టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడి రాజకీయ జీవితం ఇక ముగిసినట్టేనా..? దేశ రాజకీయాల్లో చక్రం తిప్పిన ఈ రాజకీయ చాణక్యుడు ఇప్పుడు బొక్కబోర్లా పడ్డాడా..? నా అనుకున్న వాళ్ళే ఆయనని నట్టేట ముంచుతున్నారా..? చంద్రబాబు ఏకాకి కాబోతున్నారా..? జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అవునని చెప్పక తప్పదు.

 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయ చరిత్రను చూసుకుంటే ఇప్పటి వరకు ఎందరో ముఖ్యమంత్రులు రాష్ట్రాన్ని పాలించారు. ఎవరి గొప్పతనం వాళ్ళది. అందరిలో మంచి, చెడులు ఉన్నాయి. ఇదంతా పక్కనపెట్టి చంద్రబాబు నాయుడి విషయానికొస్తే.. 2004 లో రాజశేఖర్ రెడ్డి విజయం సాధించి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. దీంతో చంద్రబాబు ప్రతిపక్షానికే పరిమితమైపోయారు. రాజకీయంగా అధికార, ప్రతిపక్షాల మధ్య విమర్శలు సర్వసాదరణం.

 

 అయితే పార్టీ అధినేతల మీద మాత్రం పక్కా పార్టీ వాళ్ళు విమర్శలు చేస్తే దాన్ని ఎవరూ సహించారు. ఇది రాజశేఖర్ రెడ్డి హయాంలో కూడా జరిగింది. ఆయనని ఎవరు విమర్శించినా, కాంగ్రెస్ లో అప్పుడు ఉన్న ఎమ్మెల్యేలు, మంత్రులు అందరూ కూడా వైఎస్ఆర్ ని విమర్శించిన వారిపై తీవ్ర స్థాయిలో స్పందిస్తూ విమర్శలు చేసిన సందర్భాలు ఎన్నో ఉండేవి. కార్యకర్తలు కూడా ఆయనను ఒక్క మాట అన్నా సరే అదే స్థాయిలో ఘాటుగా స్పందిస్తూ విమర్శలను ఘాటుగా తిప్పికొట్టిన అనే సందర్భాలు మనం చూసాం.

 

ఆ తర్వాతి కాలంలో ఆంధ్రప్రదేశ్ రెండుగా చిలిపోయింది. ప్రత్యేక తెలంగాణ ఏర్పడింది. ఆ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా ఉద్యమనేత కేసీఆర్ బాధ్యతలు చేపట్టారు. ఆయన విషయంలో కూడా ఇదే సీన్ రిపీట్ అయింది. అధినేత కేసీఆర్ ని ఎవరు విమర్శించిన సరే.. నియోజకవర్గ స్థాయి నాయకుల నుంచి ఎమ్మెల్యేలు, మంత్రులు అందరూ ఘాటుగా సమాధానాలు ఇస్తూ ఉంటారు.

 

ఇకపోతే 2019 లో భారీ విజయాన్ని సాధించి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బాధ్యతలు చేపట్టారు. ఆయన విషయంలో కూడా ఇదే సీన్.. ఆయనని ప్రత్యర్ధి పార్టీ నేతలు ఎవరన్నా విమర్శిస్తే అంతే సంగతులు.. కార్యకర్తలు, ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు అందరూ మూకుమ్మడిగా మాటల దాడి చేస్తారు. ఒకవిధంగా చూసుకుంటే ఇదంతా అధినేతల బలం అని చెప్పాలి. ఇక టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు విషయానికొస్తే.. ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఇదే సీన్ రిపీట్ అయింది. అలాగే ప్రతిపక్షంలోకి పడిపోయిన ప్రతీసారి ఎవరొకరు ఆయనకి తోడుగా ఉంటూ.. ప్రత్యర్ధి నేతల విమర్శలకి, ప్రతివిమర్శలు సంధించేవారు.

 

కానీ, ప్రస్తుతం అలాంటి పరిస్థితి కనపడట్లేదు. చంద్రబాబుని ప్రత్యర్ధులు ఎన్ని విమర్శలు చేస్తున్నా సరే, పార్టీలో ఉన్న ఏ ఒక్క నాయకుడు దానిపై స్పందించట్లేదు ఒక్క కార్యకర్తలు తప్ప. ఏదో మొక్కుబడి కింద సోషల్ మీడియా వేదికగా ఒకరిద్దరు మాట్లాడుతున్నారే తప్ప.. మిగిలిన సీనియర్ నేతలెవరూ స్పందించట్లేదు. ఇదంతా గమనిస్తే.. చంద్రబాబు రాజకీయంగా వీక్ అయిపోయినట్టు కనబడుతుంది. అందుకే నేతలంతా ఎవరి దారి వారు చూసుకుంటున్నట్టు తెలుస్తుంది. పరిస్థితి ఇలానే ఉంటే భవిష్యత్తులో టీడీపీలో ఆయనతో పాటు ఒకరిద్దరు తప్పా.. ఇంకెవరూ ఉండేలా లేరని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: