యంగా హత్యకు మద్దతు పలికాడు. తీరా ఇపుడు అరెస్టయ్యాక మళ్ళీ బిసీ కార్డును చంద్రబాబునాయుడు అండ్ కో బయటకు తీస్తున్నారు.  ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ మంత్రిని ప్రాధమిక విచారణ కూడా చేయకుండా ఎలా అరెస్టు చేస్తారు ? తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నారంటూ చంద్రబాబు ట్విట్టర్లో  గగ్గోలు పెట్టేస్తున్నాడు.  ఏదేమైనా అధికారంలో ఉన్న వైసిపి నేతల హత్యకు ప్లాన్ చేస్తే విషయం బయటపడిన తర్వాత తమ అరెస్టు తప్పదన్న విషయాన్ని కూడా టిడిపి నేత మరచిపోయినట్లున్నాడు. బహుశా ఇంకా తామే అధికారంలో ఉన్నామని అనుకుంటున్నారో ఏమో అర్ధం కావటం లేదు.

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే శుక్రవారం టిడిపి నేతలకు అచ్చి రాలేదేమో అనిపిస్తోంది. మరో మాజీమంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అరెస్టయ్యింది, ఇపుడు కొల్లు అరెస్టయ్యింది కూడా శుక్రవారం రోజే . తన సహచరులేమో హత్యా రాజకీయాల్లో, అధికారంలో ఉన్నపుడు పాల్పడిన అవినీతికి ఇపుడు అరెస్టులవుతుంటే చంద్రబాబు మాత్రం కక్షా రాజకీయాలంటూ నానా యాగీ చేస్తున్నాడు. ఎక్కడైనా ఇరుక్కుంటేనే పోలీసులు అరెస్టులు చేస్తారు కానీ అసలు ఎటువంటి కేసులోను ఇన్వాల్వ్ కాకుండానే మాజీమంత్రులు, మాజీ ఎంఎల్ఏలపై తప్పుడు కేసులు పెట్టి అరెస్టులు చేసేంత సీన్ లేదన్న విషయం అందరికీ తెలిసిందే. చూద్దాం ఈ కేసు ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో.

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: