ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయంలో పెను మార్పులు చోటుచేసుకోబోతున్నాయా..? మాజీ ఎంపీ సబ్బం హరి మాటల్లో దాగున్న అంతరార్ధం ఏంటి..? నిజంగానే సీఎం జగన్ ఆశలు అడియాసలు కాబోతున్నాయా..? అనే అంశాలను పరిశీలిద్దాం.. అసలు సబ్బం హరి ఏం మాట్లాడారో ఒకసారి చూద్దాం..

 

అమరావతిపై వైసీపీ నాయకులు మాట్లాడే మాటలు గుండెల్లో గుబులు రేపేలా ఉన్నాయన్నారు మాజీ ఎంపీ సబ్బం హరి. అమరావతి ఉద్యమం 200 రోజులు పూర్తి చేసుకున్న నేపధ్యంలో ఆయన మాట్లాడుతూ.. కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. విశాఖపట్నంలో రాజధాని వద్దు అని చెప్పే మొదటి వ్యక్తిని తానే అవుతానని. అసలు అమరావతి ఉద్యమాన్ని ప్రభుత్వం ఏ మాత్రం పట్టించుకోవడం లేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే తొలుత మండలి రద్దు చేస్తామని చెప్పిన వైసీపీ తర్వాత కొనసాగించడం దేనికి సంకేతమని ఆయన నిలదీశారు.

 

అదేవిధంగా రాష్ట్రంలో మరో  ఏడాది కాలంలో ముఖ్యమంత్రి స్ధానంలో జగన్ మోహన్ రెడ్డి కాకుండా వేరే వ్యక్తి ఉండే అవకాశం ఉంటుంది అనే సమాచారం ఉందని సబ్బం హరి పెద్ద బాంబ్ పేల్చారు. 2022లో జమిలి ఎన్నికలు వచ్చే అవకాశం ఉంది అని ఆయన అభిప్రాయపడ్డారు. అదే జరిగితే అమరావతి రాజధానిగా ఉంటుందని ఆయన వివరించారు. 60 ఏళ్లపాటు హైదరాబాద్ లో ఇటుక ఇటుక కట్టి అభివృద్ధి చేస్తే కట్టుబట్టలతో బయటకు పంపారన్నారు. రాష్ట్రం విడిపోయిన తరువాత అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రభుత్వం మన ఆశలకు రూపకల్పన చేసింది కానీ ప్రభుత్వం మారడం వలన ప్రజలు రోడ్లుపైకి రావడం జరిగిందన్నారు.

 

అసలు సబ్బం హరి మాటలు వింటే ఎవరికైనా నవ్వొస్తుంది.. సీఎం జగన్ అమరావతి రాజధానిగా వద్దు అని ఎక్కడా అనలేదు.. అమరావతితో పాటు మరో రెండు రాజధానులు కూడా ఉండాలని చెప్పారు. అలాగే మండలి రద్దు ఇప్పట్లో జరిగే ప్రక్రియ కాదు అని అర్ధ చేసుకున్న సీఎం జగన్ మండలిలో బలం కోసం ప్రయత్నాలు చేస్తున్నారు.. ఇది అందరికీ తెలిసిన విషయమే. ఇక పోతే జగన్ అధికారం చేపట్టి సంవత్సర కాలం దాటింది. ఈ సంవత్సర కాలంలోనే ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి.. ప్రజల్లో మంచి పేరు సంపాదించుకున్నారు. తన పాలనతో దేశంలోనే తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నాడు. పైగా కేంద్ర పెద్దలతో కూడా మంచి సంబంధాలే ఉన్నాయి. మరి ఇలాంటి పరిస్తితుల నడుమ జగన్ స్థానంలోకి వేరొకరు రావడం అనేది పగటి కలే అని చెప్పాలి. అయినా సబ్బం హరి, చంద్రబాబుకి ఎంత భజనపరుడో అందరికీ తెలిసిందే. కాబట్టి ఆయన మాటలను అసలు పట్టించుకోవాల్సిన అవసరం లేదని వైసీపీ వర్గాలు చెప్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: