పవన్ కళ్యాణ్.. మెగాస్టార్  చిరంజీవి తమ్ముడిగా సినీ ప్రవేశం చేసి.. ఆ తర్వాతి కాలంలో తనకంటూ ఒక సొంత గుర్తింపు తెచ్చుకుని.. అతి తక్కువ సమయంలో పవర్ స్టార్ గా ఎదిగిపోయాడు. మిగిలిన హీరోలతో పోల్చుకుంటే పవన్ కళ్యాణ్ కి ఫ్యాన్ బేస్ కొంచం ఎక్కువే. ఈ ఫాలోయింగే ఆయనని అగ్ర స్థానంలో కూర్చోబెట్టింది. తెలుగు నేల మీద ఒక పేరు పక్కన ‘ఇజం’ అంటూ అభిమానులు పూనకం వచ్చినట్లుగా ఊగిపోయిన ప్రముఖులు ఎవరైనా ఉన్నారా? అంటే అది పవన్ కల్యాణ్ అనే చెప్పాలి. అయితే చిరంజీవి స్థాపించిన “ప్రజారాజ్యం” పార్టీ తరుపున ఎన్నికల ప్రచారం చేసి తనలోని రాజకీయ నాయకుడ్ని ప్రజలకు పరిచయం చేశారు పవర్ స్టార్. కాకపోతే ఎన్నికల అనంతరం ఆ పార్టీ కాంగ్రెస్ లో విలీనం అయిపోయింది. దీంతో పవన్ కళ్యాణ్ మళ్ళీ సినిమాలతో బిజీ అయిపోయాడు.

 

అయితే పవన్ లో ఒక నాయకుడ్ని చూసిన ఆయన అభిమానులు మాత్రం ఆయన ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలని ఆశపడ్డారు. అభిమానులు ఆశపడ్డట్టుగానే.. పవన్ కళ్యాణ్ 2014 ఎన్నికల ముందు “జనసేన” పార్టీని స్థాపించి ప్రత్యక్ష రాజకీయాల్లోకి పాదం మోపారు. ప్రశ్నించడానికే నా పార్టీ.. ప్రజల తరుపున పోరాడటానికే నేను అని చెప్పిన పవన్.. కొన్ని అనివార్య కారణాల వల్ల 2014 ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండిపోయి.. ఎన్డీఏతో చేతులు కలిపి పొత్తులో భాగంగా టీడీపీ-బీజేపీలకి మద్దతు పలికి వారి విజయంలో భాగస్వాములయ్యారు.

 

ఆ తర్వాత కాలంలో ఆంధ్రులకు అన్యాయం చేస్తున్నారంటూ టీడీపీ, బీజేపీల మీద తీవ్ర విమర్శలు చేశారు. అటు కేంద్ర ప్రభుత్వాన్ని, ఇటు రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రత్యేక హోదా విషయంలో నిలదీశారు. అలాగే ప్రతిపక్ష నేత జగన్ మోహన్ రెడ్డి మీద కూడా ఒంటి కాలు మీద లేచారు. ఆ తర్వాత జరిగిన 2019 ఎన్నికల్లో సొంతంగా ముందుకు వెళ్ళి బొక్కబోర్లా పడ్డారు. ఆఖరికి రెండు చోట్ల పోటీ చేసిన పవన్ కూడా గెలవలేకపోయారు. కేవలం రాపాక అనే ఒక్కే ఒక్క ఎమ్మెల్యే మాత్రమే జనసేన నుంచి విజయం సాధించారు.

 

మళ్ళీ ఎన్నికల అనంతరం బీజేపీతో పొత్తు పెట్టుకుని, వారితో కలిసి ప్రయాణిస్తున్నారు. 2019 ఎన్నికలల్లో ఘన విజయం సాధించి.. కొత్తగా ఏర్పడిన వైసీపీ ప్రభుత్వాన్ని మొదట్లో తీవ్రంగా విమర్శించిన పవన్, ఇప్పుడు మాత్రం మెచ్చుకుంటున్నారు. నేను నిజాయితీగా ఉంటాను. ముక్కుసూటిగా మాట్లాడతాను. నాకు సమర్థత ఉంది. పక్షపాతం లేదు.. ప్రజలకు కీడు చేసే ఏ పని చేయనని అనుకోవటం తప్పేం కాదు. కానీ.. ఆ క్రమంలో ఏం చేయాలి? ఏం చేయకూడదన్న విషయం చాలా కీలకం. రాజకీయ ప్రత్యర్థులు ఏదైనా మంచిపని చేసినప్పుడు పొగడాల్సిన అవసరం లేదు. అలా అని తిట్టాల్సిన అవసరం లేదు. మౌనంగా ఉంటే సరిపోతుంది. కానీ, జనసేన అధినేతకు మాత్రం ఇది ఇంకా అర్ధం కావట్లేదు. రాజకీయాల్లోకి ఆయన ఏ లక్ష్యంతో అయితే అడుగుపెట్టారో.. ఆ లక్ష్యం ఇప్పుడు కనపడట్లేదు.

 

నిజంగా చెప్పాలంటే.. పవన్ కళ్యాణ్ పార్టీ స్థాపించినప్పుడు రాష్ట్ర యువతలో ఆశలు  చిగురించాయి. ప్రజాపక్షాన పోరాడేందుకు ఒక నాయకుడు వచ్చడంటూ ఆనంద పడ్డారు. అప్పటికీ సినిమాల్లో ఆయనకి చాలా అవకాశాలు ఉన్నాయి.. కానీ, రాజకీయాల కోసం, ప్రజల తరుపున పోరాడటం కోసం వాటిని వద్దనుకొని రాజకీయాల్లోకి అడుగుపెట్టినట్టు పవన్ చెప్పారు. అయితే, ప్రస్తుతం పవన్ రాజకీయాలు చూస్తుంటే అయోమయంగా ఉన్నాయి. మళ్ళీ రెండు పడవల మీద ప్రయాణంలా అటు సినిమాలు.. ఇటు రాజకీయాలు చేస్తున్నారు. ఇలా చేయడం తప్పేం కాదు.. కానీ, నాయకుడన్న తర్వాత ఇచ్చిన మాట మీద నిలబడటం నేర్చుకోవాలి. ఇప్పటికైనా మించిపోయింది ఏమీ లేదు.. పవన్ కళ్యాణ్ ఏ లక్ష్యంతో అయితే రాజకీయాల్లోకి అడుగుపెట్టారో.. ఆ లక్ష్యం దిశగా ప్రయాణిస్తే ఆయన గమ్యం చేరే అవకాశం ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: