నర్సాపురం వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు గత కొద్ది రోజులుగా సొంత పార్టీకి మేకులా మారిన విషయం తెలిసిందే. దీంతో వైసీపీ ఎంపీలు, పలువురు ముఖ్య నేతలు ప్రత్యేక విమానంలో ఢిల్లీకి వెళ్ళి.. తమ పార్టీకి చెందిన ఎంపీ రఘురామకృష్ణంరాజు మీద అనర్హత వేటు వేయాలని లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లాకు ఫిర్యాదు చేశారు. ఈ విషయం కొంచం సేపు పక్కన పెడితే..

 

వాస్తవానికి రఘురామకృష్ణంరాజు చేసే వాదనల్లో చాలా శాతం స్పష్టత వుంది. కానీ, ఇదే స్పష్టత ఆయన్ని విమర్శించే వైసీపీ నేతల్లో మాత్రం కనపడటం లేదు. దానికి నిదర్శనం.. యువజన శ్రామిక రైతు కాంగ్రెస్‌ అని కాకుండా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ అనే పేరుతో ఆయనకి షోకాజ్‌ నోటీసు ఇవ్వడం. పైగా రఘురామకృష్ణంరాజుకి కేంద్ర పెద్దల ఆశీస్సులు పుష్కలంగా ఉన్నాయి.. ఇది అందరికీ తెలిసిన ఓపెన్‌ సీక్రెట్‌. మరి అలాంటి రఘురామకృష్ణంరాజుపై అనర్హత వేటు వేయాలని ప్రత్యేక విమానంలో వైసీపీ నేతలు ఢిల్లీ వెళ్ళడం వల్ల ఏం లాభం..?

 

రాజకీయ వర్గాల్లో ఉన్న సమాచారం మేరకు.. దీని వల్ల ప్రయోజనం లేదని వీరికి కూడా తెలుసంట.. కానీ, అధినేత ఆదేశాల మేరకు అయిననూ పోయి రావలె హస్తినకు అనే రీతిలో వీరు ఢిల్లీకి వెళ్ళినట్టు తెలుస్తుంది. అసలు నేను పార్టీ మారను మొర్రో అని రఘురామకృష్ణంరాజు చెప్తున్నా కూడా వైసీపీ ఎంపీలు ఢిల్లీ ఎందుకు వెల్లారంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు. అలాగే అది పార్టీ ఖర్చుతో ఏర్పాటు చేసిన ప్రత్యేక విమానమా.? ప్రభుత్వ ఖర్చుతో ఏర్పాటు చేసిన విమానమా.? అనే సందేహాలు కూడా వ్యక్తం చేస్తున్నారు ఆంధ్రులు.

 

అసలు ఎంపీ అడుగుతున్నట్లుగా ‘యువజన శ్రామిక రైతు కాంగ్రెస్‌’ పేరుతో షోకాజ్‌ నోటీస్‌ ఇచ్చేస్తే.. ఆయన వివరణ ఇస్తారేమో కదా అని కొందరు ప్రభుత్వానికి సూచిస్తున్నారు. ఏది ఏమైనా ఈ ఢిల్లీ టూర్ మాత్రం వైసీపీని బాగా ఇరకాటంలో పడేసిందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. మరి ఆంధ్రుల మనసులో ఉన్న ఇలాంటి సందేహాలకు వైసీపీ నేతలు క్లారిటీ ఇస్తారో లేదో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: