రాజకీయాలు అనేవి తెర ముందు ఒకలా.. తెర వెనుక మరోలా జరుగుతాయి. ఇది అందరికీ తెలిసిన విషయమే. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో కూడా అదే జరుగుతుంది. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఏదో ఒప్పందం కుదిరినట్టు అర్ధం అవుతుంది.

 

అధికారంలోకి రాకముందు ప్రత్యేక హోదాపై గొంతెత్తి అరిచిన వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. అధికారంలోకి వచ్చిన తర్వాత దాని ఊసే ఎత్తట్లేదు. 25 మంది ఎంపీలని ఇస్తే ప్రత్యేక హోదా తెస్తానని చెప్పిన జగన్ మోహన్ రెడ్డి.. 22 మంది ఎంపీలున్నా కనీసం హోదా గురించి కేంద్ర ప్రభుత్వాన్ని అడిగే ప్రయత్నం చేయట్లేదు. హోదా వలన రాష్ట్రానికి ఒరిగేదేమీ లేదని స్వయంగా వైకాపా నేతలే మాట్లాడారు. ఈ ఉద్దేశ్యపూర్వక నిర్లక్ష్యం కారణంగా ప్రజల్లో సైతం హోదా మీద మొదట్లో ఉన్నంత పంతం ఇప్పుడు లేదు. 

 

హోదా మాటెత్తితే ఇంకెక్కడి హోదా అంటూ పెదవి విరుస్తున్నారు.  వేల కోట్లు పోసి, వేల మంది రైతుల నుండి భూములు తీసుకుని గత ప్రభుత్వం నిర్మాణం చేస్తున్న రాజధానిని తర్వాత వచ్చిన ప్రభుత్వం ఆపేయడం అంటే మామూలు విషయం కాదు. దీని వల్ల రాష్ట్ర భవిష్యత్తు, అమరావతి రైతుల భవిష్యత్తు అయోమయంలో పడిపోయాయి. అలాగే రాష్ట్రం ప్రభుత్వం ప్రకటించిన ఒక రాష్ట్రానికి మూడు రాజధానుల అంశం కూడా కత్తి మీద సాము లాంటిదేనని చెప్పాలి. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తగ్గే సూచనలు కనిపించట్లేదు. ఒక రాష్ట్ర ప్రభుత్వం ఇలాంటి ప్రమాదకర నిర్ణయం తీసుకుని దాన్ని అమలు చేయడం కోసం ధన నష్టాన్ని, ప్రజల వ్యథల్ని పట్టించుకోకుండా ముందుకు వేళుతోందంటే వెనుక పెద్ద శక్తుల అండ తప్పకుండా ఉండి తీరాలి.

 

కేంద్ర ప్రభుత్వం నేరుగా ఇంతవరకు సీఎం జగన్ ప్రభుత్వం తీసుకున్న మూడు రాజధానుల అంశాన్ని ఖండించలేదు. ఈ విషయంలో తెర వెనుక ఒక ఒప్పందం జరిగిందని రాజకీయ వర్గాల్లో టాక్. ఆ ఒప్పందం ఏంటంటే.. కేంద్ర ప్రభుత్వం మూడు రాజధానుల అంశంలో జోక్యం చేసుకోకుండా ఉండాలంటే.. రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యక హోదా మర్చిపోవలని. దీనికి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒకే చెప్పిందని సమాచారం. ఇలా ఎవరి స్వార్ధం కోసం వాళ్ళు ఒప్పందాలు చేసుకుని. రాష్ట్ర భవిష్యత్తుని అంధకారంలోకి నెట్టడం ఎంతవరకు సబబు.

మరింత సమాచారం తెలుసుకోండి: